టీటీడీ ఆస్పత్రుల్లో జనరిక్‌ మందులు పెంచండి

ABN , First Publish Date - 2021-08-04T06:21:36+05:30 IST

టీటీడీ ఆస్పత్రుల్లో జనరిక్‌ మందులను ప్రోత్సహిస్తూ.. వాడకం పెంచాలని అధికారులను ఈవో డాక్టర్‌ ఎస్‌.జవహర్‌రెడ్డి ఆదేశించారు.

టీటీడీ ఆస్పత్రుల్లో జనరిక్‌ మందులు పెంచండి

అధికారుల సమీక్షలో టీటీడీ ఈవో జవహర్‌ రెడ్డి


తిరుపతి సిటీ, ఆగస్టు 3: టీటీడీ ఆస్పత్రుల్లో జనరిక్‌ మందులను ప్రోత్సహిస్తూ.. వాడకం పెంచాలని అధికారులను ఈవో డాక్టర్‌ ఎస్‌.జవహర్‌రెడ్డి ఆదేశించారు. టీటీడీ నిర్వహణలోని ఆస్పత్రులన్నింటికీ కేంద్రీకృత కొనుగోలు విభాగం నుంచి మందులు, వైద్య పరికరాలు కొనాలన్నారు. తిరుపతిలోని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో మంగళవారం సాయంత్ర మందులు, వైద్య పరికరాల కొనుగోలు విధానంపై ఆయన సమీక్షించారు. స్విమ్స్‌లో మందులు, పరికరాల కొనుగోలు కోసం టెండర్లు నిర్వహిస్తున్న విధానం గురించి తెలుసుకున్నారు. టెండర్‌ కాల పరిమితి పూర్తి కావడానికి నాలుగు నెలల ముందు నుంచే మళ్లీ టెండర్లు ఆహ్వానించేందుకు కసరత్తు ప్రారంభించాలన్నారు. ఏ మందులు కావాలో ప్రతిపాదనలు పంపే అధికారులు.. వాటి నాణ్యతను నిర్ధారించే కమిటీలో ఉండకూడదని చెప్పారు. ప్రభుత్వ డ్రగ్‌ కంట్రోల్‌ విభాగం నుంచి ఈ కమిటీలో ఒకరిని నియమించాలని సూచించారు. రెండేళ్లకు సరిపడా మందులను ఒకేసారి కొనాలన్నారు. దీనికి నిమ్స్‌, నింహ్యాన్స్‌ ఆస్పత్రులు అవలంభిస్తున్న విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో మందులు ఏ ధరకు సరఫరా చేస్తున్నారో తెలుసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవో సదాభార్గవి, ఎఫ్‌ఏ అండ్‌ సీఏవో బాలాజీ, సీఈ నాగేశ్వరరావు, బర్డ్‌ ఆర్‌ఎంవో శేష శైలేంద్ర, స్విమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌, టీటీడీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మురళీధర్‌, స్విమ్స్‌ కొనుగోలు విభాగం అధికారులు డాక్టర్‌ వెంకటరామిరెడ్డి, డాక్టర్‌ ఎర్రమరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


‘శ్రీవారి ట్రస్ట్‌’ ఆలయాలకు ప్రత్యేక ఇంజనీరింగ్‌ విభాగం

శ్రీవారి ట్రస్టు నిధులతో చేపట్టే ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేకంగా ఇంజనీరింగ్‌ విభాగం ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి ఆదేశించారు. తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో మంగళవారం ఆయన శ్రీవారి ట్రస్టుపై అధికారులతో సమీక్షించారు. శ్రీవారి ట్రస్టు ద్వారా ఏ ఆలయాల్లో అభివృద్ధిపనులు చేయాలో ఆ ఆలయ స్థలపురాణం, ప్రాశస్త్యం, ఇప్పటి వరకు పూజలు జరుగుతున్నాయా? లేదా? పునరుద్ధరణ లేదా అభివృద్ధి పనుల ద్వారా భక్తులు ఏ మేరకు ఆ ఆలయానికి వెళ్తారు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుకోవాలన్నారు. ప్రతిపాదన నుంచి అభివృద్ధి పనులు పూర్తి చేయడం వరకు సమయ నిబద్ధత పెట్టుకోవాలన్నారు. పురాతన ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపట్టేటప్పుడు నిర్మాణంలోని డిజైన్‌ దెబ్బతినకుండా చూడాలన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా అభివృద్ధి చేయాల్సిన ఆలయాల పనులకు అనుమతులు మంజూరు చేశారు. ఈ సమావేశంలో అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవో సదాభార్గవి, ఎఫ్‌ఏ అండ్‌ సీఏవో బాలాజీ, సీఈ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో రమణ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-04T06:21:36+05:30 IST