పూర్తికాని ధాన్యం కొనుగోళ్లు

ABN , First Publish Date - 2022-05-22T05:35:06+05:30 IST

రుతు పవనాలు సమీపిస్తున్నాకొద్దీ రైతుల గుండెల్లో గుబులు రేకెత్తుతున్నది.

పూర్తికాని ధాన్యం కొనుగోళ్లు

 - సమీపిస్తున్న వానాకాలం.. ఆందోళనలో రైతులు

- కొనుగోలు అంచనా 3.4 లక్షల మెట్రిక్‌ టన్నులు

- కొనుగోలు చేసింది 1.46 లక్షల మె.టన్నులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రుతు పవనాలు సమీపిస్తున్నాకొద్దీ రైతుల గుండెల్లో గుబులు రేకెత్తుతున్నది. నైరుతి రుతు పవనాలు మూడు రోజులు క్రితం అండమాన్‌ దీవులను తాకగా త్వరలోనే కేరళ మీదుగా దేశంలో విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ వేత్తలు చెబుతున్నారు. క్యుములోనింబస్‌ మేఘాలు, అల్పపీడనాల కారణంగా అక్కడక్కడా వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం అమ్ముకోని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కొనుగోళ్లు వేగవంతంగా జరగకపోవడం,  కేంద్రాల్లోని ధాన్యాన్ని తరలించడంలో జాప్యం కారణంగా ధాన్యం కేంద్రాల్లోనే పేరుకుపోతున్నది. రైతుల ఇళ్ల వద్ద ఇంకా అమ్ముడుపోకుండా సగం ధాన్యం ఉండడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో యాసంగిలో రెండు లక్షల 46 వేల ఎకరాల్లో వరిసాగు జరగగా, ఎకరాకు సగటున 23 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. 5.65 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం దిగుబడి వస్తుందని అందులో విత్తనపు పంట, రైతులు తమ అవసరాలకు వినియోగించుకునే ధాన్యం పోనూ సుమారు 3 లక్షల 40 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు.


 జిల్లాలో 354 కొనుగోలు కేంద్రాలు


 జిల్లాలో ధాన్యం కొనుగోలు కోసం 354 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 19 వరకు జిల్లావ్యాప్తంగా 1,46,446 మెట్రిక్‌ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో ఇంకా 2,814 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించాల్సి ఉన్నది. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై సుమారు నెలరోజులు కావస్తున్నా అంచనా వేసి ధాన్యంలో ఇప్పటి వరకు సగం మేరకు కొనుగోళ్లు పూర్తయ్యాయి. తేమశాతం ఎక్కువగా ఉందని, ధాన్యం శుభ్రం చేయలేదని కొర్రీలు పెడుతున్న కారణంగా ధాన్యం కొనుగోళ్లు ఆశించినంత వేగంగా జరగడం లేదు. ఈ కారణాలతోనే రైస్‌ మిల్లర్లు వరిధాన్యం దింపుకోవడానికి నిరాకరిస్తుండడంతో వారి డిమాండ్‌ మేరకు కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు 2 నుంచి 6 కిలోల ధాన్యం తరుగు కింద అదనంగా రైతుల వద్ద నుంచి తూకం వేస్తున్నారు. దీంతో రైతులు వేలాది రూపాయలు నష్టపోతున్నారు. 


 సగం పూర్తయిన కొనుగోళ్లు


ఇప్పటి వరకు 20,033 మంది రైతుల నుంచి 1,46,446 మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేశారు. ఈ ధాన్యం విలువ 287 కోట్ల 4 లక్షల రూపాయలు. కొనుగోలులోనే జాప్యం కాకుండా కొన్న ధాన్యాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు సిబ్బంది జాప్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు  14,930 మంది రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లను మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. 287 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేస్తే 197.6 కోట్ల ధాన్యం వివరాలు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు కావడంతో రైతులకు డబ్బులు చెల్లించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఇప్పటి వరకు 8,842 మంది రైతులకు 115 కోట్ల 90 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించారు. ఇంకా 11,191 మంది రైతులకు 171 కోట్ల 14 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉన్నది. 


 ఆన్‌లైన్‌లో నమోదులో జాప్యం


ధాన్యం కొనుగోలు చేసిన రెండు, మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని చెప్పినా ఆ కాల పరిమితిలో ఆన్‌లైన్‌లో ధాన్యం కొనుగోళ్లు నమోదు పూర్తి కావడం లేదు. ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు నమోదైన తర్వాత డబ్బు చెల్లించడానికి మరో మూడు, నాలుగు రోజులు పడుతున్నది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవడానికి 15 రోజులు పడుతుంటే, అమ్మిన తర్వాత డబ్బులు రావడానికి మరో 10 రోజులు వేచి చూడాల్సి వస్తున్నది. ధాన్యం కొనుగోలు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు మరింత ఎక్కువ మంది సిబ్బందిని నియమించాలని, కొనుగోళ్లు వేగవంతం చేయడానికి అవసరమైన సిబ్బందిని నియమించాలని రైతులు కోరుతున్నారు. విత్తనపంట వేసిన హుజూరాబాద్‌ రెవెన్యూ డివిజన్‌లో ఆయా కంపెనీలు ధాన్యం కొనుగోళ్లు చేయగా, కొద్దోగొప్పో సాధారణ పంట వేసినవారు ఆ ధాన్యాన్ని అమ్ముకున్నారు.  జిల్లాలోని మిగతా మండలాల్లో ఇంకా సగం ధాన్యం రైతుల వద్దే ఉన్నది. వర్షాకాలం సమీపిస్తుండడంతో ధాన్యం తడిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం అమ్మిన డబ్బులు చేతికి వస్తే వానాకాలం సాగుకు ఇబ్బంది లేకుండా ఉంటుందని  వారు ఆశిస్తున్నారు. ధాన్యం కొనుగోలును మరింత వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. 

 

మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా అన్‌లోడ్‌ చేసుకోవాలి

-  మంత్రి గంగుల కమలాకర్‌


కరీంనగర్‌, మే 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని రైస్‌ మిల్లర్లు త్వరగా అన్‌లోడ్‌ చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ రైస్‌ మిల్లర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ధాన్యాన్ని త్వరగా తూకం వేసి రైతులకు రశీదులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని రైస్‌ మిల్లర్లు త్వరగా అన్‌లోడ్‌ చేసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు.  కార్యక్రమంలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, మేయర్‌ వై సునీల్‌రావు, అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌, సివిల్‌ సప్లయీస్‌ అధికారి సురేశ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-22T05:35:06+05:30 IST