చేతకాని సీఎం.. ఏంటీ డ్రామాలు

ABN , First Publish Date - 2022-07-29T08:55:13+05:30 IST

చేతకాని సీఎం.. ఏంటీ డ్రామాలు

చేతకాని సీఎం.. ఏంటీ డ్రామాలు

2 వేలిచ్చి.. 4 వేల సార్లు చెబుతున్నావ్‌!

ఈ సీఎంకు సున్నా మార్కులే.. పోలవరం కట్టలేనని చేతులెత్తేశారు

20 వేల కోట్లు ఎక్కడి నుంచి తేవాలంటారా?.. 41.15 కాంటూరుకే 

డబ్బులిస్తానంటూ ఇప్పుడు కొత్త డ్రామా ఆడుతున్నారు

మిగిలిన వాళ్లు ఏం పాపం చేశారు?.. అందరికీ న్యాయం చేయాల్సిందే

వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే కేంద్రం ఎందుకు దిగిరాదో చూద్దాం

జగన్‌కు గడ్డి పెడితేనైనా కాస్త విశ్వసనీయత వస్తుందేమో!

రూ.2 వేలతో వరద బురదా పోదు.. కోడి కత్తి కమలహాసన్‌ డ్రామాలాపు

టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్‌.. ముంపు ప్రాంతాల్లో పర్యటన 

గోడు వెళ్లబోసుకున్న బాధితులు.. ప్రత్యేక పోలవరం జిల్లాకు బాబు హామీ


ఏలూరు, జూలై 28 (ఆంద్రజ్యోతి): పోలవరం కట్టలేనని సీఎం జగన్‌ చేతులెత్తేశారని టీడీపీ 

అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘రూ.వెయ్యి, రెండు వేల కోట్లయితే ఇస్తారంట.. కానీ రూ.20 వేల కోట్లు ఎక్కడి నుంచి తేవాలంటున్న ఈ వ్యక్తి  రాష్ర్టానికి సీఎంగా ఉండడం మన దౌర్భాగ్యం. వరద సాయం కింద రూ.రెండు వేలిచ్చి 4 వేల సార్లు 

చెప్పుకొంటున్నావ్‌. ఇదేం పాలన..’ అని మండిపడ్డారు. నాలుగు ఉల్లిపాయలు, నాలుగు బంగాళాదుంపలు ఇచ్చి వరద సాయం అంటున్న జగన్‌కు జనం గడ్డి పెట్టే రోజులు వస్తున్నాయని.. కలెక్టర్లకు మార్కులిస్తానంటున్న ఈ ముఖ్యమంత్రికి తానైతే సున్నా మార్కులిస్తానని స్పష్టం చేశారు. జనాలు కష్టాల్లో ఉంటే తాడేపల్లి ప్యాలె్‌సలో ఏం చేస్తున్నావని జగన్‌ను నిలదీశారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో గురువారం చంద్రబాబు పర్యటించారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని పునరావాస కేంద్రాల్లో నిర్వాసితులను పరామర్శించారు. 15 రోజులుగా నరకయాతన అనుభవిస్తున్న బాధితులు తమ ఆవేదనను ఆయన వద్ద ఒక్కసారిగా వెళ్లగక్కారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వలేదని, వరద నష్టం కింద రూ.2 వేలు ముష్టి వేస్తున్నారని, ఉడికీ ఉడకని అన్నం, కూరలు వండి వారుస్తున్నారని వాపోయారు. 41.15 కాంటూరుకు మాత్రమే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తిస్తుందని, 45.72కి ఇవ్వడం కుదరదన్న సీఎం ప్రకటనపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘41.15 మీటర్ల కాంటూరుకే పరిహారం డబ్బులిస్తానంటూ జగన్‌ కొత్త నాటకం మొదలుపెట్టారు. మిగిలిన వాళ్లు ఏం పాపం చేశారు..? ముంపు ప్రాంతాల్లో ఉన్న అందరికీ న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాడుతుంది. కేంద్రం మెడలు వంచుతానని ప్రగల్భాలు పలికిన జగన్‌ ఇప్పుడు చేతులు కట్టుకుని కూర్చున్నారు. 22 మంది వైసీపీ ఎంపీలూ రాజీనామా చేసి రండి.. కేంద్రం ఎందుకు దిగిరాదో చూద్దాం. ఇన్ని సమస్యలు ఎదురుగా పెట్టుకుని సీఎం కోడికత్తి కమల్‌హాసన్‌ డ్రామాలాడుతున్నారు. పశువులకు పెట్టే గడ్డి పెడితేనైనా ఆయనకు విశ్వసనీయత వస్తుందేమో! ఇకనైనా 41.15డ్రామాలాపి, 45.72కి కూడా న్యాయం చేయండి. భారమైతే అయింది.. మేమంతా చందాలు వేసుకుని ఇస్తాం. ఒక బస్సులో పడుకొని ముంపు ప్రాంతాల సమస్యలు తీరేవరకు పనిచేసి వెళ్లు’ అని హితవు పలికారు. ఇంకా ఏమన్నారంటే.. ‘‘రూ.2 వేల సాయంతో వరద బురద కూడా పోదు. జగన్‌కు కష్టం వస్తే పాదయాత్ర చేస్తాడు. అదే ప్రజలకు వస్తే గాల్లో చక్కర్లు కొడుతూ తిరుగుతాడు. నేను పరామర్శలకు వస్తున్నాను కాబట్టే సీఎం పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. వరదలొచ్చి 15 రోజులు దాటినా బాధితులకు న్యాయం చేయలేని చేతకాని ప్రభుత్వమిది. నేను సీఎంగా ఉండగా హుద్‌హుద్‌ తుఫాన్‌ వస్తే 9 రోజులు విశాఖలోనే ఉండి పరిస్థితులు చక్కదిద్దాకే వెనక్కి వచ్చాను. ప్రజలు తిరగబడితే బట్టలూడగొట్టుకుని మరీ పారిపోయే పరిస్థితి తెచ్చుకోకండి. ముంపు ప్రాంతాల ప్రజలు రాష్ట్రం కోసం, అమరావతి ప్రజలు రాజధాని కోసం తమ భూములు త్యాగం చేశారు. అలాంటి త్యాగమూర్తుల కడుపు కొట్టడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. ముంపు ప్రాంతాలన్నిటినీ కలిపి ప్రత్యేక పోలవరం జిల్లాగా చేస్తా. పోలవరం కోసం త్యాగం చేసిన వారికి కానుకగా ఇస్తా.


అప్పుడు పది లక్షల నష్టపరిహారం ఇస్తానన్నారు.. ఇప్పుడు పది వేలే ఇస్తామంటున్నారు. గతంలో మీరు (చంద్రబాబు) రూ.5 వేలిచ్చి బాధితుల జాబితా సిద్ధం చేశారు. ఆ జాబితా బయటకు తీసి ఈ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేయండి. మళ్లీ మీరే సీఎంగా రావాలి. ఉడికీ ఉడకని అన్నం పెడుతున్నారు సార్‌.

నాకు భర్త లేడు.. బతికే ఆధారం లేదు. వరదల్లో ఇల్లు కూలిపోయింది. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేయాలి. ఇల్లూ లేక.. ఆధారమూ లేక ఎలా బతకాలి? మాకు న్యాయం చేయండి సార్‌.

అధికారులు, నాయకులు పడవల్లో షికారు చేస్తున్నారు. 45.72 కాంటూరుకు డబ్బులివ్వరంట..! టీడీపీ స్థానిక నేతలు, చింతమనేని మాత్రమే సాయమందిస్తున్నారు. వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పాలి సార్‌’

చంద్రబాబుకు వేలేరుపాడు, కుక్కునూరు వరద బాధితులు పెట్టుకున్న మొర ఇది.

Updated Date - 2022-07-29T08:55:13+05:30 IST