ఆదాయం డబుల్‌

ABN , First Publish Date - 2021-07-26T04:35:08+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం భూములు, ఓపెన్‌ ప్లాట్ల విలువను భారీగా పెంచడంతో ప్రభుత్వ ఖజానాకు రాబడి ఇబ్బడి ముబ్బడిగా పెరగనుంది. భూముల విలువను పెంచడంతో పాటు ఆరు శాతం ఉన్న రిజిస్ట్రేషన్‌ చార్జీలను సైతం 7.5 శాతానికి పెంచడంతో ఆదాయం రెట్టింపు కానుంది.

ఆదాయం డబుల్‌
ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారితో కిటకిటలాడుతున్న వనపర్తి రిజిష్టార్‌ కార్యాలయం(ఫైల్‌)

భారీగా పెరిగిన ప్లాట్లు... భూముల ధరలు

స్టాంపు డ్యూటీ 6 నుంచి 7.5 శాతానికి పెంపు

కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్‌ ఖర్చు రెట్టింపు

వనపర్తి రిజిస్ర్టేషన్ల శాఖకు కరోనాకు ముందు ఏడాది రూ.20 కోట్ల ఆదాయం

కొత్త ధరలతో రాబడి రెట్టింపయ్యే అవకాశం 8 ప్రస్తుతం తగ్గిన రిజిస్ట్రేషన్లు


 రాష్ట్ర ప్రభుత్వం భూములు, ఓపెన్‌ ప్లాట్ల విలువను భారీగా పెంచడంతో ప్రభుత్వ ఖజానాకు రాబడి ఇబ్బడి ముబ్బడిగా పెరగనుంది. భూముల విలువను పెంచడంతో పాటు ఆరు శాతం ఉన్న రిజిస్ట్రేషన్‌ చార్జీలను సైతం 7.5 శాతానికి పెంచడంతో ఆదాయం రెట్టింపు కానుంది. ధరల పెరుగుదలతో ఆస్తుల క్రయ విక్రయాలు తగ్గి, నష్టపోతామని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరగక ముందు వనపర్తి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజూ దాదాపు 70 నుంచి 80 డాక్యుమెంట్లు పూర్తవుతుండగా, ధరలు పెరిగిన నాటినుంచి 30 నుంచి 40 డాక్యుమెంట్లు మాత్రమే వస్తున్నాయని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.

- వనపర్తి(రాజీవ్‌ చౌరస్తా)


భూముల ధరల పెరుగుదలతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగే వనపర్తి జిల్లా నుంచి ప్రభుత్వానికి ఆదాయం డబుల్‌ కానుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలను ఆయా ఏరియాలను బట్టి పెంచారు. గతంలో మారుమూల గ్రామాలలో ఎకరం భూమి ధర తక్కువగా ఉండగా, ప్రస్తుతం రెట్టింపు చేశారు. ఇక పట్టణాలకు సమీపంలో ఉండి ఽమార్కెట్‌ విలువ మధ్యస్తంగా ఉన్న భూములపై 40 శాతం వరకు ధర పెంచగా, మునిసిపాలిటీలకు సమీపంలో ఉన్న విలువైన భూముల ధరలను 30 శాతం పెంచారు. ఓపెన్‌ ప్లాట్ల ధరలను సైతం ఇదేవిధంగా ఖరారు చేశారు. వనపర్తి మునిసిపాలిటీ పరిధిలో గత ఏడాది ఆగస్టు వరకు గజం స్థలం రూ.1,200 ఉండేది. గత డిసెంబరులో ప్రభుత్వం లే అవుట్‌ లేని ప్లాట్లను వార్డెన్‌ బ్లాక్‌లోకి మార్పు చేశారు. దీంతో గజం స్థలం రూ.2,000లకు చేరింది. ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా భూములు, ప్లాట్ల స్థలాల ధరలు పెంచడంతో మునిసిపాలిటీ పరిధిలో గజం ధర రూ.3,000లకు పెరిగింది. అంతే కాకుండా గతంలో మర్కెట్‌ విలువను బట్టి 6 శాతం రిజిస్ట్రేషన్ల చార్జీలు చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు 7.5 శాతానికి పెంచేశారు. భూములు లేదా ప్లాట్లను కొనుగోలు చేసేవారికి గతంలో అయ్యే డాక్యుమెంట్ల ఖర్చు రెట్టింపు అయ్యిందని చెప్పొచ్చు.


వనపర్తిలో రూ.40 కోట్లు దాటనున్న రాబడి..

వనపర్తి జిల్లా రియల్‌ వ్యాపారానికి పెట్టింది పేరు. జిల్లాలో కేజీ నుంచి పీజీ వరకు అన్ని రకాల విద్యాలయాలు ఉండడం, మెడికల్‌, ఫీషరీస్‌ కళాశాలలు మంజూరు కావడం, త్వరలో త్రిపుల్‌ ఐటీ రానున్న నేపథ్యంలో వీటన్నింటినీ ప్రచారం చేస్తూ రియల్‌ వ్యాపారులు ప్లాట్లను జోరుగా అమ్ముతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోనే వనపర్తి సబ్‌ రిజిష్టార్‌ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి భారీగా రాబడి వస్తోంది. ఇప్పుడు భూముల ధరలు భారీగా పెరగడంతో పాటు రిజిస్ట్రేషన్ల చార్జీలు సైతం 1.50 శాతం అధికం కావడంతో వనపర్తి నుంచి రెట్టింపు ఆదాయం ఖజానాకు చేరనుంది. మొన్నటి వరకు వనపర్తి మునిసి పాలిటీ పరిధిలో 200 గజాల ప్లాటు రిజిస్ట్రేషన్‌ కోసం సుమారు రూ. 28 వేలు చలాన్‌ కట్టాల్సి ఉండేది. ఇప్పుడు పెరిగిన చార్జీల ప్రకారం దాదాపు రూ.45 వేలు ఖర్చవుతుందని అంచనా. ఇక కరోనా లేని కాలంలోనే ఏడాదికి రూ.20 కోట్లకు పైగా వనపర్తి రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది. గత ఏడాది కరోనా దృష్ట్యా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడం, రిజిస్ట్రేషన్లు సైతం కొన్ని నెలల పాటు నిలిపి వేయడం తెలిసిందే. అలాంటి సమయంలో కూడా గత ఏడాది వనపర్తిలో దాదాపు 16 వేల డాక్యుమెంట్లకు గానూ సుమారు రూ.13 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం నెలకొన్న సాధారణ పరిస్థితులు, పెరిగిన రిజిస్ట్రేషన్ల చార్జీల ధరలను బట్టి చూస్తే వనపర్తి రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయం ఆదాయం రెట్టింపు కానుంది. ఏడాదికి దాదాపు రూ.40 కోట్లకు పైగానే ఖజానాకు చేరొచ్చని అంచనా. 


అప్పుడు కరోనా..  ఇప్పుడు ధరల దెబ్బ..

కరోనా వైరస్‌ కారణంగా రెండేళ్ల నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కుదేలయ్యింది. ప్లాట్లు, భూముల అమ్మకాలు చాలావరకు తగ్గిపోయాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదురుకుంటుండగా మళ్లీ భూముల ధరలు పెరగడం మా వ్యాపారాన్ని దెబ్బ తీసినట్లయ్యింది. ఆస్తుల క్రయ విక్రయాలు తగ్గే సూచనలు ఉన్నాయి. ఇలా అయితే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకోవడానికి ఇంకా సమయం పడుతుంది.

- గోపాల్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, వనపర్తి

Updated Date - 2021-07-26T04:35:08+05:30 IST