యూఏఈలో భార‌తీయుడితో స‌హా ముగ్గురి అరెస్ట్.. చేసిన నేర‌మిదే

ABN , First Publish Date - 2020-07-07T16:23:00+05:30 IST

ఈజీ మ‌నీ కోసం యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఓ ఉద్యోగి.. అమాయ‌కుల‌ను బ్లాక్‌మెయిల్ చేశాడు.

యూఏఈలో భార‌తీయుడితో స‌హా ముగ్గురి అరెస్ట్.. చేసిన నేర‌మిదే

యూఏఈ: ఈజీ మ‌నీ కోసం యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఓ ఉద్యోగి.. అమాయ‌కుల‌ను బ్లాక్‌మెయిల్ చేశాడు. మీ పేర్ల‌ను వాంటెడ్ లిస్టులో పెడ‌తానని త‌న‌కున్న అధికారాల‌ను అడ్డం పెట్టుకుని బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. వాంటెడ్ లిస్టులో పెడితే మీకు వీసా రాదు, అలాగే ప్ర‌యాణాల‌పై బ్యాన్ విధిస్తార‌ని బెదిరించి అందిన‌కాడికి దండుకున్నాడు. దీనికోసం ఓ భార‌త వ్య‌క్తితో పాటు మ‌రో ఎమిరెటీని త‌న‌తో క‌లుపుకుని స‌ద‌రు ఉద్యోగి గ‌త‌కొంత‌కాలంగా అక్ర‌మ వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నాడు. తాజాగా ఈ విష‌యం ఉన్న‌తాధికారుల‌కు తెలియ‌డంతో ఆ ఉద్యోగిని పోలీసుల‌కు అప్ప‌గించారు. ఉద్యోగితో పాటు అత‌నికి స‌హ‌క‌రించిన భార‌త వ్య‌క్తి, మ‌రో ఎమిరెటీ పౌరుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 


ఈ విష‌యాన్ని ఆ దేశ ఉప ప్రధాని, అంతర్గత మంత్రి షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ట్విట్టర్ ద్వారా వెల్ల‌డించారు. "అవినీతి ఆరోపణలపై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మన సంస్థలలో అవినీతికి చోటు లేదు. దేశానికి, సమాజానికి... చిత్తశుద్ధితో, నిజాయితీతో సేవ చేయాలి. మన మధ్య అవినీతిపరులకు ఏమాత్రం చోటు లేదు. అరెస్టు చేసిన ఉద్యోగిపై అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని అన్నారు.  


Updated Date - 2020-07-07T16:23:00+05:30 IST