ఇన్‌చార్జి తహసీల్దార్‌ ఇష్టారాజ్యం

ABN , First Publish Date - 2022-05-26T07:32:54+05:30 IST

తర్లుపాడు ఇన్‌చార్జి తహసీల్దార్‌ శ్రీను ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అధికార పార్టీ నాయకులు చెప్పిందే వేదంగా భావించి భూఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇన్‌చార్జి తహసీల్దార్‌ ఇష్టారాజ్యం
తర్లుపాడు తహసీల్దార్‌ కార్యాలయం

అధికార పార్టీ నాయకుల అక్రమాలకు చేయూత

కింది స్థాయి సిబ్బందికి తెలియకుండానే ఆన్‌లైన్‌

ఆయన తీరుపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు 

తర్లుపాడు, మే 25 : తర్లుపాడు  ఇన్‌చార్జి తహసీల్దార్‌ శ్రీను ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అధికార పార్టీ నాయకులు చెప్పిందే వేదంగా భావించి భూఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్రమణదారులు కొన్ని భూముల ఆన్‌లైన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే కింది స్థాయి సిబ్బందికి తెలియకుండానే పని చేసేస్తున్నారు. నెల రోజుల నుంచి కార్యాలయంలోని రికార్డులను కూడా ఇంటికి తీసుకెళ్లి మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. లక్ష్మక్కపల్లెకు చెందిన ఇలాకాలో దళితులకు చెందిన భూములను పెద్దలకు కట్టబెట్టేందుకు నాలుగు రోజుల క్రితం 8ఏ ఫారాలను జనరేట్‌ చేశారు. మూడు నెలల నుంచి తహసీల్దార్‌ చేసిన ఆన్‌లైన్‌ వివరాలను ఉన్నతాధికారులు పరిశీలిస్తే మరిన్ని భూఅక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు. గతంలో ఇక్కడ పులి శైలేంద్రకుమార్‌ తహసీల్దార్‌గా పనిచేశారు. అధికార పార్టీ నాయకుల భూ అక్రమాలకు సహాయపడలేదని ఆయన్ను డిప్యుటేషన్‌పై పొన్నలూరుకు బదిలీ చేయించారు. గిద్దలూరులో పనిచేస్తున్న డీటీ బి.శ్రీనును తర్లుపాడు తహసీల్దార్‌గా డిప్యుటేషన్‌పై తెచ్చుకున్నారు. అప్పటికే ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్‌గా వెంకటేశ్వర్లు పనిచేస్తున్నారు. ఆయనకు ఏడేళ్ల అనుభవం ఉంది. అయినప్పటికీ ఆయనకు కాకుండా కేవలం రెండేళ్ల అనుభవం ఉన్న గిద్దలూరు డీటీ శ్రీనుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడం అనేక అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది.


Updated Date - 2022-05-26T07:32:54+05:30 IST