ప్రైవేటు ఆస్పత్రులు మానవత దృక్పథాన్ని చాటాలి

ABN , First Publish Date - 2021-04-21T05:29:42+05:30 IST

కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ ప్రస్తుత విపత్కర పరిస్థితిలో బాధితులను ఆదుకొనేందుకు ప్రైవేటు ఆస్పత్రులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆదేశించారు.

ప్రైవేటు ఆస్పత్రులు మానవత దృక్పథాన్ని చాటాలి
ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశమైన ఇన్‌చార్జి మంత్రి, హోం మంత్రి

జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి శ్రీరంగనాథరాజు

గుంటూరు, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ ప్రస్తుత విపత్కర పరిస్థితిలో బాధితులను ఆదుకొనేందుకు ప్రైవేటు ఆస్పత్రులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆదేశించారు. కరోన సోకి వైద్యం కోసం వచ్చే బాధితుల వద్ద నామమాత్రపు చార్జీలే వసూలు చేసుకోవాలన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌కి వచ్చిన ఆయన ఆస్పత్రుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్‌ మంత్రి మాట్లాడుతూ కొత్తగా ఆస్పత్రులకు తాత్కాలిక పర్మిషన్లు వెంటనే ఇచ్చేలా చూస్తామన్నారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సీజన్‌ నిల్వలు పెంచాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ  బెడ్ల కొరత తీవ్రంగా ఉందదని, హాస్పిటల్స్‌లో పడకల సంఖ్య పెంచాలని ఆదేశించారు. 

గుంటూరు ఫైట్స్‌ కొవిడ్‌-19 పుస్తకావిష్కరణ

కరోనా తొలి దశని జిల్లా సమర్ధంగా ఎదుర్కొని ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించిన విధానాన్ని ఒక పుస్తక రూపంలో గుంటూరు ఫైట్స్‌ కొవిడ్‌-19 అనే పేరుతో శామ్యూల్‌ జొనాథన్‌ తీసుకొచ్చారు. ఈ పుస్తకాన్ని ఇన్‌చార్జ్‌ మంత్రి, హోం మంత్రి ఆవిష్కరించారు.  సమావేశంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ నందకిషోర్‌, జేసీ(సచివాలయాలు) పి.ప్రశాంతి, జేసీ(ఆసర) కె.శ్రీధర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు రామచంద్రరాజు, ఆప్నా అసోసియేషన్‌ అధ్యక్షుడు హన్మంతరావు పాల్గొన్నారు. 

3 నుంచి ఉచిత భోజనం

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల  సహాయకులకు మే 3 నుంచి ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. జీజీహెచ్‌లో భోజనశాల నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకేసారి 300 మంది భోజనం చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలం ప్రభావతి, సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ సతీష్‌కుమార్‌, గృహ నిర్మాణ శాఖ పీడీ వేణుగోపాలరావు, రెడ్‌క్రాస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు రామచంద్రరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T05:29:42+05:30 IST