దశాబ్దంగా ఇన్‌చార్జీలే

ABN , First Publish Date - 2022-05-22T06:51:29+05:30 IST

దశాబ్దకాలంగా సాగుతున్న ఇన్‌చార్జీల పాలన వల్ల విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది.

దశాబ్దంగా ఇన్‌చార్జీలే
భైంసా ఎంఈవో కార్యాలయం

జిల్లాలోని అన్ని మండలాల్లో ఇన్‌చార్జి ఎంఈవోలు

గాడి తప్పుతున్న విద్యావ్యవస్థ

అదుపు లేని పరిపాలన

లోపిస్తున్న పర్యవేక్షణ

ఇన్‌చార్జీ ఎంఈవోలపై తలకు మించిన పనిభారం

అదనంగా హైస్కూళ్ల పర్యవేక్షణ బాధ్యతలు 

భైంసా, మే 21 :  దశాబ్దకాలంగా సాగుతున్న ఇన్‌చార్జీల పాలన వల్ల విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. ఉత్తమ ఫలితాలు సాధించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా.. అందుకుతగ్గ వనరులను సమకూర్చడంలో విఫలమవుతున్నారు. ప్రస్తుతం జిల్లా పరిధిలో గల 19 మండలాల్లో  మొ త్తం ప్రధానోపాధ్యాయులే ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

విద్యావిధానం అభివృద్ధి చెందాలంటే అజమాయిషీ అవసరం. ఇది పక్కగా అమలు కావాలన్నా, పాఠశాలలు సక్రమంగా కొనసాగాలన్నా, మండలస్థాయిలో పటిష్టమైన అధికార యంత్రాంగం ఉండాలి. అదిలే కుంటే పర్యవేక్షణ లోపిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. 

 దీర్ఘకాలికంగా ఇన్‌చార్జుల పాలన

  ఎంఈవోలు మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. మధ్యాహ్నభోజన పథకం, స్కూల్‌ కాంప్లెక్స్‌, వేసవిబడులు పరీక్షల నిర్వాహణ, ఉపాధ్యాయులపై అజమాయి, పుస్తకాల పంపిణీ, ప్రైవేట్‌ పాఠశాలల నిర్వాహణపై పర్యవేక్షణ లాంటి కీలకబాధ్యతలు వీరిపైనే ఉంటాయి. ఇంతటి కీలకమైన పోస్టులు ధీర్ఘకాలికంగా ఇన్‌చార్జీల పాలనలోనే నడస్తున్నాయి. ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులకే ఇన్‌ చార్జీల బాధ్యతలను అప్పగించింది. వీరంతా తమ పాఠశాలల్లో పదవ తరగతి ఉత్తీర్ణతశాతం పెంచేందుకు కృషిచేయాల్సి ఉండటంతో పాటు పాఠ్యాంశాలను బోఽధించాల్సి ఉంది. 

ఎంఈవోలకు ప్రాథమిక, ప్రాథకోన్నత పాఠశాలలతో పాటు హైస్కూళ్లు, కస్తూర్భాగాందీ విద్యాలయాలు, మోడల్‌ స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యతలు అప్పచెప్పె దిశగా చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లాల్లో డిప్యూటీ డీఈ వోలు హైస్కూళ్ల పర్యవేక్షణ చేపట్టే వారు. డిప్యూటీ డీఈవోలు తమ తమ పరిధిలో  ప్రధానోపాధ్యాయుల వేత న స్థిరీకరణ, సెలవుల మంజూరు, పదవ తరగతి పరీక్షల నిర్వహణలో డీఈవోలు సహకరించడం, సర్వీసు పుస్తకాల నిర్వాహణ, సీసీఈ ప్రాక్టికల్‌ మార్కుల నివేదికలను తనిఖీ చేయడం వంటి ప్రధానవిధులు నిర్వహించే వారు. అయితే జిల్లాల పునర్విభజనలో భాగంగా  డిప్యూటీ డీఈవోలు డీఈవోలుగా  బాధ్యతలు చేపట్టారు. దీంతో సర్కార్‌ హైస్కూళ్ల నిర్వాహణ వ్యవస్థలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ఉండేందుకు గాను ఎంఈవోలకు ఆ పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను అప్పచెప్పింది. 

అదనంగా ఉన్నత పాఠశాలల బాధ్యతలు

అయితే మండల విద్యావ్యవస్థ నిర్వాహణతో పాటు తాము ప్రధానోపాధ్యాయునిగా విధులు  నిర్వహిస్తున్న పాఠశాల బాధ్యతలు చేపట్టడం ఇన్‌చార్జీ ఎంఈవోలపై తలకు మించిన భారంగా మారింది. రెండు బాధ్యతలను నిర్వహించే విషయంలో వారు ఇబ్బందులు పడుతున్నారు. 

పనిభారంతో ఇబ్బందులు 

ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇన్‌చార్జ్‌ ఎంఈవో లుగా అదనపు బాధ్యతలు అప్పచెప్పడం మూలంగా సమస్యలు ఏర్ప డుతున్నాయి. ఇన్‌చార్జీ ఎంఈవోతో పాటు  తాము పనిచేసే పాఠశాలలోనూ ప్రధానోపాధ్యాయుని బాధ్యతలు నిర్వహించడం వారికి ఇబ్బందికరంగా మారింది. నిర్వాహణ వ్యవస్థలో అవస్థల పాలవుతున్నారు. ప్రభుత్వం రెగ్యులర్‌ ఎంఈవో లను నియమిస్తే సమస్యలన్నీ పరిష్కరమయ్యి వ్యవస్థ మెరుగవుతుంది. హైస్కూళ్ల పర్యవేక్షణ బాధ్యతలను ఎంఈవోలకు  అప్పచెప్పకుండా డిప్యూటీ డీఈవోలను నియమించాలి

బీవీ.రమణరావ్‌, పీఅర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి   

 

ఇన్‌చార్జ్‌ల పాలనతో ఇబ్బందే

 ఇన్‌చార్జ్‌ వలన  పాఠశాలలపై పర్యవేక్షణ లోపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన రీతిలో పనితీరు మెరుగుపడటం లేదు. ఇన్‌చార్జ్‌లుగా ఉండటం వలన జడ్పీ, ప్రాథమిక పాఠశాలలకు నష్టం వాటిల్లుతోంది.రెగ్యులర్‌ ఎంఈవోలను నియమిస్తే నిర్వహణ వ్యవస్థ మెరుగుపడే పరిస్థితులు ఉంటాయి.  

Updated Date - 2022-05-22T06:51:29+05:30 IST