Abn logo
Sep 20 2021 @ 23:58PM

ఎంఈవోలంతా ఇన్‌చార్జిలే!

మెదక్‌లోని ఎంఈవో కార్యాలయం

మెదక్‌ జిల్లాలో అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి

ఒక్కొక్కరికి మూడు మండలాల బాధ్యతలు

పనిభారంతో సతమతం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి. మెదక్‌, సెప్టెంబరు 20 : మెదక్‌ జిల్లాలో విద్యాశాఖలో ఇన్‌చార్జిల పాలన సాగుతున్నది. జిల్లాలోని అన్ని మండలాలకు విద్యాధికారులుగా హెచ్‌ఎంలే అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక్కో హెడ్‌మాస్టర్‌కు మూడు మండలాలకు ఇన్‌చార్జి ఎంఈవోలుగా నియమించారు. ఓ వైపు స్కూళ్ల బాధ్యతలు ఇంకో వైపు మండల విద్యాధికారిగా అదనపు బాధ్యతలు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా విద్యా వ్యవస్థ కుంటుపడుతుంది. క్షేత్ర స్థాయిలో విద్యా రంగాన్ని గాడిన పెట్టలేకపోతున్నారు. 


21 మండలాల్లో ఇదే దుస్థితి

మెదక్‌ జిల్లాలో మొత్తం 21 మండలాలున్నాయి. పాఠశాలలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా చూసేందుకు ఒక్కచోట కూడా రెగ్యులర్‌ ఎంఈవో లేడు. సీనియర్‌ హెడ్‌మాస్టర్లకే ఎంఈవోలుగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇలా ఒక్కొక్కరికి మూడు మండలాల బాధ్యతలను అప్పగించారు. ఏడాదికి పైగా విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావడంతో విద్యావ్యవస్థ గాడితప్పింది. ప్రస్తుతం స్కూళ్లు తెరిచినా రెగ్యులర్‌ ఎంఈవోలు లేకపోవడంతో పరిస్థితి మెరుగుపడటం లేదు. హెడ్‌మాస్టర్లకే ఎంఈవోలుగా బాధ్యతలను అప్పగించడంతో పనిభారంతో న్యాయం చేయలేకపోతున్నారు. అటు ప్రధానోపాధ్యోయుడిగా పనిచేసే పాఠశాలలో విధులు, ఇటు ఇన్‌చార్జి విద్యాధికారిగా మూడు మండలాల పర్యవేక్షణ తలకుమించిని భారంగా మారింది. 


ఎంఈవోలకు ఎన్నో బాధ్యతలు

విద్యావ్యవస్థలో ఎంఈవోలది కీలకపాత్ర. మండల పరిధిలోని పాఠశాలలను సందర్శించి బోధనాభ్యసన ప్రక్రియ, వసతులను పరిశీలిస్తారు. పిల్లల అభ్యసనను పరీక్షించి బోధన మెరుగుపర్చుకోవడానికి ఉపాధ్యాయులకు సూచనలు ఇస్తారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తారు. ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హజరయ్యే విదంగా చూడటం, విద్యార్థులు, టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ఎంఈవోల బాధ్యత. ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, మధ్యాహ్నా భోజనం పరిశీలన చేయడం కూడా వీరి విధి.