Advertisement
Advertisement
Abn logo
Advertisement

విడవని వాన

పది రోజులుగా నీటిలో నానుతున్న నగరం

పాత భవనాలపై భయాందోళనలు

ఆరు నెలల క్రితం నోటీసులిచ్చి సరిపెట్టుకున్న నగరపాలక సంస్థ


తిరుపతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరంలో వాన మళ్లీ మొదలైంది. ఆదివారం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. చిరుజల్లులతోపాటు ఒక్కోసారి ఓమోస్తరు వర్షంతో నేలను తడుపుతూనే ఉంది. దీంతో రోడ్లపై వరదనీరు యథావిధిగా ప్రవహిస్తోంది. లీలామహల్‌ సర్కిల్‌ సమీపంలోని తిరుమల బైపాస్‌ రోడ్డులో వరదనీటిలో ఓ బస్సు నిలిచిపోయింది. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. పలు అపార్ట్‌మెంట్ల పార్కింగ్‌ సెల్లార్‌లోకి నీరు చేరింది. భారీ వర్షాలతో వరద నీరొచ్చి నగరాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. మళ్లీ వర్షం మొదలవడంతో జనం చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. కాంక్రీటు నేల మినహా తక్కినదంతా పదిరోజులుగా నీటిఊటతో నిండిపోయివుంది. దీంతో కాలంచెల్లిన భవనాలు పరిస్థితి ప్రమాదకరంగా మారాయి. శనివారం రాత్రి భవానీనగర్‌లో ఓ పాత భవనం నేలకొరిగిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే నగరంలోని పాత భవనాలను గుర్తించి, అప్రమత్తం చేయాల్సిన తిరుపతి నగరపాలక సంస్థ ఏమరుపాటుగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరునెలల క్రితం దాదాపు 50 పాత భవనాలకు నోటీసులిచ్చి సరిపెట్టేసింది. ఆ తర్వాత సదరు భవనాలు ఇప్పుడు ఏదశలో ఉన్నాయి? వాటిని నేలమట్టం చేశారా? వంటివాటిపై దృష్టిపెట్టడం లేదని తెలుస్తోంది. కనీసం ప్రకటనల ద్వారా అయినా అప్రమత్తం చేయకపోవడం కార్పొరేషన్‌ నిర్లక్ష్యవైఖరికి అద్దంపడుతోంది. కాగా..నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్బన్‌ తహసీల్దార్‌ వెంకటరమణ ఒక ప్రకటనలో కోరారు. సోమవారం కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ దగ్గరలోని పునరావాస కేంద్రాల్లో ఉండాలని సూచించారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేశామని, నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. 

Advertisement
Advertisement