ఆగని ద్విచక్రవాహన చోరీలు

ABN , First Publish Date - 2022-08-17T04:44:36+05:30 IST

మదనపల్లెలో ద్విచక్రవాహన చోరీలు ఆగడంలేదు. రోజు రోజుకు చోరీలు పెరిగిపోతుండడంతో వాహనచోదకు లు ఆందోళనలో పడ్డారు.

ఆగని ద్విచక్రవాహన చోరీలు
టూటౌన్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు(పైల్‌ఫొటో)

ఆరునెలల్లో సుమారు 150 వాహనాలు చోరీ  ఏడుగురి నిందితుల అరెస్టు74 వాహనాల రికవరీ

 స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న బాధితులు

మదనపల్లె క్రైం, ఆగస్టు 16: మదనపల్లెలో ద్విచక్రవాహన చోరీలు ఆగడంలేదు. రోజు రోజుకు చోరీలు పెరిగిపోతుండడంతో వాహనచోదకు లు ఆందోళనలో పడ్డారు.  ఆరునెలల్లో సుమారు 150 వాహనాలు చోరీకి గురికాగా ఈ మేరకు కేసునమోదు చేసిన పోలీసులు ఏడుగురి పాత నేరస్థులను అరెస్టు చేసి వారినుంచి 74 వాహనాలను రికవరీ చేశారు. ఓవైపు నిందితులను అరెస్టు చేసి వాహనాలను రికవరీ చేస్తున్నా.. మరోవైపు చోరీలు పెరుగుతుండడంతో వాహన చోదకులు తమ వాహనా లకు రక్షణ ఎలాఅంటూ భయపడుతున్నారు. ముఖ్యంగా బాధితులు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. మదనపల్లెలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బస్టాండ్లు, వారపుసంత, డైలీమార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌, ఆలయాలు, ఆస్పత్రులు, కోర్టు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, ఇళ్లవద్ద నిలిపి ఉంచిన వాహనాలు అవలీలగా చోరీకి గురవుతున్నాయి. ముఖ్యంగా వాహనాలకు సైడ్‌లాక్‌ వేయకపోవడం, తొందరపాటులో వాహనానికే తాళం పెట్టి మరచిపోవడం, రాత్రిపూట వీల్‌లాక్‌ ఏర్పాటు చేయకపోవడం, తాళం బాగా అరిగిపోయి ఉండడం, ఎక్కడబడితే అక్క డ పార్కింగ్‌ చేయడం, రెండుమూడు రోజులైనా వాహనం గురించి పట్టించుకోకపోవడం తదితర కారణాలతో తరచూ చోరీలు జరుగుతున్నా యి. మదనపల్లె జిల్లా ప్రభుత్వాస్పత్రిలో రెండునెలల వ్యవధిలో 10 వాహనాలు చోరీకి గురయ్యాయి. పోలీసులు గస్తీని ముమ్మరం చేసి చోరీల నివారణకు అడ్డుకట్ట వేయాలంటూ ప్రజలు కోరుతున్నారు.

నిందితుల అరెస్టు..వాహనాల రికవరీ వివరాలు..

ఫ ఫిబ్రవరి 4న మదనపల్లె వన్‌టౌన్‌ పోలీసులు ఓ బైకుల దొంగను అరెస్టు చేసి అతని నుంచి 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి వయసు పాతికేళ్లు. విలాసాలకు అలవాటుపడి వాహన చోరీలను వృత్తిగా ఎంచుకుని చివరికి కటకటాల పాలయ్యాడు. 

ఫ జూన్‌ 21న టూటౌన్‌ పోలీసులు నలుగురి నిందితులను అరెస్టు చేసి వారినుంచి 26 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులు అంతర్రాష్ట్ర, అంతర్‌జిల్లా చోరీలకు పాల్పడి జైలు పాలయ్యారు. నేరస్థుల్లో ఒకరు మైనర్‌ కావడం గమనార్హం.

ఫ తాజాగా ఆగస్టు 9న టూటౌన్‌ పోలీసులు ఇద్దరి అంతర్రాష్ట్ర దొంగ లను అరెస్టు చేసి 25 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు జల్సాలకు అలవాటుపడి చేతిలో డబ్బుల్లేక చోరీలకు పాల్పడ్డారు. అదేవిధంగా నిందితులపై మదనపల్లె, కర్ణాటకలోనూ కేసులు ఉన్నాయి.

వాహనాలను రికవరీ చేస్తున్నాం..

బాధితుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి వాహనాలను రికవరీ చేస్తున్నాం. వాహన చోరీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వీల్‌లాక్‌ ఏర్పాటు తో చోరీలు జరగవు. మదనపల్లెలో వాహన చోరీలు ఎక్కువగా ఉన్నాయి. పాతనేరస్థులపై నిఘా ఉం చాం. పలువురిని అరెస్టు చేసి వాహనాలను రికవరీ చేశాం. దర్యాప్తులో భాగంగా ఇంకా వాహనాలు రిక వరీ కావాల్సి ఉంది. వాహన చోరీలపై సిబ్బందిని అప్ర మత్తం చేశాం. ముఖ్యంగా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి నిందితుల ఆట కట్టిస్తున్నాం.


-  కె.రవిమనోహరాచారి, డీఎస్పీ, మదనపల్లె

Updated Date - 2022-08-17T04:44:36+05:30 IST