పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ABN , First Publish Date - 2021-11-30T07:49:33+05:30 IST

తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
అంకురార్పణలో భాగంగా విష్వక్సేనుడి ఊరేగింపు

నేత్రపర్వంగా లక్ష కుంకుమార్చన 

నేడు ధ్వజారోహణం 


తిరుచానూరు, నవంబరు 29: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. మంగళవారం నుంచి వచ్చే నెల 8వ తేది వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది కూడా కొవిడ్‌ నిబంధనల కారణంగా ఈ ఉత్సవాలను టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో పుట్టమనున్నను నవపాలికల్లో వేసి ఆలయ వేదపండితులు అంకురార్పణ గావించారు. బ్రహ్మోత్సవాలకు ముందు రోజు లక్ష కుంకుమార్చన నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేద మంత్రోచ్చారణల మధ్య లక్ష కుంకుమార్చన సేవ నేత్రపర్వంగా జరిగింది. లక్ష్మీఅష్టోత్తరం, లక్ష్మీసహస్రనామాలతో అర్చకులు అమ్మవారికి కుంకుమతో అర్చన చేశారు. హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు విశేష ప్రాధాన్యం ఉంది. వివాహిత నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూధర్మం చెబుతోంది. లక్ష్మి, సరస్వతి, పార్వతి అమ్మవార్లపేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్థ్యం ఉంది. ఈ లక్ష కుంకుమార్చన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీఈవో కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర్‌రెడ్డి, ఏవీఎస్వో వెంకటరమణ, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకుడు బాబుస్వామి, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ జయకుమార్‌, రాజేష్‌, దాము, వీఐలు మహేష్‌, సురే్‌షరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


నేటి నుంచి వాహనసేవలు

మంగళవారం నుంచి డిసెంబరు 8వ తేది వరకు జరిగే కార్తీక బ్రహ్మోత్సవాలు.. ఆలయంలో ఉదయం ధనుర్లగ్నంలో జరిగే ధ్వజారోహణంతో ప్రారంభంకానున్నాయి. రాత్రి జరిగే చిన్నశేష వాహనంతో వాహనసేవలు ప్రారంభంకానున్నాయి. ఆలయం వెలుపల ఉన్న వాహన మండపంలో ఈ వాహన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి మంగళవారం మధ్యాహ్నం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 


అమ్మవారి దర్శనానికి ఇలా వెళ్లాలి 

పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవలను ఆలయ మహద్వారం సమీపంలోని వాహన మండపంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. అందుకని మహద్వారం నుంచి రెండో గేటు వరకు తెరలు కట్టారు. బ్రహ్మోత్సవం ముగిసే వరకు ప్రైవేట్‌ బస్టాండు వద్దనున్న నాలుగో నెంబరు గేటు నుంచి భక్తులు పాత పోలీస్‌ స్టేషన్‌ మీదుగా అమ్మవారి దర్శనానికి వెళ్లాలని అధికారులు సూచించారు. ఇప్పటికే అక్కడ షెడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆస్థాన మండపం వద్దనున్న మూడో గేటు నుంచి టీటీడీ, ఇతర శాఖల ప్రభుత్వ ఉద్యోగులను అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 



Updated Date - 2021-11-30T07:49:33+05:30 IST