అందని ఆసరా

ABN , First Publish Date - 2022-08-06T05:25:10+05:30 IST

గత కొన్ని నెలలుగా ఆసరా పింఛన్ల పంపిణీలో ఆలస్యం నెలకొంటుంది. ప్రతీనెల మొదటి వారంలో రావాల్సిన ఆసరా పింఛన్లు నెల చివరికైనా రావడం లేదు. పండుటాకులకు ప్రతీనెల ప్రదక్షిణలు, పడిగాపులు తప్పడం లేదు. నెలాలాలాలాలలాఖరు వచ్చినా ఆసరా దక్కకపోవడంతో అవస్థలు పడుతున్నారు.

అందని ఆసరా
జిల్లాలోని ఓ పోస్టాఫీస్‌ వద్ద పింఛన్‌ల కోసం నిరీక్షిస్తున్న లబ్ధిదారులు

- జిల్లాలో మొత్తం 1.47 లక్షల ఆసరా పింఛన్లు

- జిల్లాలో ఆసరా పింఛన్ల కోసం లబ్ధిదారులకు తప్పని నిరీక్షణ

- సకాలంలో అందని ఆసరా పింఛన్లు

- రెండు నెలలుగా పెండింగ్‌లోనే

- వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు

- పోస్టాఫీసులు, బ్యాంకుల వద్ద పడిగాపులు

- పట్టించుకోని సంబంధితశాఖ అధికారులు

- నిధులు మంజూరు కావడం లేదంటున్న అధికారులు


కామారెడ్డి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): గత కొన్ని నెలలుగా ఆసరా పింఛన్ల పంపిణీలో ఆలస్యం నెలకొంటుంది. ప్రతీనెల మొదటి వారంలో రావాల్సిన ఆసరా పింఛన్లు నెల చివరికైనా రావడం లేదు. పండుటాకులకు ప్రతీనెల ప్రదక్షిణలు, పడిగాపులు తప్పడం లేదు. నెలాలాలాలాలలాఖరు వచ్చినా ఆసరా దక్కకపోవడంతో అవస్థలు పడుతున్నారు. మొదటి వారంలో ఇవ్వాల్సిన పింఛన్లను మరుసటి నెలలో పంపిణీ చేస్తున్నారు.  గత రెండు నెలల ఆసరా పింఛన్లు పెండింగ్‌లో ఉన్నాయి. గత 5 నెలలుగా ఇదేతంతూ కొనసాగుతోంది. ఇదే విషయమై ఆసరా లబ్ధిదారులు సంబంధితశాఖ అధికారులను అడిగితే ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రావడం లేదని, సర్వర్‌ డౌన్‌ ఉంటుందని వివిధ కారణాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,47,521 ఆసరా పింఛన్లు ఉండగా ఇందుకు గాను ప్రభుత్వం రూ.31.49 కోట్ల నిధులను కేటాయిస్తోంది. సకాలంలో ఆసరా పింఛన్ల డబ్బులు ఖాతాలో జమకాకపోవడం, పోస్టాఫీస్‌ నిర్వాహకులు ఇవ్వకపోవడంతో రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ లబ్ధిదారులు తిరగాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

జిల్లాలో 1.47లక్షల ఆసరా లబ్ధిదారులు

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాల పరిధిలో ఆయా విభాగాలకు చెందిన మొత్తం ఆసరా లబ్ధిదారులు 1,47,521 మంది ఉన్నారు. వీరికి ప్రతినెల ప్రభుత్వం రూ.31.49 కోట్లు పంపిణీ చేస్తోంది. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 38,806 ఉండగా రూ.7.82 కోట్లు పంపిణీ చేస్తుంది. వితంతు పింఛన్లు 47,044 ఉండగా రూ.9.48 కోట్లు, వికలాంగుల పింఛన్లు 17,538 ఉండగా రూ.5.28 కోట్లు, చేనేత కార్మికుల పింఛన్లు 597 ఉండగా రూ.1.2 కోట్లు, కల్లుగీత కార్మికుల పింఛన్లు 680 ఉండగా రూ.1.3 కోట్లు, బీడీ కార్మికులకు జీవనభృతి 36,847 ఉండగా రూ.7.42 కోట్లు, ఒంటరి మహిళలు 4,369 ఉండగా రూ.88 కోట్లు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు 1,127 ఉండగా రూ.2.2 కోట్లు, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు 513 ఉండగా 1 కోటి నిధులను ప్రభుత్వం జమ చేస్తోంది.

పంపిణీలో ఎదురవుతున్న సమస్యలు

ఆసరా పింఛన్ల పంపిణీ బాధ్యత డీఆర్‌డీఏ అధికారులు పర్యవేక్షిస్తుండగా పోస్టాఫీసుల ద్వారా పంపిణీచేస్తున్నారు. పింఛన్ల పంపిణీలో ఎదురవుతున్న సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏళ్ల తరబడి ఒకే సమస్య ఎదురవుతున్నా పరిష్కారంలో విఫలమవుతున్నారు. ప్రతినెల 5వ తేదీన పెన్షన్‌లు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా 25వ తేది తర్వాత కానీ పంపిణీ కావడం లేదు. అయితే సిగ్నల్‌ అందకపోవడం, ఒకే పోస్టుమెన్‌ ఐదారు గ్రామాలకు ఇస్తుండడం, వీరంతా నాలుగైదు కిలో మీటర్లలో ఉన్న ఇతర గ్రామాలకు వెళ్లి తీసుకోవడం వంటి కారణాలతో పింఛన్ల పంపిణీ పూర్తయ్యే సరికి 10 రోజులు పడుతోంది. ఇన్ని రోజుల పాటు తమ వంతు ఎప్పుడు వస్తుందోనని వృద్థులు, వికలాంగులు పడిగాపులు కాస్తున్నారు.

ప్రభుత్వం నుంచే నిధులు మంజూరు కావడంలో ఆలస్యం

ఆసరా పింఛన్లకు నిధుల కొరత లేకుండా చూస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆసరా పింఛన్ల డబ్బులు చెల్లింపులో నెలనెల ఆలస్యం నెలకొంటుంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వమే నిధులను సకాలంలో మంజూరు చేయడం లేదనే వాదన సంబంధిత శాఖల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వ ఖజానా శాఖ వద్ద నిధులు లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సైతం ప్రతినెల 1న కాకుండా 15 తర్వాత వేస్తున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉండగా ఆసరా పింఛన్ల లబ్ధిదారులకు ప్రతినెల 5వ తేదీలోపు ఖాతాలో జమ చేయాల్సి ఉండగా నెల చివరిలో 28 దాటితే కానీ పింఛన్‌ డబ్బులు రావడం లేదు. ప్రస్తుతం జూన్‌, జూలై నెలలకు సంబంధించి ఆసరా పింఛన్లు లబ్ధిదారులకు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఈ రెండు నెలల పింఛన్ల కోసం లబ్ధిదారులకు నిరీక్షణ తప్పడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం వద్ద బడ్జెట్‌ లేకపోవడంతోనే సకాలంలో నిధులు ఆసరా పింఛన్లకు రావడం లేదనే వాదన వినిపిస్తోంది. దీంతో ఆసరా పింఛన్ల లబ్ధిదారులు డబ్బులకే నెలల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

Updated Date - 2022-08-06T05:25:10+05:30 IST