దేశంలో మరో 2 ఒమైక్రాన్‌ కేసులు

ABN , First Publish Date - 2021-12-05T07:57:57+05:30 IST

దేశంలో మరో రెండు ఒమైక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన వృద్ధుడి(72)కి, మహారాష్ట్రలోని ...

దేశంలో మరో 2 ఒమైక్రాన్‌ కేసులు

జింబాబ్వే నుంచి గుజరాత్‌ వచ్చిన వృద్ధుడిలో వేరియంట్‌.. దక్షిణాఫ్రికా నుంచి ముంబై చేరిన మెరైన్‌ ఇంజనీర్‌కూ..

కరోనా కేసుల్లో పెరుగుదల.. అప్రమత్తం కండి.. కర్ణాటక, కేరళ, తమిళనాడు, కశ్మీర్‌కు కేంద్రం హెచ్చరిక


న్యూఢిల్లీ, డిసెంబరు 4: దేశంలో మరో రెండు ఒమైక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన వృద్ధుడి(72)కి, మహారాష్ట్రలోని ముంబై శివారు కల్యాణ్‌ డోంబివ్లి వాసి, మెరైన్‌ ఇంజనీర్‌ అయిన యువకుడి (33)కి కొత్త వేరియంట్‌ నిర్ధారణ అయింది. దీంతో దేశంలో ఈ వేరియంట్‌ బారినపడిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. జామ్‌నగర్‌ వృద్ధుడు కొన్నేళ్ల నుంచి జింబాబ్వేలో ఉంటున్నారు. బంధువులను కలిసేందుకు నవంబరు 28న భారత్‌ వచ్చారు. జ్వరంగా ఉండడంతో పరీక్ష చేయించుకున్నారు. గురువారం పాజిటివ్‌ అని తేలింది. జన్యు విశ్లేషణ ఫలితాల్లో ఒమైక్రాన్‌ ఉన్నట్లు స్పష్టమైంది.


ఉద్యోగ విధుల రీత్యా.. టీకా పొందలేక

ముంబై యువకుడు దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్‌ మీదుగా గత నెల 23న ఢిల్లీ వచ్చాడు. టెస్టులకు నమూనా ఇచ్చి, ముంబై చేరుకున్నాడు. తాజాగా ఇతడికీ ఒమైక్రాన్‌ నిర్ధారణ అయింది. మెరైన్‌ ఇంజనీర్‌ అయిన ఈ యువకుడు విధుల రీత్యా ఏప్రిల్‌ నుంచి నౌక పైనే ఉన్నాడు. పలుచోట్ల టీకా కోసం ప్రయత్నించినా వీలు కాలేదు. గత నెల చివరలో నౌక దక్షిణాఫ్రికా చేరుకున్నాక రిలీవ్‌ అయ్యాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఇంటికి వచ్చిన ఆనందంలో ఉన్న అతడికి అనూహ్యంగా ఒమైక్రాన్‌ నిర్ధారణ అయింది.


తప్పించుకుంటున్నవారితో తలనొప్పి

ముప్పు జాబితాలోని దేశాల నుంచి వచ్చినవారు కొవిడ్‌ టెస్టులను తప్పించుకుంటుండటం అధికారులకు తలనొప్పిగా మారుతోంది. యూపీలోని మేరఠ్‌కు విదేశాల నుంచి వచ్చిన 300 మందిలో 13 మంది తప్పుడు చిరునామాలు, ఫోన్‌ నంబర్లు ఇచ్చారు. వీరిలో ఏడుగురు దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు  ఓ మహిళపై కేసు నమోదు చేశారు. మరోవైపు బెంగళూరులో ఇప్పటికీ 10 మంది ఆచూకీ తెలియడం లేదు. 


ఐదు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు

రోజువారీ కరోనా కేసుల్లో భారీగా పెరుగుదల, మరణాల రేటు ఎక్కువగా ఉంటుండడంతో కేంద్ర ప్రభుత్వం శనివారం తమిళనాడు, కేరళ, కర్ణాటక, మిజోరం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌ యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ శనివారం ఆయా రాష్ట్రాలకు లేఖ రాశారు. ముప్పు జాబితాలోని దేశాల నుంచి వచ్చేవారిపై పర్యవేక్షణ పెంచాలని, పెద్దఎత్తున కేసులు వస్తున్న ప్రాంతాల్లోని నమూనాలను జన్యు విశ్లేషణకు పంపాలని సూచించారు. గత వారం కశ్మీర్‌లోని కథువా జిల్లాలో కేసులు 727 శాతం, కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో 152 శాతం, తమిళనాడులోని మూడు జిల్లాల్లోనూ కేసులు పెరగడాన్ని ఆయన ప్రస్తావించారు. కేరళలో మరణాలు అధికంగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, దేశంలో శుక్రవారం 8,603 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. 415 మంది(కేరళ-269) మృతిచెందినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో వందమంది మృతి చెందినట్లు బులెటిన్‌లో పేర్కొంది. మహారాష్ట్ర ఇన్‌చార్జి చీఫ్‌ సెక్రటరీ దేవాశిష్‌ చక్రవర్తి(59) ఎట్టకేలకు టీకా తొలి డోసు తీసుకున్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు టీకా పొందడం తప్పనిసరి కావడంతో ఆయన టీకా వేయించుకున్నట్లు తెలుస్తోంది. కనీసం ఒక డోసు టీకా కూడా వేయించుకోని వారికి హోటళ్లు, మార్కెట్లలోకి ప్రవేశానికి అనుమతి నిరాకరిస్తూ తమిళనాడు మదురై కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. ఈ నగరంలో 3 లక్షల మంది ఇంకా తొలి డోసు కూడా పొందకపోవడం గమనార్హం.


దక్షిణాఫ్రికాలో భారీగా 

కరోనా బారిన చిన్నారులు

ఒమైక్రాన్‌ వెలుగుచూశాక.. దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం 16,055 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఇందులో 80ు ఒమైక్రాన్‌ జన్మస్థానం గౌటెంగ్‌ ప్రావిన్సువే కావడం గమనార్హం. అయితే, కొత్త కేసుల్లో ఐదేళ్లలోపు పిల్లలు అధికంగా ఉండడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఒకటో, రెండో వేవ్‌లో పిల్లలు పెద్దగా కొవిడ్‌కు గురికాలేదు. ఆస్పత్రుల పాలవలేదు. మూడో వేవ్‌లో ఐదేళ్లలోపు పిల్లలతో పాటు 15-19 ఏళ్ల మధ్య వయసు వారు కరోనాతో ఆస్పత్రుల్లో చేరారు. అయితే, ఇప్పుడు నాలుగో వేవ్‌లో ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు భారీగా ఆస్పత్రుల్లో చేరుతున్నారు. మేం అంచనా వేసిన దానికంటే ఇది తక్కువే. అయితే, 60 ఏళ్లు దాటిన రోగుల తర్వాత ఐదేళ్లలోపు పిల్లల చేరికే ఎక్కువగా ఉంది’’ అని దక్షిణాఫ్రికాకు చెందిన డాక్టర్‌ వాసిలా జస్సాత్‌ తెలిపారు. నాలుగో వేవ్‌ ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఉండడంపై మరింత పరిశీలన అవసరమని మరో నిపుణుడు డాక్టర్‌ మైకేల్‌ గ్రూమ్‌ పేర్కొన్నారు. కాగా,  ఒమైక్రాన్‌ 38 దేశాలకు వ్యాపించిందని.. ఎవరూ చనిపోలేదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

Updated Date - 2021-12-05T07:57:57+05:30 IST