రవాణా శాఖ బదిలీల్లో గందరగోళం

ABN , First Publish Date - 2022-07-04T05:27:25+05:30 IST

రవాణా శాఖలో బదిలీలకు సంబంధించి గందరగోళం నెలకొంది. గత నెల 30నాటికి ప్రకియ పూర్తికావాల్సి ఉండగా 29న కమిషనర్‌ బదిలీ కావడం, కొత్త కమిషనర్‌ రాజబాబు 30న బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దీంతో బదిలీలకు బ్రేక్‌ పడింది. మరో 15 రోజులు గడువు కావాలని కోరునూ నూతన కమిషనర్‌ ప్రభుతానికి లేఖ రాశారు. అదేక్రమంలో బదిలీలకు నూతన మార్గదర్శకాలు చేశారు. గతంలో కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేయాలని నిర్ణయించగా, ప్రస్తుతం ఆ ప్రక్రియ ఎత్తివేశారు. ఐదు ఆప్షన్లకు మాత్రమే పరిమితం చేశారు.

రవాణా శాఖ బదిలీల్లో  గందరగోళం
ఆర్టీఏ కార్యాలయం

కమిషనర్‌ మార్పుతో 

పూర్తికాని ప్రక్రియ 

జోన్‌-3లో చక్రం తిప్పుతున్న 

ఓ బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌

పోస్టింగ్‌లు ఇప్పిస్తానని బేరాలు 

ఇప్పటికే చేతులు మారిన నగదు

కౌన్సెలింగ్‌ను ఎత్తివేయడంపై విమర్శలు 

కటాఫ్‌ డేటుపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం

ఒంగోలు (క్రైం), జూలై 3  : రవాణా శాఖలో బదిలీలకు సంబంధించి గందరగోళం నెలకొంది. గత నెల 30నాటికి ప్రకియ పూర్తికావాల్సి ఉండగా 29న కమిషనర్‌ బదిలీ కావడం, కొత్త కమిషనర్‌ రాజబాబు 30న బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దీంతో బదిలీలకు బ్రేక్‌ పడింది. మరో 15 రోజులు గడువు కావాలని కోరునూ నూతన కమిషనర్‌ ప్రభుతానికి లేఖ రాశారు. అదేక్రమంలో బదిలీలకు నూతన మార్గదర్శకాలు చేశారు. గతంలో కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేయాలని నిర్ణయించగా, ప్రస్తుతం ఆ ప్రక్రియ  ఎత్తివేశారు. ఐదు ఆప్షన్లకు మాత్రమే పరిమితం చేశారు. దీంతో పైరవీలు జోరుగా సాగుతున్నాయి. 


రూ.50లక్షలు పలుకుతున్న డీటీసీ పోస్టు 

జోన్‌-3లోని బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఒకరు పోస్టింగ్‌లు వేయిస్తానని మిగిలిన బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్లతో బేరసారాలు ప్రారంభించారు. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలను జోన్‌-3 అంటారు. ప్రస్తుతం ఈ జోన్‌లో పనిచేస్తున్న మరో బ్రేక్‌ఇన్‌స్పెక్టర్‌, పైరవీలు చేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ మధ్య విభేదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వీరు తారస్థాయిలో గొడవపడినట్లు సమాచారం. ఇప్పటికే నగదు చేతులు మారడంతో అవి తిరిగి వస్తాయా.. ప్రభుత్వం బదిలీలకు మరో 15 రోజులు గడువు ఇస్తుందా అన్న మీమాంస  రవాణా శాఖ ఉద్యోగుల్లో నెలకొంది. అదేమయంలో ఒంగోలు డీటీసీ పోస్టుకు రూ.50లక్షల ధర పలుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు చోటా నేతలు రంగంలోకి దిగి తమకు అనుకూలమైన వారికి ఆ పోస్టు ఇప్పించేందుకు పావులు కదపడం ప్రారంభించారు. 


కౌన్సెలింగ్‌ ఎత్తివేతపై విమర్శలు

రవాణా శాఖలో గతంలో బదిలీలు పారదర్శకంగా జరిగాయి. ప్రస్తుతం పోస్టులకు భారీ మొత్తంలో డబ్బు వసూలు చేయడంతోపాటుగా ఆ వ్యవహారంలో ప్రత్యక్షంగా ఓ బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్ర ఉండటం చర్చనీయంశమైంది. అదేసమయంలో తొలుత ఇచ్చిన నిబంధనల్లో ఉన్న కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఇప్పుడు ఎత్తివేయడం విమర్శలకు తావిస్తోంది.  కౌన్సెలింగ్‌ లేకపోతే బదిలీల్లో పారదర్శకత ఉంటుందా అన్న అనుమానాలను పలువురు ఉద్యోగులు వ్యక్తం చేశారు. 


జిల్లాకు వచ్చేందుకు పలువురు ప్రయత్నాలు 

జిల్లాలో గ్రానైట్‌ పరిశ్రమతోపాటు జాతీయ రహదారి ఉంది. దీంతో ఇక్కడ అదనపు ఆదాయం దండిగా సంపాదించుకోవచ్చన్న ఉద్దేశంతో అనేక మంది ఇన్‌స్పెక్టర్లు జిల్లాకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బదిలీలు పారదర్శకంగా చేపడితో అలాంటి వారికి ఆ అవకాశం ఉండదు. దీంతో అడ్డదారుల్లోనైనా జిల్లాకు వచ్చే ప్రయత్నాలను ముమ్మరంగా చేస్తున్నారు. 


Updated Date - 2022-07-04T05:27:25+05:30 IST