అన్న కాలనీల్లో.. అష్ట సమస్యలు...

ABN , First Publish Date - 2022-04-23T06:26:18+05:30 IST

మిమ్మల్ని ఒకరు విందు భోజనానికి పిలిచారు. విందులో ఏమేమీ వంటకాలు కావాలో...? మీరే కోరుకోమని ముందుగానే.. చెప్పారు.. దీంతో లొట్టలేసుకుంటూ వంటల జాబితాను అతనికి మీరు చెప్పేశారు. విందు సమయానికి ఎంతో ఆశతో వెళ్లి.. పంక్తిలో ఎలాగోలా కష్టపడి సీటు సాధించి కూర్చున్నారు.. అక్కడ మీలాంటి వాళ్లు కుప్పకుప్పలుగా ఉన్నారు.. మీ ముందు అరటి ఆకు వేసి... గ్లాస్‌ నీళ్లు పెట్టి వెళ్లారు..

అన్న కాలనీల్లో.. అష్ట సమస్యలు...
ఇళ్లు నిర్మాణం కాని.. ములకలచెరువు జగనన్న కాలనీ

ముందుకు సాగని ఇళ్ల నిర్మాణాలు

లబ్ధిదారుని మెడపై.. పట్టా రద్దు కత్తి

రాయచోటి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): మిమ్మల్ని ఒకరు విందు భోజనానికి పిలిచారు. విందులో ఏమేమీ వంటకాలు కావాలో...? మీరే కోరుకోమని ముందుగానే.. చెప్పారు.. దీంతో లొట్టలేసుకుంటూ వంటల జాబితాను అతనికి మీరు చెప్పేశారు. విందు సమయానికి ఎంతో ఆశతో వెళ్లి.. పంక్తిలో ఎలాగోలా కష్టపడి సీటు సాధించి కూర్చున్నారు.. అక్కడ మీలాంటి వాళ్లు కుప్పకుప్పలుగా ఉన్నారు.. మీ ముందు అరటి ఆకు వేసి... గ్లాస్‌ నీళ్లు పెట్టి వెళ్లారు.. ఆ తర్వాత ఎంత సేపు గడిచినా.. వంటలు రాలేదు.. అసలు వంటలు వండిన ఆనవాళ్లే కనిపించలేదు.. ఇంకా ఎంత సేపు.. వేచి చూడాలి... ఆకలిగా ఉంది.. వంటలు వడ్డించమని అడిగితే.. మీరు అడిగిన వంటలు పెట్టే ఆర్థిక స్థోమత మాకు లేదు.. మీరు కోరుకున్న వంటలు వండడం చాలా ఎక్కువ ఖర్చు అవుతోంది.. మీ ముందు ఉన్న గ్లాస్‌నీళ్లు తాగి వెళ్లిపోండి.. కాదంటే.. మీ ముందు ఉన్న అరటి ఆకు.. గ్లాస్‌ నీళ్లు కూడా లాగేసుకుంటాం.. అని అతను చేతులెత్తేస్తే.. మీ పరిస్థితి ఎలా ఉంటుందో..? ఊహించుకోండి.. అచ్చం... అలాంటి పరిస్థితే.. జిల్లాలోని జగనన్న కాలనీల లబ్ధిదారులు ఎదుర్కొంటున్నారు.. ‘మా పాలనలో సొంత ఇళ్లు లేని వాళ్లంటూ ఉండకూడదు. వాళ్లందరికీ ఇంటి స్థలం ఇచ్చి.. మేమే ఇళ్లు కట్టిస్తాం’ అని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. వేల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం జోరుగా చేశారు. దీంతో జనం ఎగబడ్డారు.. ఎగబడిన జనాన్ని చూసి.. రాష్ట్ర ప్రభుత్వం మాటలో మార్పులు వచ్చాయి.. ఇంతమందికి ఇళ్లు నిర్మించాలంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు.. మేము రూ.1.80 లక్ష నగదు ఇస్తాం.. మీరే కట్టుకోండి.. అన్నారు. పైగా నగదును విడతల వారీగా మీ అకౌంటులోకి వేస్తాం అన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం మాటలను గమనించిన లబ్ధిదారులు.. అప్పోసప్పో చేసి.. ఇళ్లు కట్టుకున్నా.. డబ్బు ఇస్తారో.? లేదో.. ? అని ముందుకు రాకపోవడంతో.. మీరు ఏం చేస్తారో.. ? మాకు అనవసరం.. మీరు ఇళ్లు కట్టుకోకపోతే. మీకు ఇచ్చిన స్థలం రద్దు చేస్తాం.. అంటూ అధికారులు హూంకరిస్తుండడంతో.. ఏం చేయాలో పాలుపోక.. లబ్ధిదారులు బిక్కుబిక్కుమంటున్నారు.. ఇదీ ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని జగనన్న కాలనీల్లో జరుగుతున్న తతంగం..


అష్ట సమస్యలతో.. ఇబ్బందుల్లో లబ్ధిదారులు

1. ఊరికి దూరంగా స్థలాల కేటాయింపు

2. నిర్మాణ వ్యయానికి తగ్గట్టు యూనిట్‌ కాస్ట్‌ పెంచకపోవడం (ఇనుము, సిమెంటు ధరలు విపరీతంగా పెరగడం)

3. గుట్టలు, రాళ్ల మధ్య ప్లాట్లు కేటాయించడం

4. నిర్మాణ సామగ్రి కొరత (ఇసుక, కంకర, రాళ్లు) 

5. నీళ్ళతో ఇబ్బందులు

6. కాలనీలోకి సరైన దారులు లేక పోవడం

7. మేస్త్రీ, కూలీల కొరత

8. పట్టా రద్దు అవుతుందని పునాది నిర్మాణం. తర్వాత కనిపించని పురోగతి

పై అష్ట సమస్యలతో.. జగనన్న కాలనీల్లో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. 


ముందుకు సాగని నిర్మాణాలు

రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో ఆర్భాటంగా మొదలు పెట్టింది. ప్రతి మండలంలోనూ పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. పట్టాలు పంపిణీ చేయడంలో చూపిన శ్రద్ధ.. జగనన్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించలేదు. ఇళ్ల నిర్మాణాలను మొదలు పెట్టేందుకు లబ్ధిదారులు సాహసించలేకపోయారు. దీంతో ఇప్పటికీ పలుచోట్ల జగనన్న కాలనీలలో గుట్టలు, రాళ్లు ఉన్నాయి. అక్కడ పునాదులు తీసుకోవడానికి కూడా వీలు కావడం లేదు. ఇదే సమయంలో వెంటనే.. మీకు ఇచ్చిన స్థలంలో నిర్మాణాలు చేపట్టాలి.. లేకుంటే ఇచ్చిన పట్టాలను రద్దు చేస్తామని అధికారులు లబ్ధిదారులను బెదిరిస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలు పోక.. లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 


ఇళ్ల స్థలాలు గుట్టల్లో ఇచ్చారు

- అరుణమ్మ, కొండపల్లె పంచాయతీ, నిమ్మనపల్లె మండలం

ప్రభుత్వం మాకు ఊరికి దూరంగా గుట్ట ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దీంతో ఇళ్లు కట్టుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. మాతో పాటు మా కులస్థులకు నలుగురికి ఇల్లు వచ్చాయి. ఇక్కడ నీటి వసతి లేదు. పైగా మాకు ఇచ్చిన స్థలం సరిపోలేదు. ఇప్పటి వరకు ఇక్కడ ఒకరు మాత్రమే గోడల వరకు నిర్మించారు. 


అదనంగా రూ.4.5 లక్షలు ఖర్చు చేశా

- రవి ఆచారి, రెడ్డివారిపల్లె పంచాయతీ

రెడ్డివారిపల్లె పంచాయతీలో ప్రభుత్వం జగనన్న కాలనీ మంజూరు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన రూ.1.80 లక్షలు సరిపోకపోవడంతో అదనంగా నాలుగన్నర లక్షల రూపాయలు ఖర్చు చేశాను. ఈ కాలనీలో కేవలం పది మంది మాత్రమే ఇళ్లు నిర్మాణం పూర్తి చేశారు. మౌలిక వసతులు లేకపోవడంతో.. ఎవరూ ఇక్కడికి రావడం లేదు. విద్యుత్‌ సౌకర్యం లేకపోవడంతో రాత్రుల్లో పాముల బెడద ఎక్కువగా ఉంది. 


ఇళ్లు మంజూరైన, పనులు జరుగుతున్న ఇళ్ల వివరాలు 

506 కాలనీలు.. 85, 734 ఇళ్లు.. 

అన్నమయ్య జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో మొత్తం 506 జగనన్న కాలనీలు ఉన్నాయి. అందులో 85,734 ఇళ్లు మంజూరయ్యాయి. కాలనీలు.. మంజూరైన వివరాలు ఒకసారి పరిశీలిస్తే..


నియోజకవర్గం మొత్తం కాలనీలు మంజూరైన ఇల్లు వివిధ దశల్లో ఉన్నవి మొదలు కానివి పూర్తయినవి

మదనపల్లె, తంబళ్లపల్లె 154 26,380 13,066 13,314 -

రాజంపేట, రైల్వేకోడూరు 170 30,400 30,400 - -

పీలేరు 89 10,089 6128 3748 213

రాయచోటి 93 18,865 8158 1675 137

(రిజిస్టర్‌ అయినవి 9970)

Updated Date - 2022-04-23T06:26:18+05:30 IST