సంక్రాంతికి రెండున్నర నెలల సమయం ఉంది. అయితే, ముందుగానే థియేటర్ల దగ్గర బాక్సాఫీస్ బరిలో దిగుతున్న సినిమాలేవి? అనే అంశంలో స్పష్టత వస్తోంది. నితిన్, కీర్తీ సురేశ్ జంటగా నటిస్తున్న ‘రంగ్ దే’ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు కొన్ని రోజుల క్రితమే వెల్లడించారు. అలాగే, అఖిల్ హీరోగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కూడా! పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను విజయదశమికి విడుదల చేశారు. ఇప్పుడీ సంక్రాంతి చిత్రాల జాబితాలో తాజాగా ‘క్రాక్’, ‘రెడ్’ కూడా చేరాయి. ఈ రెండిటినీ సంక్రాంతి బరిలో తీసుకొస్తున్నట్టు విజయదశమి సందర్భంగా ఆయా చిత్రబృందాలు వెల్లడించాయి.
థియేటర్లలో కలుద్దాం!
‘‘లెట్స్ గెట్ క్రాక్ ఇన్! త్వరలో థియేటర్లలో కలుద్దాం’’ అని రవితేజ అంటున్నారు. ఆయన శక్తిమంతమైన పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘క్రాక్’. దీనికి 2021 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు విజయదశమి సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్న చిత్రమిది. రవితేజ సరసన శ్రుతీ హాసన్ కథానాయికగా నటిస్తున్నారు. అప్సరా రాణి ప్రత్యేక పాటలో స్టెప్పులు వేసిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు.
తొలిసారి థ్రిల్లర్ చేశా!
‘ఇస్మార్ట్ శంకర్’ విజయం తర్వాత రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రెడ్’. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకు వస్తున్నామని చిత్రనిర్మాత చిత్రనిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ తెలియజేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఇదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కమ్ లవ్ ఎంటర్టైనర్. ఇందులో క్రైమ్ మాత్రమే కాదు... చక్కని ప్రేమకథ, మదర్ సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి. అవన్నీ హైలైట్‌గా నిలుస్తాయు. స్రవంతి మూవీ్సలో రామ్‌తో చాలా మంచి చిత్రాలు చేశాం. ఇది మరో మంచి చిత్రం అవుతుంది’’ అన్నారు. ‘‘నా 18వ చిత్రమిది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో మూడోది. కెరీర్లో తొలిసారి థ్రిల్లర్ చేశా. ఇందులో మాస్, క్లాస్ అంశాలన్నీ ఉంటాయి’’ అని రామ్ చెప్పారు. ‘‘కథ, కథనం కొత్తగా ఉంటాయి. థ్రిల్లర్ అయినప్పటికీ కమర్షియల్‌గా ఉంటుంది’’ అని దర్శకుడు కిశోర్ తిరుమల అన్నారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు.