అరేబియా అలల్లో... మునిగే, తేలే గంగాధరుడు!

ABN , First Publish Date - 2021-07-30T05:30:00+05:30 IST

ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూత క్షేత్రాలు, పంచారామాలు... ఇలా విశిష్టమైన శివాలయాలు

అరేబియా అలల్లో...  మునిగే, తేలే గంగాధరుడు!

ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూత క్షేత్రాలు, పంచారామాలు... ఇలా విశిష్టమైన శివాలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే స్తంభేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయం వీటన్నిటికన్నా ప్రత్యేకం. ఈ గుడిలో శివుడి దర్శనం అలల ఆటుపోట్ల మీద ఆధారపడి ఉంటుంది.


భక్తులతో పాటు పర్యాటకులను కూడా విశేషంగా ఆకర్షించే ప్రదేశం స్తంభేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయం. ఇది గుజరాత్‌లోని కవి కంబోయిలో... అరేబియా సముద్ర తీరంలో ఉంది. చూస్తూండగానే మెల్లమెల్లగా మాయమైపోయి, కొన్ని గంటల తరువాత క్రమక్రమంగా మళ్ళీ ప్రత్యక్షమయ్యే ఇలాంటి గుడి మరెక్కడా కనిపించదు. ఈ ఆలయం అతి పురాతనమైనదనీ, దీని ప్రస్తావన స్కాంద పురాణంలో ఉందనీ చెబుతారు. ఈ ఆలయం ఆవిర్భావం గురించి వివరించే ఒక కథ స్థల పురాణంలో ఉంది.




తారకాసురుడు  శివ భక్తుడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. తనకు అమరత్వం ప్రసాదించాలని తారకాసురుడు అడుగుతాడు. అయితే, జనన-మరణ చక్రాన్ని దేవతలు సైతం నియంత్రించలేరని చెబుతాడు శివుడు. ‘‘అయితే మీ కుమారుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ నాకు మరణం రాకుండా వరం ఇవ్వండి’’ అని ప్రార్థిస్తాడు తారకాసురుడు. ఆ వరాన్ని శివుడు ప్రసాదిస్తాడు. తనకు చావులేదన్న గర్వంతో విజృంభించిన తారకాసురుడి అకృత్యాలతో ముల్లోకాలూ అల్లాడిపోతాయి. చివరకు శివపుత్రుడిగా జన్మించిన కార్తికేయుడి చేతిలోనే తారకాసురుడు మరణిస్తాడు.


అయితే, తన తండ్రికి గొప్ప భక్తుడైన తారకాసురుణ్ణి చంపి పాపం చేశానన్న చింత కుమారస్వామిని కలవరపరుస్తుంది. దీనికి పరిహారం ఏమిటని మహా విష్ణువును అడుగుతాడు. లోకకంటకుడైన రాక్షసుణ్ణి చంపడం తప్పు కాదనీ, అయితే శివభక్తుణ్ణి చంపిన పాపం అంటకుండా ఉండడానికి శివ లింగాన్ని ప్రతిష్ఠించాలని విష్ణువు సూచిస్తాడు. ఆ ప్రకారం, తారకాసురుణ్ణి తాను చంపిన చోటే శివ లింగాన్ని షణ్ముఖుడు ప్రతిష్ఠించాడు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని సుమారు నూట యాభై ఏళ్ళ క్రితం నిర్మించారు. 




ప్రతిరోజూ అలల ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆలయం, దానికి చేరుకోవడానికి ఏర్పాటు చేసిన వంతెన క్రమంగా నీటిలో మునిగిపోతాయి. కెరటాల తీవ్రత తగ్గుతూ ఉంటే కొంచెం కొంచెంగా బయటపడతాయి. గుడి పూర్తిగా కనిపించిన తరువాత... భక్తులు ఆలయంలోకి వెళ్ళి స్వామిని దర్శించుకొని, పూజలు చేస్తారు. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో నదికి ఆటుపోట్లు ఎక్కువ కాబట్టి ఎక్కువ సేపు నిరీక్షించక తప్పదు. ఈ క్రమాన్నంతా తిలకించడానికి భక్తులతో పాటు సందర్శకులు కూడా పెద్ద సంఖ్యలో పొద్దుటి నుంచి రాత్రి వరకూ సముద్ర తీరంలోనే గడుపుతూంటారు. స్తంభేశ్వర మహాదేవుణ్ణి వేడుకుంటే... పాప కర్మల నుంచి విముక్తి లభిస్తుందని, మానసిక ఆందోళనలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.  


ప్రతిరోజూ అలల ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆలయం, దానికి చేరుకోవడానికి ఏర్పాటు చేసిన వంతెన క్రమంగా నీటిలో మునిగిపోతాయి. కెరటాల తీవ్రత తగ్గుతూ ఉంటే కొంచెం కొంచెంగా బయటపడతాయి. 



Updated Date - 2021-07-30T05:30:00+05:30 IST