Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 19 Jan 2022 02:57:09 IST

రికార్డుల్లో లేని భూమి రీ సర్వేలో!?

twitter-iconwatsapp-iconfb-icon

51 గ్రామాల్లో భారీగా అదనపు భూమి

పేర్లు, భూ విస్తీర్ణంలోనూ భారీ తేడాలు

అడంగల్‌కు రీ సర్వే రికార్డు మధ్య వ్యత్యాసాలు

పొంతన కుదరడం లేదు.. తప్పెవరిది?

సర్వేలో లోపాలా.. మరేదైనానా?

ప్రహసనంగా భూముల రీసర్వే


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో భూముల సర్వే ప్రహసనంగా మారింది. భూ వివాదాల పరిష్కారంతోపాటు.. రైతులకు శాశ్వత హక్కులు కల్పించేందుకు సర్కారు చేపట్టిన భూముల సమగ్ర సర్వేలో ఇప్పుడు మరో కోణం ఆవిష్కృతమవుతోంది. భూమి రికార్డు అడంగల్‌కు, రీ సర్వే అనంతర రికార్డుకు పొంతన కుదరడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు భూములతోపాటు అసైన్డ్‌ భూముల విస్తీర్ణం, పేర్లు, ఇతరత్రా అంశాల్లోనూ భారీ తేడాలు వస్తున్నాయి. రెవెన్యూ, సర్వేశాఖ ఏడాదంతా కలిసి చేస్తున్న భూముల సర్వేలో అసలు ఫలితం ఏమోకానీ.. పొంతన కుదరని రికార్డులు వెలుగుచూడటమే ఆందోళన కలిగించే అంశం. రీ సర్వే అద్భుతంగా సాగుతోందని, ఎక్కడా ఏ సమస్యా రావడం లేదని అధికారులు పదేపదే చెబుతున్నా... లోగుట్టు మాత్రం బయటకొస్తోంది.  కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో భూముల సర్వే పైలట్‌ ప్రాజెక్టు చేపట్టినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయో...అంతకు రెట్టింపు స్థాయిలో, ఇంకా కొత్తవైన సమస్యలు మిగిలిన 51 గ్రామాల్లో పునరావృతమవుతున్నాయి. భూ రికార్డుల స్వచ్ఛీకరణ పేరిట కొన్నేళ్లుగా రెవెన్యూశాఖ మహా ప్రాజెక్టు చేస్తూన్నా.. అదంతా ఒట్టి డొల్లే అని తేల్చేసేలా ఫలితాలు వస్తున్నాయి. తక్కెళ్లపాడు పైలట్‌ అనంతరం సర్కారు 13 జిల్లాల పరిధిలోని 51 గ్రామాల్లో ఏడాది పాటు రీ సర్వే జరిగింది. రీ సర్వే సందర్భంగా భూమి చిత్రాలను గ్రౌండ్‌ ట్రూతింగ్‌, గ్రౌండ్‌ వాలిడేషన్‌ చేశారు. ఆ గ్రామాల్లో రీ సర్వే పూర్తయినట్లుగా చాలా ఆర్భాటంగా సర్వే, సరిహద్దుల చట్టంలోని సెక్షన్‌ 13 ప్రకారం నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇక ఆ గ్రామాల్లో భూ వివాదాలు వస్తే సివిల్‌ కోర్టుల్లోనే తేల్చుకోవాలి. ఇదంతా ఒక ఎత్తు. కానీ, రీ సర్వేలో ఏం జరిగిందో ఇటీవల రెవెన్యూ శాఖ జిల్లాల నుంచి తెప్పించిన డేటాను క్రోడీకరించి రూపొందించిన నివేదిక అసలు లోగుట్టును బయటపెట్టింది. దీని ప్రకారం, సెక్షన్‌ 13 ప్రకారం నోటిఫికేషన్‌ జారీ చేసిన ఆ 51 గ్రామాల్లో అడంగల్‌కు, రీ సర్వే రికార్డుకు పొంతన కుదరడం లేదని తేలింది. జిల్లాల వారీగా వచ్చిన నివేదికలను క్రోడీకరించిన అనంతరం ప్రభుత్వ, అసైన్డ్‌తోపాటు ప్రైవేటు భూముల విస్తీర్ణంలోనే చాలా తేడాలు వచ్చాయి. రీ సర్వే అనంతరం మూడు కేటగిరీల్లోనూ అడంగల్‌లో నమోదు చేసిన భూమి విస్తీర్ణం కన్నా అత్యధికంగా వచ్చినట్లు గుర్తించారు. రీ సర్వేలో భూమిని ల్యాండ్‌ పార్సిల్స్‌గా గుర్తిస్తున్నారు. దీని ప్రకారం ప్రభుత్వ భూముల కేటగిరీలో 51 గ్రామాల్లో  675 ల్యాండ్‌ పార్సిల్స్‌లో ఎక్కువ విస్తీర్ణం వచ్చినట్లు తేలింది. అసైన్డ్‌ ల్యాండ్‌ కేటగిరీలో 299 ల్యాండ్‌ పార్సిల్‌లో ఎక్కువ విస్తీర్ణం వచ్చింది. ఇక, ప్రైవేటు భూముల్లో తేడాలకు అంతులేకుండా ఉంది. ఏకంగా 5638 ల్యాండ్‌పార్సిల్‌ల్లో భూవి ఎక్కువగా  వచ్చినట్లు తేలింది. ప్రభుత్వ భూములకు సంబంధించి కడప జిల్లా పులివెందుల మండలం రాగిమానుపల్లెలో 84 ల్యాండ్‌ పార్సిల్‌లో ఎక్కువ విస్తీర్ణం వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం గోగుమిల్లిలో 58, అమలాపురం మండలం పాలగుమ్మి గ్రామంలో 24, కృష్ణా జిల్లా పులిచింతలపాలెంలో 33 ల్యాండ్‌ పార్సిల్స్‌లో అత్యధిక విస్తీర్ణం వచ్చినట్లు తెలిసింది. అసైన్డ్‌ భూముల విషయంలో నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మొగళ్లూరులో 156, చిల్లకూరు మండలం రెడ్డిగుంటలో 55, అనంతపురంజిల్లా కదిరి మండలం కమతంపల్లెలో 28 ల్యాండ్‌ పార్సిల్స్‌లో ఎక్కువ విస్తీర్ణం వచ్చినట్లుగా గుర్తించారు. ప్రైవేటు భూముల విషయంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం భూపాలపట్టణం గ్రామంలో 647, కృష్ణా జిల్లా ఎస్‌మ్‌పేట గ్రామంలో 387,అనంతపురం జిల్లా పామిడి మండలం రామరాజుపల్లెలో 270, కర్నూలు జిల్లా నంద్యాల మండలం బళ్లాపురంలో 180, కళ్లూరు మండలం పందిపాడులో 205 ల్యాండ్‌ పార్సిల్స్‌ పరిధిలో ఎక్కువ విస్తీర్ణం వచ్చింది. అయితే, ఆయా ల్యాండ్‌ పార్సిల్స్‌ పరిధిలో ఎంత మేర అత్యధిక విసీర్ణం రీ సర్వే తర్వాత వెలుగుచూసిందన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఆయా గ్రామాల పరిధిలో రీ సర్వే అనంతరం రూపొందించిన రికార్డుకు, ఒరిజినల్‌  అడంగల్‌లో ఉన్న భూమి విస్తీర్ణానికి పొంతన లోపించిందన్న విషయం స్పష్టంగా పేర్కొన్నారు. 


పేర్లు, విస్తీర్ణంలోనూ తేడాలే.. 

ఇటీవల సర్వే శాఖ రీ సర్వేపై జరిగిన రాష్ట్రస్థాయి వర్క్‌షా్‌పలో మరో ఆసక్తికర అంశం వెలుగుచూసింది. రీ సర్వే పూర్తయిన, కొత్తగా చేపడుతోన్న గ్రామాల్లో భూమి విస్తీర్ణం, ఖాతాదారుల పేర్లు, ఇతర అంశాల్లో అడంగల్‌కు, రీ సర్వే రికార్డుకు పొంతన కుదరడం లేదన్న విషయం బయటకొచ్చింది. 219 గ్రామాల పరిధిల 1,12,951 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. వీటి కి సంబంధించి డ్రోన్‌ సర్వే పూర్తయి, మిగతా సర్వే పనులు పూర్తిచేశాక 96, 973 ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎమ్‌)లు రూపొందించారు. వీటిని క్రోడీకరించినప్పుడు భూమి విసీర్ణం విషయంలో అడంగల్‌తో రీ సర్వే రికార్డును పోలిస్తే 24,363 ఎల్‌పీఎమ్‌ఎమ్‌ల సరిపోలలేదని నివేదికలో పేర్కొన్నారు. కేవలం 14,993 మాత్రమే సరిపోలినట్లు వివరించారు. ఇక ఖాతాదారుల పేర్ల విషయంలో 13,699 తేడా ఉన్నట్లు గుర్తించారు. 


రైతుల్లో ఆందోళన

అడంగల్‌, వెబ్‌ల్యాండ్‌లో తప్పులను సరిదిద్దే పేరిట రెవెన్యూశాఖ అట్టహాసంగా భూమి రికార్డుల స్వచ్ఛీకరణ (పీఓఎల్‌ఆర్‌) చేపట్టింది.  మరి ఇప్పుడు కొత్తగా మళ్లీ భూమి విస్తీర్ణంలో తేడాలు రావడం కలకలం సృష్టిస్తోంది. అంటే పీఓఎల్‌ఆర్‌ సరిగ్గా చేయలేదనే విషయం స్పష్టమవుతోంది. ఈ తప్పులకు బాధ్యులెవరు? రీ సర్వే పూర్తయిన తర్వాత భూముల విసీర్ణం రికార్డు కన్నా ఎక్కువగా రావడం కొత్త సమస్య. రీ సర్వే సరిగ్గా చేయకపోవడం వల్లే ఈ సమస్య వస్తోందా? లేక మరేదైనా సమస్యలు ఉన్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే సర్వేపూర్తయిన 51 గ్రామాల్లో తలెత్తిన సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? అన్నది పెద్ద ప్రశ్న. ఇప్పటికే ఆయా గ్రామాల పరిధిలో చాలా వరకు సర్వేపూర్తయినట్లుగా 13 నోటిఫికేషన్‌ లు ఇచ్చారు. మరి ఇప్పుడు కొత్తగా తలెత్తిన ఎక్కువ విస్తీర్ణం సమస్యను ఎలా పరిష్కరిస్తారన్నదానిపై స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.