Abn logo
May 23 2020 @ 05:34AM

‘మాన్యువల్‌’ మాయ

విధులకు రాని వారికీ హాజరు

పారిశుధ్య విభాగంలో మతలబు

కరోనాతో బయోమెట్రిక్‌ నిలిపివేతతో..

గుర్తించి బిల్లులు నిలిపేసిన అధికారులు

పలు సర్కిళ్లలో కార్మికులకు అందని వేతనాలు

కొన్ని ప్రాంతాల్లో జాప్యం.. ఆందోళనలో కార్మికులు


హైదరాబాద్‌ సిటీ, మే 22 (ఆంధ్రజ్యోతి): బయోమెట్రిక్‌ హాజరు తాత్కాలిక నిలిపివేతతో జీహెచ్‌ఎంసీలోని కొందరు ఆర్థిక ప్రయోజనం పొందాలని భావించారు. విధులకు రాని వారికి హాజరు వేసి వేతనాలు డ్రా చేసే కుట్రకు తెర తీశారు. ఉన్నతాధికారుల పరిశీలనలో విషయం బయటపడడంతో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. దీంతో పలు సర్కిళ్లలో ఇప్పటికీ కార్మికులకు వేతనాలు అందలేదు. ఇతర సర్కిళ్లలోనూ అంతకుముందుతో పోలిస్తే ఆలస్యంగా వేతనాలిచ్చారని కార్మికులు చెబుతున్నారు. గ్రేటర్‌లో 18 వేలమంది అవుట్‌ సోర్సింగ్‌, 1800 మంది వరకు రెగ్యులర్‌ పారిశుధ్య కార్మికులున్నారు.


అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు సంబంధించిన వేతనం ప్రతినెలా జీహెచ్‌ఎంసీ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగా కార్మికులకు వేతనాల చెల్లింపు ఉంటుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్‌లో బయో మెట్రిక్‌ హాజరు తాత్కాలికంగా నిలిపివేశారు. సంస్థ ప్రధాన, సర్కిల్‌ కార్యాలయాలతోపాటు క్షేత్రస్థాయిలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు మాన్యువల్‌గా హాజరు వేస్తున్నారు. కార్మికులకు హాజరు వేసే బాధ్యతను ఎస్‌ఎ్‌ఫఏలకు అప్పగించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 950 మందికిపైగా ఎస్‌ఎ్‌ఫఏలు ఉండగా.. ఒక్కో ఎస్‌ఎ్‌ఫఏ రెండు, మూడు యూనిట్ల హాజరు, పనితీరు (ఒక్కో యూనిట్‌లో ఏడుగురు కార్మికులు ఉంటారు)ను పర్యవేక్షిస్తారు. ఈ క్రమంలో వారి ద్వారా హాజరు వివరాలను అధికారులు తీసుకున్నారు.


ఇదే అదనుగా భావించిన కొందరు ఎస్‌ఎ్‌ఫఏలు పలు సర్కిళ్లలో దీర్ఘకాలంగా విధులకు రాని, అంతకుముందు ఎక్కువ డుమ్మాలు కొట్టే వారికీ హాజరు వేశారని తెలుస్తోంది. దీంతో గతంతో పోలిస్తే పని దినాల సంఖ్య దాదాపు 15 శాతం పెరిగిందని ఓ అధికారి తెలిపారు. సికింద్రాబాద్‌ జోన్‌లోని ఓ సర్కిల్‌లో సుమారు 220 వరకు పనిదినాలు పెరగడంతో వేతనాల చెల్లింపు మొత్తమూ అధికమైంది. అధికారులకు అనుమానం వచ్చి అంతకుముందు హాజరు వివరాలను పరిశీలించారు. మూడు నెలల హాజరు సగటు ఆధారంగా ఏప్రిల్‌ నెలకు సంబంధించిన హాజరు ఖరారు చేసినట్టు ఓ అధికారి చెప్పారు. ఈ క్రమంలో గతంలో ఎక్కువ డుమ్మాలు కొట్టే వారి హాజరులో కోత విధించినట్టు తెలిసింది. 


పని దినాలు పెరగడంతో.. 

కరోనా వైరస్‌ వ్యాప్తి మొదటి రోజుల్లో విధులకు వచ్చేందుకు చాలా మంది కార్మికులు వెనుకంజ వేశారు. కొన్ని రోజులపాటు హాజరు శాతం 60కి మించలేదు. అధికారుల కౌన్సెలింగ్‌, కార్మికులకు అవగాహన రావడంతో విధులకు వచ్చే వారి సంఖ్య క్రమేణా పెరిగింది. సాధారణంగా 21వ తేదీ నుంచి తదుపరి నెల 20 వరకు కార్మికుల పనిదినాలను పరిగణనలోకి తీసుకుంటారు. 25వ తేదీలోపు హాజరు వివరాలు ఏఎంఓహెచ్‌లకు పంపితే.. డిప్యూటీ మునిసిపల్‌ కమిషనర్‌, ఈఆర్‌పీ, ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం 5వ తేదీ వరకు వేతనాలు బ్యాంకు ఖాతాలో జమవుతాయి. సెలవులు, ఇతరత్రా సందర్భాల్లో ఒకటి, రెండు రోజులు ఆలస్యం అవుతుందని రామంతాపూర్‌లో పనిచేసే ఓ పారిశుధ్య కార్మికురాలు తెలిపారు. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన వేతనం ఇప్పటికీ జమ కాలేదు. కార్మికుల హాజరులో భారీ వ్యత్యాసం నేపథ్యంలోనే జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. రెండు, మూడు రోజుల కిందట కొన్ని సర్కిళ్లలో వేతనాలు జమ కాగా... మరికొన్ని సర్కిళ్లలో ఇప్పటికీ అందలేదు. సాధారణంగా కార్మికుల పని దినాలు సగటున 4 లక్షల నుంచి 4.20 లక్షల వరకు ఉంటుందని అంచనా. 


అయితే అంతకుముందుతో పోలిస్తే పనిదినాలు 10 వేలకుపైగా పెరిగాయని చెబుతున్నారు. చాలా సర్కిళ్లలో ఇదే పరిస్థితి ఉండడంతో హాజరు వివరాలను పరిశీలించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఇతర పనులు లేకపోవడంతో చాలామంది విధులకు వస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఏలు చెప్పినట్టు సమాచారం. ఇందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ చాలా సర్కిళ్లలో మోసం జరిగిందని అంచనాకు వచ్చిన అధికారులు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. మే నెలకు సంబంధించిన వేతనాల సమయం పూర్తయిన నేపథ్యంలో.. ఈ నెల వేతనాలు ఎప్పుడు ఇస్తారో? అన్న ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతోంది. ఎస్‌ఎ్‌ఫఏలు చేసిన పొరపాట్లకు పనిచేసే మాకు అన్యాయం జరిగిందని, లాక్‌డౌన్‌ సమయంలో వేతనాలు అందక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఓ కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేశారు.


Advertisement
Advertisement