పదోన్నతులు పొందినా అవే పదవుల్లో...

ABN , First Publish Date - 2020-09-23T10:04:11+05:30 IST

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కమిషనర్‌తో పాటు ఐదు జోన్లకు ఐదుగురు డీసీపీలు

పదోన్నతులు పొందినా అవే పదవుల్లో...

పోలీసుశాఖలో జరగని బదిలీలు

డీసీపీలుగా విధులు నిర్వహిస్తున్న జాయింట్‌ సీపీలు

అదనపు సీపీ విధుల్లో అదనపు డీజీ 

సీఏఆర్‌- అడ్మిన్‌- సౌత్‌జోన్‌లు ఇన్‌చార్జీల పర్యవేక్షణలో

టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పదవీ విరమణ తర్వాత ఓఎస్‌డీగా కొనసాగింపు


నగర పోలీసుశాఖలో పని చేస్తున్న ఐపీఎస్‌ సీనియర్‌ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. అయినప్పటికీ ఆ అధికారులు పాత పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. హోదాకు అనుగుణంగా బదిలీలు జరగకపోవడమే దీనికి కారణం. 


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కమిషనర్‌తో పాటు ఐదు జోన్లకు ఐదుగురు డీసీపీలు ఉన్నారు. సెంట్రల్‌ జోన్‌, నార్త్‌జోన్‌, ఈస్ట్‌జోన్‌, సౌత్‌జోన్‌, వెస్ట్‌జోన్‌లు డీసీపీల నేతృత్వంలో పని చేస్తాయి. వారి ఆధీనంలో ఏసీపీలు, ఎస్‌హెచ్‌ఓలు, ఎస్‌ఐలు ఇతర సిబ్బంది తమ తమ పరిధుల్లో విధులు నిర్వహిస్తుంటారు. వీరికి తోడుగా టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌బీ, సీసీఎస్‌, సీఐడీ, షీ టీం, మహిళా పోలీస్‌స్టేషన్లు సహాయ సహకారాలు అందిస్తుంటాయి. నగరంలో ఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఏ చిన్న ఘటన జరిగినా... స్థానిక ఎస్‌హెచ్‌ఓతో పాటు సంబంధిత డీసీపీలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తగిన చర్యలు  తీసుకుంటారు. 24 గంటలూ శాంతిభద్రతలను పరిరక్షిస్తుంటారు. పరిస్థితి మరీ చేయిదాటితే పోలీస్‌ కమిషనర్‌తో పాటు అదనపు కమిషనర్లు రంగంలోకి దిగుతుంటారు. ఇటీవల జరిగిన పండగలు, ఉత్సవాల బందోబస్తు చర్యల్లో సీపీ సమక్షంలో డీసీపీలే కీలకంగా వ్యవహరించారు. అంతటి కీలక హోదాలో విధులు నిర్వర్తించిన డీసీపీలు పదోన్నతులు వచ్చినా పోస్టింగుల కోసం వేచి చూస్తున్నారు. వారి స్థానంలోకి వచ్చేందుకు డీసీపీలు ఎదురుచూస్తున్నారు. ఇక పాతబస్తీ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. 


డీసీపీ లేని సౌత్‌జోన్‌.. 

నగరంలో అత్యంత సున్నితమైన సౌత్‌జోన్‌లో అసలు డీసీపీ లేకుండానే ఏడాదికి పైగా గడిచింది. ఇక్కడ డీసీపీగా పని చేసిన అంబర్‌ కిషోర్‌ఝా సరిగ్గా 14 నెలల క్రితం కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కీలకమైన పాతబస్తీలో డీసీపీ లేకుండానే పోలీసు వ్యవస్థ కొనసాగుతోంది. డీసీపీ కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్‌పై వెళ్లిన తర్వాత సీఏఏ వ్యతిరేక నిరసనలు కొనసాగినప్పుడు కొన్ని రోజుల పాటు సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాశ్‌ మహంతికి బాధ్యతలు అప్పచెప్పారు. ఆ తర్వాత  కొన్ని నెలలుగా మరో ఐపీఎస్‌ అధికారి గజరావు భూపాల్‌ను సౌత్‌జోన్‌ ఇన్‌చార్జి డీసీపీగా నియమించినప్పటికీ పూర్తి స్థాయి డీసీపీ కేటాయించలేదు. సౌత్‌జోన్‌ లాంటి కీలక జోన్‌లో పూర్తి స్థాయి డీసీపీ లేకుండా ఉండటం పోలీసుల సాహసోపేతమైన చర్యే. ఇటీవల జరిగిన వినాయక నిమజ్జనోత్సవాలు, మొహర్రం వేడుకలు, రంజాన్‌, బక్రీద్‌ పండగలతో పాటు ఎన్నో ఉత్సవాలు, పండగలు ప్రత్యేకంగా పాతబస్తీలోనే జరిగాయి. సీఏఏ వ్యతిరేక నిరసనలు కూడా జరిగాయి. అయినా డీసీపీ లేకుండానే బందోబస్తు కానిచ్చారు. కొన్ని సందర్భాల్లో ఇన్‌చార్జి డీసీపీ సేవలు తీసుకున్నారు. ప్రస్తుత ఇన్‌చార్జి డీసీపీ హయాంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకున్నా... పోలీస్‌స్టేషన్‌లలో కిందిస్థాయిలో పని చేసే సిబ్బందిలో క్రమశిక్షణ కొరవడిందని... చాలా చోట్ల ఉన్నతాధికారుల పరిశీలన తప్పడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని స్థానికులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పాతబస్తీలో పూర్తి స్థాయి డీసీపీని నియమించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. 


ప్రమోషన్లు పొంది అదే పోస్టింగ్‌లో..

సరిగ్గా ఏడాదిన్నర క్రితం (2109 ఏప్రిల్‌లో) రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారికి కొత్త పోస్టింగులు ఇస్తూ ఇప్పటికీ ఆదేశాలు జారీ కాలేదు. అంతకు ముందు 2018 మార్చిలో 38 మంది ఐపీఎస్‌ ఉన్నతాధికారులకు పదోన్నతులు కల్పించి వెంటనే పోస్టింగులు ఇచ్చారు. అందులో భాగంగానే 2018 మార్చిలో హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లు బాధ్యతలు స్వీకరించారు. 2004, 2005 బ్యాచ్‌కు చెందిన 23 మంది ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ గతేడాది ఏప్రిల్‌లో ఉత్తర్వులు జారీ అయ్యాయి. నగరంలో డీఐజీలుగా పదోన్నతులు పొందిన వారిలో వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌, సీసీఎస్‌ డీసీపీ అవినాశ్‌ మహంతి, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ విశ్వప్రసాద్‌, ఈస్ట్‌జోన్‌ డీసీపీ ఎం.రమేశ్‌ ఉన్నారు. డీఐజీ ర్యాంకు పొందిన తర్వాత కూడా ఆయా అధికారులు హైదరాబాద్‌ కమిషనరేట్‌లో జాయింట్‌ సీపీల హోదాలో పాత పోస్టింగులపైనే కొనసాగుతున్నారు. అదే విధంగా పోలీస్‌ కమిషనరేట్‌లో అదనపు సీపీ (క్రైం, షీటీం)గా పని చేస్తున్న షికాగోయెల్‌ అదనపు డీజీగా పదోన్నతి పొందినప్పటికీ ఆమె అదనపు సీపీగానే కొనసాగుతున్నారు. 


ఇన్‌చార్జిలుగా అదనపు బాధ్యతలు

హైదరాబాద్‌ కమిషనరేట్‌లో అడ్మిన్‌ అదనపు సీపీగా పని చేసి పదవీ విరమణ పొందిన మురళీకృష్ణ స్థానం ఇంకా భర్తీ కాలేదు. ఆ స్థానంలో అదనపు సీపీ (క్రైం)గా ఉన్న షికాగోయెల్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే సీఏఆర్‌ (సిటి ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌) హెడ్‌క్వార్టర్స్‌ అదనపు సీపీగా ఉన్న శివప్రసాద్‌ పదవీ విరమణ తర్వాత ఆ బాధ్యతలు అదనపు సీపీ (లా అండ్‌ ఆర్డర్‌) డీఎస్‌ చౌహాన్‌ నిర్వర్తిస్తున్నారు. నగర పోలీసు శాఖకు కీలకంగా ఉన్న టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌ రావు గత నెలలో పదవీ విరమణ పొందారు. అయితే ఆయనను మూడేళ్ల పాటు ఓఎస్‌డీగా సర్వీసు పొడిగించిన ప్రభుత్వం అదే స్థానంలో కొనసాగిస్తోంది. నగరంలో ఉన్న డీసీపీల్లో నార్త్‌జోన్‌ డీసీపీ కలమేశ్వర్‌ మాత్రం డీసీపీగా ఉంటూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సెంట్రల్‌, ఈస్ట్‌, వెస్ట్‌ జోన్‌, సీసీఎస్‌ డీసీపీలకు జాయింట్‌ సీపీల హోదా వచ్చినా డీసీపీ పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. 

Updated Date - 2020-09-23T10:04:11+05:30 IST