‘తాను తీసిన గొయ్యిలో.. జగన్‌ తానే పడ్డారు’

ABN , First Publish Date - 2020-10-24T08:34:29+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేసిన జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు తాను తీసిన గోతిలో తానే పడ్డారని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్ర

‘తాను తీసిన గొయ్యిలో.. జగన్‌ తానే పడ్డారు’

టీడీపీ నేతల మనోగతం



అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి):పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేసిన జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు తాను తీసిన గోతిలో తానే పడ్డారని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలి ప్రతిపక్షంలో ఉండగా ప్రాజెక్టు పనులపై ఆయన విషం చిమ్మారని, ఆయన విమర్శలనే ప్రామాణికంగా తీసుకుని ఇప్పుడు కేంద్రం నిర్మాణ వ్యయంలో కోత పెడుతుంటే.. తలపట్టుకుని ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వస్తోందని విమర్శిస్తున్నారు.


‘భూ సేకరణ చట్టం-2013 వల్ల భూ సేకరణ ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. దీనివల్లే పోలవరం అంచనా వ్యయం పెరిగింది. ఈ విషయాలను మేం పదేపదే కేంద్రానికి వివరించి అంగీకరింపచేశాం. కానీ అదేదో మేం తినేయడానికే నిర్మాణ వ్యయం పెంచామని జగన్‌ దుష్ప్రచారం చేశారు. వీటిని నమ్మి.. పోలవరం టీడీపీకి ఏటీఎంగా మారిందని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆరోపణలు చేశారు. జగన్‌ చెప్పిన మాటలు వారి మనసులో ఉండిపోయి ఇప్పుడు కోత కోశారు’ అని ఆయన వివరించారు.


అప్పట్లో జగన్‌ చేసిన ప్రసంగాలను జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమ శుక్రవారం తన ట్విటర్‌లో పోస్టు చేశారు కూడా. నాడు వైసీపీ దుష్ప్రచారం ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఉసురు తీసే విధంగా మారిందని ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కోత కోస్తే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లకపోవడంపై రాయలసీమ టీడీపీ నేత ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. ‘ఆర్థిక మంత్రి బుగ్గన ఢిల్లీ వెళ్తే అక్కడ ఎవరు పట్టించుకుంటారు? ముఖ్యమంత్రి వెళ్లాలి. కానీ ఢిల్లీ వెళ్తే ఆయన తన కేసుల విషయం తప్ప మరేదీ మాట్లాడుతున్నట్లు కనిపించడం లేదు’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-10-24T08:34:29+05:30 IST