కార్యాలయాల్లో.. కరోనా!

ABN , First Publish Date - 2020-08-13T10:20:12+05:30 IST

కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. ప్రజలతో పాటు నాయకులనూ.. మహమ్మారిని నియంత్రించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వ శాఖల

కార్యాలయాల్లో.. కరోనా!

 కలెక్టరేట్‌, జడ్పీ విభాగాల్లో ‘పాజిటివ్‌’ భయం

 మండల స్థాయి అధికారులకూ పాకిన వైరస్‌

 అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్న వైనం

 ఉద్యోగవర్గాల్లో కొనసాగుతున్న ఆందోళన


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి):కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. ప్రజలతో పాటు నాయకులనూ.. మహమ్మారిని నియంత్రించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వ శాఖల అధికారులను, ఉద్యోగులను సైతం పట్టి పీడిస్తోంది. కరోనా దెబ్బకు జిల్లాలో వివిధ కార్యాలయాలు మూత పడుతున్నాయి. మరికొన్ని కార్యాలయాల్లో విధి నిర్వహణకు ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో వివిధ విభాగాలతో పాటు శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కొంతమంది ఉద్యోగులు కరోనాకు చిక్కుకున్నారు.


కార్యాలయంలో ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ జరిగితే మిగిలిన వారంతా భయంతో విధి నిర్వహణకు వెనకడుగు వేస్తున్నారు. తొలుత జిల్లాలో పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో సహా కొందరు సిబ్బందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సిబ్బంది కోలుకోవడంతో ఆసుపత్రి యథావిధిగా పనిచేస్తోంది. దీంతో అధికారులు కలెక్టరేట్‌తో పాటు జిల్లాలో అన్ని శాఖల కార్యాలయాల్లో కరోనా విస్తరించకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించారు. సంబంధిత అధికారులను ఎవరూ కలవకుండా వాట్సాప్‌, ఫోన్‌, ఆన్‌లైన్‌ ద్వారా వినతులు అందజేసే ఏర్పాట్లు చేశారు. ప్రతి వారం కలెక్టరేట్‌లో జరగాల్సిన ‘స్పందన’ కార్యక్రమాన్ని కూడా డిజిటలైజ్‌ చేశారు.


వాట్సాప్‌, ఈమెయిల్‌ ద్వారానే ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇక ప్రధాన కార్యాలయాలన్నీ వినతులు సమర్పించేందుకు వచ్చేవారిని లోపలికి అనుమతించడం లేదు. అయినా ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బందిని వైరస్‌ వదలడం లేదు. శ్రీకాకుళం పోలీసు డీఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారితో సహా పలువురికి పాజిటివ్‌ రావడంతో పరిమిత సిబ్బందితోనే నెట్టుకొచ్చారు.


పోలీసు, రెవెన్యూ, ఎంపీడీవో, వ్యవసాయ, సాగు, తాగు నీటి కార్యాలయాలలో కొందరు సిబ్బంది కరోనా భారిన పడడంతో అరకొర సిబ్బందితోనే కొనసాగిస్తున్నారు. టెక్కలిలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం గత వారం రోజులుగా మూత పడింది. ప్రస్తుతం టెక్కలి నగర పరిధిలో లాక్‌డౌన్‌ అమలులో ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది అరకొరగానే హాజరవుతున్నారు. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఇదే రెవెన్యూ డివిజన్‌ పరిధిలో పలాస-కాశీబుగ్గ, మందస, సోంపేట, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో పలువురు ఉద్యోగులు కరోనా బాధితులుగా మారారు.


దీంతో ఆ మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు అరకొరగానే సిబ్బంది హాజరవుతున్నారు. పాలకొండ తహసీల్దారు కార్యాలయంలో కూడా కరోనా కలకలం రేగింది. కొంతమంది ఉద్యోగులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.


సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఐటీడీఏ కార్యాలయంలోని వివిధ విభాగాలు తాత్కాలికంగా పనిచేయడం లేదు. ఇక ఆర్డీవో, తహసీల్దారు, ఎంపీడీవో, వ్యవసాయ, గనుల శాఖ కార్యాలయాల్లో కరోనా భయంతో కేవలం 30 శాతం సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. రాజాం మండల రెవెన్యూ కార్యాలయం, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కూడా ఒక్కొక్కరికీ  కరోనా సోకింది. దీంతో ఇక్కడ సిబ్బంది పని చేసేందుకు భయపడుతున్నారు. సరుబుజ్జిలి మండల పరిషత్‌ కార్యాలయంలో సుమారు ఐదుగురికి కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నట్టు తెలుస్తోంది.


దీంతో కార్యాలయ అధికారులు ఎవరూ విధులకు రావడం లేదు. పక్కనే ఉన్న తహసీల్దార్‌ కార్యాలయంలో కూడా ఇతరులు ఎవరూ లోపలికి రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అరకొర సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయిన  తరువాత ప్రతి కార్యాలయంలో శానిటైజేషన్‌ చేస్తున్నారు. బాధిత ఉద్యోగులకు హోం క్వారంటైన్‌కు పంపుతున్నారు. మిగిలిన సిబ్బందికి కరోనా పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తున్నా..


సిబ్బంది విధి నిర్వహణకు జంకుతున్నారు. అన్ని కార్యాలయాలకు ప్రజలను అనుమతించడం లేదు. కేవలం అధికారులు,  ఉద్యోగులు మాత్రమే వచ్చి ఆన్‌లైన్‌ వినతులు, శాఖాపరమైన వ్యవహారాలను మాత్రమే చూస్తున్నారు. కరోనా భయంతో పలువురు ఉద్యోగులు తమకు సెలవు ఇవ్వాలంటూ జిల్లా అధికారులకు వినతులు సమర్పిస్తున్నట్లు తెలిసింది. కొందరు ముఖ్య అధికారులు కూడా కరోనా బారిన పడడంతో కార్యాలయాలకు వస్తున్నవారు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు.

 

 వినతుల పరిష్కారంపై ప్రభావం....

కరోనా వణికిస్తున్న తరుణంలో ప్రజలకు ధైర్యం చెప్పి, వారి వినతులను పరిశీలించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులే భయంతో వణికిపోతుండడంతో సాధారణ పనులు, సమస్యల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇళ్ల పట్టాలు, రేషన్‌ కార్డులు, పింఛన్‌, భూ వివాదాలు, తాగునీటి, సాగునీటి సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలకు అవకాశం లేకుండా పోయింది. కేవలం 30 శాతం సిబ్బంది మాత్రమే విధులకు హాజరవుతున్నందున ప్రజలు ఆన్‌లైన్‌లో సమర్పిస్తున్న అర్జీలకు మోక్షం లభించడం లేదు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోతున్న అర్జీలను పరిశీలించి, ఎప్పటికప్పుడు పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.


Updated Date - 2020-08-13T10:20:12+05:30 IST