పోలీసుల పేరుతో..ఎఫ్‌బీలో ఆగని మోసాలు

ABN , First Publish Date - 2020-09-20T08:04:46+05:30 IST

పోలీసుల పేరుతో ఫేస్‌బుక్‌లో సైబర్‌ నేరగాళ్ల మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఫేక్‌ ఐడీలతో ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపి, అర్జెంటుగా డబ్బులు కావాలంటూ సందేశాలు పంపుతున్న ఉదంతాలు శనివారం మరికొన్ని వెలుగులోకి వచ్చాయి.

పోలీసుల పేరుతో..ఎఫ్‌బీలో ఆగని మోసాలు

ఎస్సైల నుంచి ఎస్పీల దాకా ఫేక్‌ అకౌంట్లు

విశ్రాంత ఐపీఎస్‌ పేరిటా మోసాలు

బంధుమిత్రులకు వందల రిక్వె్‌స్టలు

రెస్పాండ్‌ అయిన వెంటనే పలకరింపులు

డబ్బులు కావాలంటూ విన్నపాలు 

పంపినవారిని బ్లాక్‌లిస్టులో పెడుతున్న మోసగాళ్లు

పోలీసు శాఖలో కలకలం


హైదరాబాద్‌, వనపర్తి, ఖమ్మంక్రైం, కోల్‌సిటీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పోలీసుల పేరుతో ఫేస్‌బుక్‌లో సైబర్‌ నేరగాళ్ల మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఫేక్‌ ఐడీలతో ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపి, అర్జెంటుగా డబ్బులు కావాలంటూ సందేశాలు పంపుతున్న ఉదంతాలు శనివారం మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్‌ ఉదంతాన్ని మరిచిపోక ముందే.. తాజాగా ఎస్సై మొదలు, ఏసీపీ స్థాయి అధికారులు, ఓ విశ్రాంత ఐపీఎస్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఫేస్‌బుక్‌లో ఫేక్‌ ప్రొఫైల్స్‌ క్రియేట్‌చేసి.. అడ్డంగా మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. దీంతో.. పోలీసు శాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది. కొందరు అధికారులైతే.. తమ పనులను పక్కనబెట్టి, తమ పేరుతో ఫేస్‌బుక్‌లో ఉన్న నకిలీ ఐడీలకు డబ్బులు పంపొదంటూ పోస్టులు, వాట్సాప్‌ మెసేజీలు చేయడానికి పరిమితమైపోయారు.


ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన విశ్రాంత ఐపీఎస్‌ మహేంద్ర కుమావత్‌ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా రూపొందించిన సైబర్‌ నేరగాళ్లు ఆయనతో సోషల్‌ మీడియాలో టచ్‌లో ఉన్న వారి నుంచి డబ్బులు వసూలు చేశారు. విషయం ఆయన దృష్టికి వెళ్లడంతో.. సైబర్‌మోసగాళ్ల బారిన పడొద్దంటూ పోస్టులు చేశారు. ఆయన సరిహద్దు భద్రత దళం(బీఎ్‌సఎఫ్‌) డీజీగా కూడా పనిచేశారు.


కాగా.. వనపర్తి జిల్లా పెబ్బేరు ఎస్సై రాఘవేందర్‌రెడ్డి ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ లిస్టులో 679 మంది ఉన్నారు. ఇటీవల వారందరికీ.. ‘రఘువీందర్‌రెడ్డి’ పేరుతో సైబర్‌ నేరగాళ్లు క్రియేట్‌ చేసిన ఫేక్‌ అకౌంట్‌ నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్టులు వెళ్లాయి. ప్రొఫైల్‌ పిక్చర్‌లో ఎస్సై ఫొటో ఉండడంతో.. చాలా మంది ఫ్రెండ్‌ రిక్వెస్టులను ఆమోదించారు. ఆ వెంటనే సైబర్‌నేరగాళ్లు చాటింగ్‌తో మాటలు కలిపారు. రూ. 10వేలు కావాలని, ఉదయమే తిరిగి ఇస్తానని నమ్మబలికారు. అవతల ఉంది ఎస్సై రాఘవేందర్‌రెడ్డి అనుకున్నవారంతా.. సైబర్‌నేరగాళ్లు చెప్పిన మొబైల్‌ నంబరుకు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా డబ్బు పంపారు. చివరికి ఆ ఎస్సై ఫ్రెండ్‌ ఒకరు చెబితేగానీ, మోసం బయటపడలేదు. దీంతో సదరు ఎస్సై.. తన ఫేస్‌బుక్‌ వాల్‌పై.. తన పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే పంపొద్దని హెచ్చరికలు పోస్టు చేశారు.




జోగులాంబ-గద్వాల జిల్లా ఉండవల్లి ఎస్సై జగన్మోహన్‌ పేరుతోనూ ఇలాంటి మోసాలే జరిగాయి. ఆంధ్రజ్యోతి వనపర్తి ప్రతినిధికి కూడా రిక్వెస్ట్‌ వెళ్లడంతో.. ఆమోదించారు. చాటింగ్‌ ప్రారంభించిన సైబర్‌నేరగాళ్లు.. రూ. 20వేలు కావాలని మెసేజ్‌ చేశారు. చాటింగ్‌ను సాగదీస్తుండగా.. సైబర్‌నేరగాళ్లు చాటింగ్‌ను బ్లాక్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. పెబ్బేరు ఎస్సై రాఘవేందర్‌రెడ్డికి చెందిన బ్యాచ్‌లో.. దాదాపు 17 మంది ఎస్సైల పేరుతో ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ అయ్యాయని తెలిసింది. రామగుండం పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌, రామగుండం ఇన్‌స్పెక్టర్‌, గోదావరిఖని వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌, బెల్లంపల్లి రూరల్‌ సీఐ పేర ఫేస్‌బుక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేశారు. ఇలా సైబర్‌ నేరగాళ్లు ఓ అధికారి మిత్రుల నుంచి రూ. 70 వేలు కొల్లగొట్టినట్లు తెలిసింది.

ఖమ్మం టూటౌన్‌ సీఐ తుమ్మ గోపి పేరిట కూడా సైబర్‌నేరగాళ్లు ఫేస్‌బుక్‌లో ఫేక్‌ ఐడీని క్రియేట్‌ చేశారు. నిందితులు ఇస్తున్న ఫోన్‌పే, గూగుల్‌పే ఖాతాల మొబైల్‌ నంబర్లను బట్టి.. వారు ఒడిసా, గురుగ్రామ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లకు చెందినవారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఇతర రాష్ట్రాల్లోనూ ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. నిందితులను గుర్తించి, అరెస్టు చేసేపనిలో పడ్డారు.



పోలీసులే ఎందుకు టార్గెట్‌?


సాధారణంగా ఎవరైనా పరిచయం ఉన్నవాళ్లు డబ్బులు అడిగితేనే.. జీతాల్లో కోతలు, వ్యాపారాలు నడవని ప్రస్తుత పరిస్థితుల్లో వెనకాముందు ఆలోచించాల్సి వస్తోంది. ఫేస్‌బుక్‌ ద్వారా స్నేహితులు అడిగితే అనుమానం వస్తుంది. ఫోన్‌ చేసో లేదా నేరుగా కలిసే అడిగేవారు కదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి.

పోలీసుల పేరుతో అయితే.. డబ్బులు పంపాలని మెసేజ్‌ రాగానే.. ఫేక్‌ అయ్యి ఉండకపోవచ్చు అనుకుంటారు. అందుకే సైబర్‌ నేరగాళ్లు పోలీసుల పేరుతో ఫేక్‌ ప్రొఫైళ్లు క్రియేట్‌ చేసి ఉంటారని తెలుస్తోంది. పోలీసుల ఫేస్‌బుక్‌ ప్రొఫైల్స్‌ నుంచి ఎవరైనా డబ్బులు అడిగితే.. అనుమానించాలని, వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - 2020-09-20T08:04:46+05:30 IST