Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోశయ్య స్మృతుల్లో......

సీఎం హోదాలో శ్రీకాళహస్తిలో రాజగోపుర నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న రోశయ్య(పాతచిత్రం) - రాజకీయ గురువులు ఎన్జీరంగా,రాజగోపాల నాయుడితో రోశయ్య - రోశయ్యకు శైలజానాథ్‌ తదితరుల నివాళి

రాజగోపాల నాయుడి వద్ద రాజకీయ పాఠాలు

శ్రీకాళహస్తి రాజగోపుర పునరుద్ధరణకు భూమిపూజ

మన్నవరం ప్రాజెక్టు భూసేకరణకు కృషి


 తిరుపతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు తొలినుంచీ మన జిల్లాతో ప్రత్యేక అనుబంధముంది.యువకుడిగా జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పాటూరి రాజగోపాలనాయుడు వద్దే శిక్షణ పొందారు.  స్వతంత్ర పార్టీ నేత ఎన్‌జీ రంగాతో కలసి రైతు సంక్షేమం కోసం పోరాడిన ఆయన వద్ద రోశయ్య రాజకీయ పాఠాలు చేర్చుకున్నారు. అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన తొలినాళ్ళలో రాజగోపాలనాయుడు తదితరులు ప్రజా సమస్యలపైన, రైతుల సమస్యలపైన లోతుగా విశ్లేషించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడాన్ని, సమస్యల పరిష్కారానికి చేసే ప్రతిపాదనలను శ్రద్ధగా విని ఎంతో నేర్చుకున్నానని వివిధ సందర్భాల్లో రోశయ్యే చెప్పారు.ముఖ్యమంత్రిగా పనిచేసింది స్వల్ప కాలమే అయినా జిల్లాకు సంబంధించిన కీలక ఘట్టాల్లో తనవంతు పాత్ర పోషించారు.2010 మే నెలలో శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో కృష్ణదేవరాయలు నిర్మించిన రాజగోపురం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో వ్యక్తిగతంగా ఎంతో వేదన చెందిన ఆయన అదే ఏడాది ఆగస్టులో రాజగోపుర పునరుద్ధరణకు భూమి పూజ చేశారు. శ్రీకాళహస్తి సమీపంలో మన్నవరం పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను శ్రద్ధ పెట్టి పూర్తి చేయించారు.  హంద్రీ-నీవా పథకానికి అనుబంధంగా మదనపల్లె పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు చేపట్టిన చిప్పిలి, గుట్టకిందపల్లి సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుల నిర్మాణాలకు రూ. 450 కోట్లు  మంజూరు చేశారు.చంద్రగిరి నుంచీ మంగాపురం వెళ్ళే మార్గంలో మిట్టపాలెం దగ్గర స్వర్ణముఖి నదిపై కాజ్‌ వే మంజూరు చేశారు.మురకంబట్టు వద్ద నీవా నదిపై పెద్ద బ్రిడ్జి మంజూరు చేసింది కూడా ఆయనే. పీలేరు పట్టణం మదనపల్లె మార్గంలో పింఛా ఏరుపై బ్రిడ్జి మంజూరు చేయడంతో పాటు పాకాల, చిన్నగొట్టిగల్లు, చంద్రగిరిల్లో ఆర్‌ అండ్‌ బీ అతిధి గృహాలు కూడా మంజూరు చేశారు. 


ప్రముఖుల సంతాపం

రోశయ్య మృతితో గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయామని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో రోశయ్య పార్ధివదేహానికి ఆయన నివాళులర్పించారు.రోశయ్య మృతిపట్ల మాజీ మంత్రి గల్లా అరుణకుమారి దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు.రాజకీయంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన ఆయన మంత్రివర్గంలో పనిచేసే అవకాశం తనకు దక్కిందన్నారు.నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు మారుపేరుగా నిలిచిన  రోశయ్య మరణం కాంగ్రెస్‌ పార్టీకి పూడ్చలేని లోటని కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్‌ సంతాపం వ్యక్తం చేశారు. పెద్దదిక్కును కోల్పోయామని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ అభిప్రాయపడ్డారు.శనివారం తిరుపతి పర్యటనలో వున్న ఆయన రోశయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఆప్తుడైన రోశయ్య మృతి పట్ల మాజీ ఎమ్మెల్సీ కందేరి జయచంద్రనాయుడు దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రోశయ్యను కౌన్సిల్‌ సమావేశాలకు ఇంటి వద్దకు వెళ్లి తీసుకు రావడం తనకో తీపిగుర్తన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి రోశయ్య సమస్యలను పరిష్కరించే తీరు అందరూ నేర్చుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అభిప్రాయపడ్డారు. ఓ సారి తన కాలుకు దెబ్బతగిలితే ఫోను చేసి పరామర్శించారన్నారు. రోశయ్య మరణం తెలుగురాష్ట్రాలకు తీరనిలోటని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అభిప్రాయపడ్డారు. 

Advertisement
Advertisement