ఆలోపు.. సగం సర్దేశారు!

ABN , First Publish Date - 2022-07-27T05:05:26+05:30 IST

అంతా అనుకున్నట్లే అయింది. ఇంటిదొంగలకు అధికారులు ‘అవకాశం’ ఇచ్చారు. అక్రమార్కులు దీన్ని సద్వినియోగం చేసుకున్నారు. బయటికెళ్లిన సరుకులో సగం సర్దేశారు. గుట్టుచప్పుడు కాకుండా పని కానిచ్చేశారు.

ఆలోపు.. సగం సర్దేశారు!
ఎస్‌.కోట ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను సీజ్‌ చేయిస్తున్న పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ మీనాకుమారి


ఎస్‌.కోట ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో 736 బస్తాల బియ్యం లేనట్లు నిర్ధారణ
35బస్తాల కందిపప్పు, 112 కేజీల పామాయిల్‌ తక్కువ ఉన్నట్లు గుర్తింపు
ఈ సరుకుల విలువ రూ.16.37 లక్షలుగా తేల్చిన అధికారులు

అంతా అనుకున్నట్లే అయింది. ఇంటిదొంగలకు అధికారులు ‘అవకాశం’ ఇచ్చారు. అక్రమార్కులు దీన్ని సద్వినియోగం చేసుకున్నారు. బయటికెళ్లిన సరుకులో సగం సర్దేశారు. గుట్టుచప్పుడు కాకుండా పని కానిచ్చేశారు. ఆ తర్వాత పౌరసఫరాలశాఖ అధికారులు తనిఖీలకు వెళ్లారు. 736 బస్తాల బియ్యం, 35బస్తాల కందిపప్పు, 112 కేజీల పామాయిల్‌ తక్కువ ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.16.37 లక్షలుగా తేల్చారు. అయితే ఇందుకు బాధ్యులెవరో ఇంకా తేల్చలేదు. ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెబుతున్నారు.

శృంగవరపుకోట, జూలై 26: ఎస్‌.కోట పౌరసరఫరాలశాఖ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో బియ్యం, కందిపప్పు, పామాయిల్‌ తక్కువగా ఉన్నట్లు అధికారులు నెల క్రితమే గుర్తించారు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచారు. సరుకులు బయటకు తరలించిన ఇంటి దొంగలకు నెలాఖరు వరకు అవకాశం ఇచ్చారు. ఆలోపే అక్రమార్కులు సగం సర్దేశారు. కొంతమంది డీలర్లు సహకరించడంతో బియ్యం, కంది పప్పును లబ్ధిదారుల నుంచి కొనేసి గోడౌన్‌కు చేర్చారు. ఈ వ్యవహారమంతా సోమవారం వెలుగులోకి వచ్చింది. దీంతో చేసేదేమీలేక పౌరసఫరాలశాఖ అధికారులు రాత్రిరాత్రి తనిఖీలు నిర్వహించారు. గోడౌన్‌ను సీజ్‌ చేశారు. గంట్యాడ మండల పౌరసరఫరాలశాఖ ఉప తహసీల్దార్‌ కె.ఇందిర సమక్షంలో పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌ మీనాకుమారి సరుకును లెక్కించారు. 5,462 బియ్యం బస్తాలకు గాను 4,726 బస్తాలు ఉన్నాయి. 736 బస్తాలు తక్కువ ఉన్నాయి. 234 కందిపప్పు బస్తాలకు 199 ఉన్నాయి. 35 బస్తాలు మాయం అయ్యాయి. అలాగే 1,786 కేజీల పామాయిల్‌ ప్యాకెట్లకు గాను 1674 ప్యాకెట్లు ఉన్నాయి. 112 ప్యాకెట్లు తక్కువ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే అధికారులు తనిఖీ చేసిన తర్వాత పామాయిల్‌ ప్యాకెట్లను కూడా పక్కదారి పట్టించినట్లు తెలిసింది. స్టాక్‌లో తేడా ఉన్న బియ్యం విలువ రూ.14,16,800, కందిపప్పు రూ.1,97,137, పామాయిల్‌ రూ.23,184 మెత్తం రూ.16,37.121గా లెక్క కట్టారు. గోదాంకు చేర్చిన సరుకు విలువ దీనికి చేర్చితే దాదాపు రూ. 35లక్షలకు పైబడి ఉంటుంది.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏదీ?
గోడౌన్‌లో నాలుగు నెలలకు సరిపడా సరుకు నిల్వ ఉంచుతారు. డీలర్లకు సరుకు అందించడం వరకే మండల స్థాయి పౌరసరఫరాల శాఖ చూస్తుంది. జిల్లా స్థాయి అధికారులు గోడౌన్‌లో రికార్డులో ఉన్న నిల్వలను తనిఖీలు సక్రమంగా చేయడంలేదు. ఇదే అక్రమార్కులకు కలిసి వస్తోంది. విషయం బయటకు పొక్కినప్పుడు మాత్రమే అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇక్కడి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జికి బదిలీ కావడంతో సరుకు లెక్కలు చూశారు. దీంతో భారీగా తక్కువగా ఉన్నట్లు బహిర్గతమైంది. ఈ ఘటనకు బాధ్యులెవరో అధికారులు ఇంకా తేల్చలేదు. ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

 ఈ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో ఐదేళ్ల క్రితం కూడా ఇదే స్థాయిలో సరుకు మాయం చేశారు. బయటకు పొక్కడంతో అప్పుడు కూడా పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తక్కువైన సరుకును తిరిగి పెట్టించారు. సీఎస్‌డీటీపై బదిలీ వేటు వేశారు.

 30 ఏళ్ల క్రితం కూడా సరుకుతో వచ్చిన నాలుగు లారీలను పక్కతోవ పట్టించి బ్లాక్‌లో విక్రయించడం అప్పట్లో పెద్ద సంచలనమైందని స్థానికులు చెబుతున్నారు.

కెమెరాలు ఏర్పాటు చేస్తాం
ఇలాంటివి పునరావృతం కాకుండా గోడౌన్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు పౌరసరఫరాలశాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు లేఖ రాశాం. జాయింట్‌ కలెక్టర్‌ సూచన మేరకు స్థానిక తహసీల్దార్‌ సమక్షంలో వేరొకరికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాం.
                 - మీనా కుమారి, జిల్లా మేనేజర్‌, పౌరసరఫరాల శాఖ


Updated Date - 2022-07-27T05:05:26+05:30 IST