రాజస్థాన్‌ను కుదిపేసిన దళిత విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-08-16T06:40:56+05:30 IST

ఉపాధ్యాయుని చేతిలో దళిత విద్యార్థి మృతి చెందిన సంఘటన రాజస్థాన్‌ను కుదిపేసింది. తన సామాజిక వర్గానికి ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నానన్న ఆవేదనతో పదవికి రాజీనామా చేస్తున్నట్టు..

రాజస్థాన్‌ను కుదిపేసిన దళిత విద్యార్థి మృతి

కుండలోని నీళ్లు తాగాడని చావగొట్టిన ఉపాధ్యాయుడు 


జైపూర్‌, ఆగస్టు 15: ఉపాధ్యాయుని చేతిలో దళిత విద్యార్థి మృతి చెందిన సంఘటన రాజస్థాన్‌ను కుదిపేసింది. తన సామాజిక వర్గానికి ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నానన్న ఆవేదనతో పదవికి రాజీనామా చేస్తున్నట్టు అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పనా చంద్‌ మేఘ్వాల్‌ ప్రకటించారు. ఆయన బరన్‌-ఆత్రూ (ఎస్సీ) నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్సీలపై అత్యాచారాలను ఆపలేకపోతున్నానని పేర్కొంటూ ముఖ్యమంత్రి గెహలోత్‌కు రాజీనామా పత్రాన్ని పంపించారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల సమయంలో ఇలాంటి దారుణాలు ఏమిటంటూ విమర్శలు వస్తున్నాయి. జాలోర్‌ జిల్లా సైలాలోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ఇంద్రకుమార్‌ మేఘవాల్‌ (9) అనే విద్యార్థి గత నెల 20న తరగతి గదిలో టీచర్‌ కోసం ఉంచిన కుండలోని నీటిని తాగాడు. దీనిపై ఉపాధ్యాయుడు చైల్‌ సింగ్‌(40) ఆగ్రహించి ఆ విద్యార్థిని తీవ్రంగా కొట్టాడు.


ముఖంపై కొట్టడంతో రక్తస్రావమైంది. కళ్లు, చెవులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ బాలుడిని తొలుత ఉదయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అహ్మదాబాద్‌లో ఉన్న ఆస్పత్రిలో చేర్చారు. ఇంద్రకుమార్‌ మొత్తంగా 25 రోజులపాటు చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయాడు. దాంతో పోలీసులు చైల్‌సింగ్‌ను అరెస్టు చేశారు. అతడిపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇంద్రకుమార్‌ కుటుంబానికి సీఎం అశోక్‌ గెహ్లోత్‌ రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లు దర్యాప్తు జరపనున్నాయి.

Updated Date - 2022-08-16T06:40:56+05:30 IST