స్వాతంత్య్ర ఉద్యమంలో... మదనపల్లె వీరులు

ABN , First Publish Date - 2022-08-12T04:50:44+05:30 IST

స్వాతంత్య్ర ఉద్యమంలో ఎంతోమంది మదనపల్లె మహనీయులు కీలకపాత్ర పోషించారు.

స్వాతంత్య్ర ఉద్యమంలో...  మదనపల్లె వీరులు
మదనపల్లెలోని స్వాత్రంత్య సమరయోధులు దొడ్డా సీతారామయ్య, నూతి రాధాక్రిష్ణయ్య, టి.ఎన్‌.అనసూయమ్మ, టీఎన్‌ శకుంతలమ్మ, షేక్‌మురాద్‌షా

మదనపల్లె, ఆగస్టు 11: స్వాతంత్య్ర ఉద్యమంలో ఎంతోమంది మదనపల్లె మహనీయులు కీలకపాత్ర పోషించారు. మహాత్మాగాంధీ, అల్లూరి సీతారామరాజు, సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ తదితర నేతల స్ఫూర్తితో క్విట్‌ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం, భూదానోద్యమాల్లో ఎక్కడికక్కడ పాల్గొని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి కొందరు జైలుకెళ్లగా మరికొందరు లాఠీదెబ్బలకు గురయ్యారు. ముఖ్యంగా వీరంతా ఉద్యమస్ఫూర్తి, సామాజిక స్పృహ, ప్రజాసేవా పరమావధిగా భావించారు. అలాగే నిరాండంబరులుగా జీవితాన్ని ప్రారంభించి చివరకు తమకంటూ ఏమీ లేకుండానే తనువు చాలించిన వారూ ఉన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇచ్చే ఐదు ఎకరాల భూమి, ఇంటి స్థలం కూడా తీసుకోని వారున్నారంటే అతిశయోక్తి కాదు. వీరిలో ప్రధానంగా దొడ్డా సీతారామయ్య, నూతిరాధాకృష్ణయ్య, టి.ఎన్‌.అనసూయమ్మల పేర్లు వినబడతాయి.


దొడ్డా సీతారామయ్య

కమ్యూనిస్టు యోథుడిగా పేరొందిన దొడ్డా సీతారామయ్య స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జైలుకెళ్లారు. కమ్యూనిస్టు యోథుడిగా పేరొందిన సీతారామయ్య మదనపల్లె నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నిరాడంబరులు, నిబద్ధత, అన్నింటికీ మించి నిజాయితీకి మారుపేరుగా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈయన నియోజకవర్గ పర్యటనకు వెళ్లినప్పుడు వామపక్ష పుస్తకాలు వెంట తీసుకెళ్తూ, తలదిండుగా వాడుకుంటూ బహుజనుల ఇళ్లల్లో భోజనం చేసి అక్కడే బసచేసేవారు. నిరాండంబర జీవితం గడిపిన సీతారామయ్య తనకంటూ ఏమీ మిగుల్చుకోకపోగా ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేశారు. చివరి రోజుల్లో అంగళ్లులో అర్‌ఎంపీగా వైద్యసేవలందిస్తూ కుటుంబాన్ని పోషించారు. ఈయన సతీమణి ఝాన్సీ లక్ష్మీభాయి. ప్రముఖ విద్యావేత్త, సామాజిక సేవకురాలు కూడా. ఈమెను అంతా ట్యూషన్‌ అక్కయ్యగా పిలిచేవారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తెఉన్నారు.


నూతి రాధాకృష్ణయ్య

మహాత్మాగాంధీ సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్న నూతి రాధాకృష్ణయ్య క్విట్‌ ఇండియా, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం గడిపారు. నిస్వార్థ, ప్రజాసేవకునిగా పేరొందిన రాఽధాకృష్ణయ్య వినోబాభావే చేపట్టిన భూదాన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. అలాగే క్విట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా మదనపల్లెలో బ్రిటీష్‌ జెండాలాగి లాఠీదెబ్బలు చవి చూశారు. రాధాకృష్ణయ్య పాల్గొన్న ఉద్యమాల్లో ఖాదీ ఉద్యమం కీలకమైంది. ఈ ఉద్యమమే ఆయనకు కీర్తిప్రతిష్టలు తెచ్చి పెట్టందని చెప్పవచ్చు. వీదేశీ వస్ర్తాలను బహిష్కరించి ఖాదీ వస్త్రాలనే ధరించాలని ఆయన పల్లెల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. అనంతరం అందరికీ అందుబాటులో ఉండేలా పట్టణంలో ఖాదీబాండాగార్‌ పేరుతో వస్త్ర దుకాణాన్ని ఏర్పాటు చేసి అప్పటి బి.టి.కళాశాల ప్రిన్సిపాల్‌ మార్గరెట్‌ కజిన్స్‌ చేతుల మీదుగా 1935లో ప్రారంభించారు. 1962లో కాంగ్రె్‌స పార్టీ తరపున మదనపల్లె నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. రాధాకృష్ణయ్యకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.


టి.ఎన్‌.ఆనసూయమ్మ

భూస్వామ్య కుటుంబానికి చెందిన టి.ఎన్‌.అనసూయమ్మ స్వాతంత్య్ర ఉద్యమంలో విరివిగా పాల్గొన్నారు. బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి జైలుకెళ్లారు. మద్రాసు క్వీన్‌మేరీ కళాశాలలో విద్యార్థినిగా ఉన్న సమయంలోనే క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో మూడునెలలు వేలూరులో కారాగార శిక్ష అనుభవించారు. అనంతరం తంబళ్లపల్లెకు చెందిన టీఎన్‌ రఘునాథరెడ్డితో 1943లో వివాహమైంది. పీసీసీ, ఏఐసీసీ సభ్యురాలిగా, ఎస్వీ యూనివర్సిటీ సెనేట్‌ మెంబర్‌గా 1960 నుంచి 13 ఏళ్లు పనిచేశారు. అనంతరం తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎన్నికయ్యారు.


టి.ఎన్‌.శకుంతలమ్మ

ఈమె మద్రాసులో ఇంటర్‌ చదివే రోజుల్లో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమంలో భాగంగా 1943లో మద్రాసు క్వీన్‌మేరీ కళాశాలలో చదివే రోజుల్లో సహచర విద్యార్థులను సంఘటితం చేసి ఎగ్మూర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు వద్ద పికెటింగ్‌ నిర్వహించారు. ఇందుకు గానూ వేలూరు జైల్లో 1943 ఫిబ్రవరిలో మూడు నెలలు జైలుశిక్ష అనుభవించారు. ఈమె టి.ఎన్‌.అనసూయమ్మకు స్వయానా అక్క.


షేక్‌ మురాద్‌షా 

స్థానిక దేవళంవీధికి చెందిన షేక్‌ మురాద్‌షా 1885లో జన్మించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. మరోవైపు రాజకీయంగా కాంగ్రె్‌స పార్టీలో కీలకపాత్ర పోషించారు.  స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొంటూనే కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన బీటీ కళాశాలలో విద్యార్థి నాయకుడిగా విద్యార్థులు, యువతను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మురాద్‌షా నాయకత్వంలో పనిచేశారు. బ్రిటీష్‌ పాలకులు మురాద్‌షాపై రెండుసార్లు షూట్‌ అట్‌ సైట్‌ ఆర్డర్స్‌ పాస్‌ చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడి కోటాలో 10 ఎకరాలు, రాజకీయ కోటాలో మరో పది ఎకరాలు ప్రభుత్వం భూమినిచ్చింది. ఈయన 1975వ సంవత్సరంలో చనిపోయారు. 


వి.అరుణాచలం గుప్తా

నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లెకు చెందిన విడుకుల అరుణాచలం గుప్తా స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా బ్రిటీష్‌ పాలకుల ఆగ్రహానికి గురయ్యారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా హిందూపురంలో బ్రిటీష్‌ పాలకులు విధించిన 144 సెక్షన్‌ను అతిక్రమించి, బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో 1938లో బెంగళూరులో 17 రోజుల పాటు జైలుజీవితం గడిపారు. అలాగే ఈయన స్నేహితుడైన నారాయణశెట్టి భార్య అక్కడిక్కడే బ్రిటీష్‌ తూటాకు బలయ్యారు. అలాగే ఎం.వి.పాపన్నగుప్తా, మార్గరేట్‌ ఖజిన్స్‌, ఓలేటి వెంకటక్రిష్ణయ్యశెట్టి, బీవీ నారాయణశెట్టి, చేబ్రోలు బాలగురునాథ గుప్తా, రాటకొండ నరసింహారెడ్డి, మదనపల్లె మండలం వలసపల్లెకు చెందిన కె.నరసింహారెడ్డి తదితరులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు.

Updated Date - 2022-08-12T04:50:44+05:30 IST