అడవిలో.. భయం భయం!

ABN , First Publish Date - 2022-05-07T06:23:21+05:30 IST

జిల్లాలోని అటవీ గ్రామాల్లో చిరుత పులులు, ఎలుగుబంట్లు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

అడవిలో.. భయం భయం!
ఎలుగుబంటి దాడిలో గాయపడిన శంకరయ్య

- జనాలు, పశువులపై ఎలుగుబంట్లు, చిరుతల దాడి

- జిల్లాలో ఏదో ఒకచోట చోటు చేసుకుంటున్న ఘటనలు

- తాజాగా లింగంపేటలో ఓ వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిన ఎలుగుబంటి

- వేసవిలో నీటి కోసం వచ్చి దాడి చేస్తున్న అడవి మృగాలు


కామారెడ్డి (ఆంధ్రజ్యోతి)/ నాగిరెడ్డిపేట, మే 6 : జిల్లాలోని అటవీ గ్రామాల్లో చిరుత పులులు, ఎలుగుబంట్లు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జీవనోపాధి కోసం తునికాకు సేకరణకు, పశువులను, మేకలను, గొర్రెలను పెంచుకుంటు వాటిని మేపడానికి వెళ్తున్నా, లేదంటే ఇంటి పరిసరాల్లో కట్టి ఉంచిన వాటిపై దాడులు చేసి చంపేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. చిరుతలు పశువులపై దాడులు చేస్తుంటే తరముదామని ప్రయత్నిస్తే మనుషులపై సైతం దాడులకు ప్రయత్నిస్తుండడంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోతున్నారు. అటవీశాఖ అధికారులు చిరుత పులులు అన్వేషణలో భాగంగా సీసీ కెమెరాలు అమర్చి వాటి ఉనికిని గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినా ఫలితం లేకుండా పోతోంది. చిరుతలు సంచరించే అటవీ గ్రామీణ ప్రాంతాల్లో బోనులను ఏర్పాటు చేసి పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం ఉండడం లేదు.  ప్రస్తుతం వేసవి కావడంతో అటవీ ప్రాంతాల్లో తునికాకు విరివిగా దొరుకుతుందని అటవీ ప్రాంతాలకు వెళ్తున్న వారిపై ఎలుగుబంట్లు సైతం దాడులు చేస్తు తీవ్రంగా గాయపరుస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే లింగంపేట మండలంలో తునికాకు కోసం వెళ్లిన ఇద్దరిని గాయపరచడంతో ప్రజలు జంకుతున్నారు.

తునికాకు కోసం వెళ్తున్న వారిపై ఎలుగుబంట్ల దాడులు

ప్రసుత్తం వేసవికాలం కావడంతో తునికాకు సేకరణ చేసి వాటిని అమ్మకం జరుపుకుందామని అటవీ ప్రాంతాలకు దగ్గరలోని గ్రామాల్లోని ప్రజలు అడవిలోకి వెళ్లి తునికాకు తెంపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వేసవిలో నీటికుంటల్లో నీరు ఇంకిపోవడంతో ఎలుగుబంట్లు దాహంతో అల్లాడుతూ నీటి కోసం వెతుకుంటూ జనావాసాలకు సమీపంగా వస్తున్నాయి. దీంతో అటవీ ప్రాంతాల్లోకి తునికాకు కోసం వస్తున్న వారు కనిపిస్తే చాలు వెంటపడి తరమడం, లేదంటే దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. గత వారం రోజుల కిందట లింగంపేట మండలంలో జల్లిపల్లి గ్రామానికి చెందిన రాజమణి తునికాకు కోసం వెళ్లగా ఆమెపై ఎలుగుబంటి దాడిచేసి తీవ్రంగా గాయపరుచడంతో నిజామాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం సైతం లింగంపేట్‌ మండలంలోని కోమటిపల్లికి చెందిన శంకరయ్య తునికాకు కోసం వెళ్లడంతో ఆయనను తీవ్రంగా గాయపరిచింది. తలకు, చేతులు, కాళ్లపై తీవ్రమైన గాయాలు కాగా తీవ్ర రక్తస్రావం అయింది. ఇలా ఎలుగుబంట్ల దాడిలో కొందరు గాయాలపాలవుతుంటే మరికొందరు వాటి భారీ నుంచి తప్పించుకుని ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

వణికిస్తున్న చిరుతలు

ఎలుగుబంట్లతో పాటు అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామస్థులను చిరుత పులులు వణికిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సంచరిస్తూ దాడులు చేస్తుండడంతో పొలాలకు వెళ్లాలంటేనే రైతులు భయపడుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. జిల్లాలో చిరుతపులుల దాడుల ఘటనలు అనేకం జరిగాయి. లింగంపేట మండలం శివారులో కొట్టంలో ఉన్న ఆవును చిరుత చంపివేసింది. అదేవిధంగా రామారెడ్డి మండలంలో ఇటీవల చిరుత సంచారంతో పొలాల్లోకి వెళ్లాలంటేనే రైతులు వణుకుతున్నారు. ఓ రైతుకు చెందిన పొలానికి సమీపంలో కుందేలుని చిరుత పులి చంపి తిన్న ఆనవాళ్లు, దాని అడుగుల గుర్తులు కనిపించడంతో భయాందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా నెలల వ్యవధిలోనే ఎల్లారెడ్డి మండలంలోని సోమర్‌పేట్‌ గ్రామంలో గొర్రెల, మేకల మందపై దాడి, తిమ్మారెడ్డి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో మేకలపై, హాజీపూర్‌ గ్రామంలో గేదెల మందపై, మేకల మందపై, కళ్యాణి గ్రామంలో లేగదూడపై, సోమర్యగడ్‌ తండాలో గేదెల మందపై దాడి చేసింది. వెల్లుట్ల గ్రామంలో మేకలపై దాడి చేసింది. నాగిరెడ్డిపేట మండలంలోని బంజారాతండా, లింగంపేట మండలాల్లో మేకలపై దాడి, బోనాల్‌తండాలో ఆవుపై దాడి చేసి చంపివేసింది. ఇవేకాక గత సంవత్సరం గాంధారి మండలంలోని తిప్పాపూర్‌, బుర్గుల్‌ గ్రామ శివారులో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. సదాశివనగర్‌ మండలంలోని తుక్కోజివాడిలో గొర్రెల మందపై దాడిచేసి గొర్రెలను హతమార్చింది.

ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోనే ఎక్కువ ఘటనలు

జిల్లాలో ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, సదాశివనగర్‌, రామారెడ్డి, మాచారెడ్డి, రాజంపేట, తాడ్వాయి తదితర మండలాల్లో దట్టమైన అడవులు ఉన్నాయి. ఓ మోస్తారు అడవి బాన్సువాడ, బిచ్కుంద, జుక్కల్‌, మద్నూర్‌ మండలాల్లో ఉంది. దట్టమైన అడవులు ఉన్న ప్రాంతాల్లో జనసంచారం పెరిగింది. ప్రధానంగా ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, రామారెడ్డి, రాజంపేటలోని కొన్ని గ్రామాల్లో, సదాశివనగర్‌ ప్రాంతాల్లో చిరుతల సంచారం ఎక్కువగా ఉన్నాయి. ఎలుగుబంట్లు సైతం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. చిరుతలు గ్రామాల్లోకి వచ్చి దాడులు చేస్తుంటే ఎలుగుబంట్లు అటవీ ప్రాంతాల్లోకి వచ్చిన వారిని గాయపరుస్తున్నాయి. అదేవిధంగా అటవీ ప్రాంతాలను ఆనుకుని అనేక గ్రామాలు తండాలు ఉండడం. కొత్తకొత్త తండాలు, గ్రామాలు వెలుస్తుండడంతో అడవుల్లో జన సంచారం ఎక్కువైంది. వాహనాల సంచారం సైతం పెరిగింది. దీంతో చిరుతలు ఆ ప్రాంతాల్లో ఉండేందుకు జంకుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో ఆహారం, నీరు దొరకకపోవడంతో చిరుతలు, ఎలుగుబంట్లు అడవిని దాటి జన సంచారం ఉన్న ప్రాంతాల్లోకి నీటి కోసం, ఆహారం కోసం వస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో స్థానికంగా ఉండే పశువులపై దాడులకు పాల్పడుతున్నాయి. అటవీ పరిసర గ్రామాల్లో ఆవులు, దూడలు, మేకల మందలపై దాడులు చేస్తూ ఆహారం కోసం వేటాడుతున్నాయని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.

Read more