తొలి విడతలో కిలోమీటరు పరిధిలో పాఠశాలలు విలీనం

ABN , First Publish Date - 2022-05-16T17:27:12+05:30 IST

తొలుత 250 మీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తామన్న విద్యాశాఖ.. దాన్ని కిలోమీటరు వరకు పెంచింది. ఉన్నత పాఠశాలలకు కిలోమీటరు పరిధిలో ఉన్న 9,770 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను విలీనం చేయనుంది...

తొలి విడతలో కిలోమీటరు పరిధిలో పాఠశాలలు విలీనం

తొలి విడతలో 9770 పాఠశాలలు విలీనం

కిలోమీటరు పరిధిలో వర్తింపు

తరగతి గదుల్లేకపోవడంతో మిగతా చోట్ల వాయిదా

త్వరలో 3 కిలోమీటర్ల పరిధిలో విలీనానికి రంగం సిద్ధం


(అమరావతి-ఆంధ్రజ్యోతి): తొలుత 250 మీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తామన్న విద్యాశాఖ.. దాన్ని కిలోమీటరు వరకు పెంచింది. ఉన్నత పాఠశాలలకు కిలోమీటరు పరిధిలో ఉన్న 9,770 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను విలీనం చేయనుంది. ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటి వరకు 1నుంచి 5తరగతులు ఉండగా.. వాటిలో 3, 4, 5 తరగతులు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం కానున్నాయి. దీంతో, ఆయా ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు ఇక నుంచి కిలోమీటరు దూరంలోని పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. వాస్తవానికి మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రాథమిక పాఠశాలలన్నింటినీ విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇలా అన్ని ప్రాథమిక పాఠశాలల్ని విలీనం చేసేందుకు అవసరమైన తరగతి గదులు ఉన్నత పాఠశాలల్లో లేవు. కొత్తగా చేపట్టిన తరగతి గదుల నిర్మాణం ఇప్పట్లో అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. నాడు-నేడు కింద కొత్త తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని భావించినా.. దానికీ నిధుల కొరత, నాబార్డు అప్పు ఆగిపోవడంతో అన్నిచోట్లా పనులు చేపట్టలేక కొన్ని పాఠశాలలకే పరిమితం చేశారు.


ఇలా అదనపు తరగతులు ఉన్నత పాఠశాలలు లేకపోవడంతో 3 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలల విలీనం ప్రక్రియను నిలిపివేశారు. దీనికి బదులుగా.. ఒక కిలోమీటరులోపు ప్రాథమిక పాఠశాలలకు వర్తింపచేయాలని విద్యాశాఖ తాజాగా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, మరో రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్ని కూడా సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతులు కట్టడం పూర్తికాగానే విలీనం చేయనున్నారు. ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల విలీనం వల్ల.. అనంతపురం జిల్లాలో 800, చిత్తూరు జిల్లాలో 920, తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1130, గుంటూరు జిల్లాలో 850, కృష్ణా జిల్లాలో 650, కర్నూలు జిల్లాలో 750, నెల్లూరు జిల్లాలో 800.. ఇలా ప్రతి జిల్లాలోను వందల కొద్దీ ప్రాథమిక పాఠశాలలు విలీనం కానున్నాయి. 


వీటిలోనూ అదనపు గదుల కొరత!

వాస్తవానికి ఒక కిలోమీటరు పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను విలీనం చేసేందుకు కూడా తగినన్ని అదనపు తరగతి గదులు ఉన్నత పాఠశాలల్లో లేవని సమాచారం. తొలుత 250 మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల విలీనమే అంటూ.. ఏడాది కిందట విలీన ప్రక్రియ చేపట్టినప్పుడు ఈ ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల చిన్నారులు సమీపంలోని ఉన్నత పాఠశాలకు వెళ్లినా.. అక్కడ వారు కూర్చోడానికి గదుల్లేవు. దీంతో చెట్లకింద, వరండాల్లో తరగతులు చెప్పారు. కొన్ని చోట్ల మళ్లీ ఆయా తరగతుల విద్యార్థులను ప్రాథమిక పాఠశాలలకే పంపారు. ఇప్పుడు మళ్లీ కిలోమీటరు వరకు ప్రాథమిక పాఠశాలల విలీనానికి ప్రభుత్వం సిద్దమైనా.. ఆ మేరకు అదనపు తరగతి గదులు ఉన్నాయా? అన్నది ప్రశ్నార్థకమే. 


ఉపాధ్యాయుల భర్తీ లేకుండా...

పాఠశాలల విలీనం వల్ల ప్రభుత్వం ఉపాధ్యాయుల భర్తీ చేయాల్సిన అవసరం లేదని భావిస్తోంది. ప్రాథమిక పాఠశాలల్ని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల వేల సంఖ్యలో ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉండదని అంచనా వేస్తోంది. అయితే ఉన్న ఉపాధ్యాయులపై భారం పెరగనుంది. ఇప్పుడు తీసుకుంటున్న తరగతులకు అదనపు తరగతులను ఉపాధ్యాయులు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వీరిపై పనిభారం పెరుగుతుంది. అదే సమయంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆశలు ఫలించేలా కనిపించడం లేదు. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు తల్లడిల్లుతున్నారు.

Updated Date - 2022-05-16T17:27:12+05:30 IST