కాంట్రాక్టర్లు కుదేలు

ABN , First Publish Date - 2020-07-12T09:35:33+05:30 IST

ఉపాధి హామీపథకం కింద తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018 ఏప్రిల్‌ నుంచి 2019 మే వరకు చేపట్టిన పనులకు

కాంట్రాక్టర్లు కుదేలు

టీడీపీ హయాంలో చేపట్టిన ఉపాధి పనులకు బిల్లులు చెల్లించని వైసీపీ ప్రభుత్వం

జిల్లాలో రూ. 240 కోట్లు పెండింగ్‌

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వైనం

బిల్లులు చెల్లించాలని ఆదేశం

మళ్లీ తనిఖీలంటూ మెలిక పెట్టిన సర్కార్‌

వివిధ శాఖల నిపుణులతో తనిఖీలు

తమను ఇబ్బందులకు గురిచేయడమేనని అధికారుల ఆవేదన

అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని కాంట్రాక్టర్ల గోడు


విశాఖపట్నం, జూలై 11 (ఆంధ్రజ్యోతి):- ఉపాధి హామీపథకం కింద తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018 ఏప్రిల్‌ నుంచి 2019 మే వరకు చేపట్టిన పనులకు బిల్లులు మంజూరు చేయకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్లు ఆర్థికంగా కుదేలయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన పనులకు నిరభ్యంతరంగా బిల్లులు మంజూరు చేస్తుండగా, అంతకుముందు చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా, తనిఖీల పేరుతో కాలయాపన చేయడం తగదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో రూ.240 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. 


ఉపాధి హామీ పథకం నిధులతో మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద పనులు చేయవచ్చని కేంద్రం అనుమతి ఇవ్వడంతో గత తెలుగుదేశం ప్రభుత్వం గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. రూ.5 లక్షల లోపు పనులకు టెండర్ల ప్రక్రియ కాకుండా నామినేషన్‌ విధానంలో చేసే అవకాశం వుండడంతో దానినే అమలుచేశారు. జిల్లాలో భారీగా సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు చేపట్టారు. ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు అవుతుండేవి. కానీ 2018-19 ఆర్థిక సంవత్సరంలో  చేపట్టిన పనుల్లో చాలా వాటికి బిల్లులు మంజూరు కాలేదు. రూ.10 లక్షలు... అంత కంటే ఎక్కువ విలువచేసే 897 పనులు చేయగా వీటికి రూ.172 కోట్లు ఖర్చు అయ్యింది. రూ.10 లక్షలలోపు విలువగల పనులకు.... మరో రూ.68 కోట్లు వెచ్చించారు. గ్రామస్థాయిలో ఉపాఽధి హామీ పథకం కమిటీల తీర్మానం మేరకు ఆయా పనులను ఎం.బుక్‌లో రికార్డు చేశారు. అయితే 2019 ఫిబ్రవరిలోనే ఎన్నికలకోడ్‌(ఉపాధ్యాయ ఎమ్మెల్సీ) అమలులోకి రావడంతో బిల్లుల మంజూరుకు అవరోధం ఏర్పడింది. కాగా నామినేషన్‌ విధానంలో పనులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో బిల్లులకు ఢోకా ఉండదన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు పనులు కొనసాగించారు. తరువాత సాధారణ ఎన్నికలు రావడంతో కోడ్‌ కొనసాగింది. ఎన్నికల తరువాత వైసీపీ ప్రభుత్వం రావడంతో అన్ని రకాల బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయి.


25 శాతం కంటే తక్కువ  చేసిన పనులను రద్దుచేస్తున్నట్టు ప్రకటించి ఆ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. 25 శాతం కంటే ఎక్కువ పూర్తయిన పనులను కొనసాగించుకోవచ్చునని ఆ ఉత్తర్వులలో పేర్కొంది. దీంతో కొందరు కాంట్రాక్టర్లు పనులు కొనసాగించారు. అయినప్పటికీ ఉపాధి హామీ పథకం చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులపై ఆది నుంచీ వైసీపీ ప్రభుత్వం సన్నాయినొక్కులు నొక్కుతూనే ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన ఉపాధి పనులకు బిల్లులు మంజూరీచేసిన ప్రభుత్వం... అంతకుముందు టీడీపీ హయాంలో 2018 ఏప్రిల్‌ నుంచి 2019 మే వరకు పూర్తిచేసిన పనులకు బిల్లులు ఇవ్వలేదు. దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పనులు చేసిన కాంట్రాక్టర్లు  అప్పుల పాలయ్యారు. చేసిన అప్పులకు వడ్డీలు కూడా తీర్చలేకపోతున్నారు. కాగా కొంతమంది కొందరు కాంట్రాక్టర్లు ఉపాధి పనుల బిల్లులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.


చేసిన పనులకు బిల్లులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కానీ ప్రభుత్వం మరో మెలిక పెట్టింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులతో తనిఖీలకు ఆదేశించింది. దీంతో 90 శాతం పనులను అధికారులు తనిఖీ చేశారు. దీనికితోడు ఆర్‌డబ్ల్యుఎస్‌, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ శాఖల ఇంజనీర్లతో కూడిన ఐదు బృందాలను నియమించారు. 2018 ఏప్రిల్‌ నుంచి 2019 మే వరకు చేపట్టిన పనులను పంచాయతీరాజ్‌ ఇంజనీర్లు తనిఖీచేసి ఎం.బుక్‌లో రికార్డుచేశారు. తరువాత ఇదే విభాగానికి చెందిన క్వాలిటీకంట్రోల్‌ బృందాలు తనిఖీలు చేపట్టి సంతృప్తివ్యక్తంచేశాయి. ఇంకా డ్వామా పరిధిలో మండలస్థాయి సోషల్‌ ఆడిట్‌ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఒకే పనికి అనేక మంది నిపుణులు తనిఖీ చేయడం వివాదాస్పదమైంది. తనిఖీల పేరిట తమను ఇబ్బందులకు గురిచేయడమేనని కొందరు ఇంజనీర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

Updated Date - 2020-07-12T09:35:33+05:30 IST