కార్పొరేట్ గుప్పిట్లో కర్షక శ్రేయస్సు

ABN , First Publish Date - 2020-11-24T05:36:29+05:30 IST

రైతులు తమ పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటూ కేంద్రప్రభుత్వం చేసిన స్వేచ్ఛా మార్కెట్ ప్రయోగం సేద్యానికి చేటు చేస్తుంది...

కార్పొరేట్ గుప్పిట్లో కర్షక శ్రేయస్సు

రైతులు తమ పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటూ కేంద్రప్రభుత్వం చేసిన స్వేచ్ఛా మార్కెట్ ప్రయోగం సేద్యానికి చేటు చేస్తుంది. ఈ మేరకు అమలులోకి తీసుకు వచ్చిన చట్టాల వల్ల కేంద్ర ప్రభుత్వం నమ్మబలుకుతున్నట్టు రైతు ఆదాయం రెట్టింపు అయ్యే మాట దేవుడెరుగు, వ్యాపారులు, దళారులు, కార్పొరేట్ల ఆదాయం మాత్రం పదింతలు పెరుగుతుంది. అన్ని వ్యవస్థలను ప్రైవేటీకరించి కార్పొరేట్ రంగానికి ధారాదత్తం చేసినట్లే, వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ రంగానికి ధారాదత్తం చేసేందుకు కేంద్రప్రభుత్వం ద్వారాలు తెరిచింది. మోదీ ఇటీవల చేసిన ప్రకటనలో రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేద్దాం అనీ, రైతులు ఏ ఆందోళనా లేకుండా గుండె మీద చేయి వేసుకొని నిద్రించే భారతాన్ని నిర్మిద్దాం అనీ దేశవాసులకు పిలుపునిచ్చారు. ఈ ప్రకటనలో ఇసుమంత నిజం ఉంటే ఇటువంటి నిరంకుశమైన చట్టాలను తీసుకువచ్చి అన్నదాతల వెన్ను విరిచేవారు కాదు. ప్రధాని మోదీ కీర్తిస్తున్నట్లు ఇవి విప్లవాత్మక చట్టాలు కావు, వినాశనకర చట్టాలు. హోంమంత్రి అమిత్ షా గొప్పలు చెప్పినట్లు ఇవి రైతులకు సిరులు కురిపించడం కాదు, వారికి ఉరులు బిగించనున్నాయి. 


ఈ చట్టాలు ఆమోదించిన తీరు కూడా దారుణం. సంబంధిత బిల్లులను ఆమోదించే ముందు రాజ్యసభ సెలక్టు కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల డిమాండును అంగీకరించకపోగా వాటిపై కనీస చర్చ కూడా లేకుండా చేసి నిరంకుశంగా వ్యవహరించారు. వ్యవసాయం రాష్ట్రాలకు సంబంధించిన అంశమైనప్పటికీ కనీసం వాటిని సంప్రదించకుండా చట్టాలు తేవడం సమాఖ్య వ్యవస్థకు విఘాతం. రైతు శ్రేయస్సు కోసం అంటూ కేంద్రప్రభుత్వం తెచ్చిన చట్టాల్లో ఒకటి-, రైతు తన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకొనే స్వేచ్ఛను, రెండోది వ్యాపారులతో చేసుకొనే ముందస్తు ఒప్పందాలకు చట్టబద్ధతను కల్పిస్తున్నాయి. మూడవది, నిత్యావసర వస్తువులైన చిరు, పప్పుధాన్యాలు, నూనెగింజలు నిల్వలపై ఆంక్షలను తొలగిస్తోంది. వీటి ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం నమ్మబలుకుతోంది. కానీ అది వాస్తవం అందుకు విరుద్ధం. మారుమూల గ్రామాల్లో ఉన్న సన్న చిన్నకారు రైతులు పంటను పక్క రాష్ట్రానికో, మరో నగరానికో తీసుకెళ్లి అమ్ముకోవడం సాధ్యమేనా? అంత స్తోమత, సామర్థ్యం, పరిజ్ఞానం వారికుంటుందా? ఒకవేళ పంటను మంచి ధర కోసం మరో రాష్ట్రానికో, నగరానికో తీసుకెళ్లినా ఎకరా రెండెకరాలున్న రైతు తన పంటను అంత దూరం తరలించినందుకు అయిన రవాణా ఖర్చులకు ఎవరు బాధ్యత వహిస్తారు? అక్కడి మార్కెట్ మాయాజాలంలో రైతుకు ఎవరు ఆసరాగా ఉంటారు? రవాణా ఖర్చులు కూడా రాకపోతే రైతు పరిస్థితి ఏమిటి?


మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేసి వ్యవసాయాన్ని కార్పొరేట్ల కబంధహస్తాలకు అప్పగించడమంటే రైతును బలపీఠం ఎక్కించడమే. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న కార్పొరేట్‌రంగాన్ని బాగు చెయ్యడానికే ఇదంతా. మార్కెట్‌యార్డుల కంటే కొంతమేర ఎక్కువ ధరకు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసినా నాణ్యతా లోపం, డిమాండ్‌ లేదన్న కుంటిసాకులు చూపి ధరలు తగ్గించేయడం ఖాయం. అదే జరిగితే రైతులకు కనీస మద్దతు ధర కూడా దక్కదు. వారు ప్రభుత్వ సంస్థలకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉండదు.


ఇక ధాన్యం, పప్పులు, నూనెగింజలు, వంటనూనెలు, బంగాళాదుంపల వంటి నిత్యావసరాల ‍సరుకులపై ఇప్పటివరకు ఉన్న ఆంక్షలను తొలగిస్తే బడా వ్యాపారులు, సంస్థలు పంట సీజనులో రైతుల నుంచి పెద్దఎత్తున తక్కువ ధరకు ఉత్పత్తులను కొనుగోలు చేసి వాటిని గోడౌన్‌లలో నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు తిరిగి అమ్ముకుంటారు. దీనిని నియంత్రించేందుకు ప్రభుత్వానికి ఆస్కారం లేకుండా పోతుంది. ప్రభుత్వ నియంత్రణలో ఉన్నప్పుడే ఆహారోత్పత్తుల లభ్యత ఇబ్బందైనప్పుడు, నిల్వలపై ఆంక్షలు ఎత్తి వేస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుంది? 


డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన కమలనాథులు వాటిని గాలికి వదిలేసి సాధ్యం కాని, ఉపయోగం లేని చట్టాలతో రైతాంగం వెన్ను విరుస్తున్నారు. రైతుని వ్యవసాయానికి దూరం చేసే ఈ దుర్విధానాలతో ఆహార భద్రత, రైతు భద్రత గాలిలో దీపం కానుంది. నిజంగా కేంద్రప్రభుత్వానికి రైతుల మీద ఆపేక్ష ఉంటే వారికి గిట్టుబాటు ధర కల్పిస్తే చాలు. రైతులు ఏళ్ల తరబడిగా కోరుతున్నది అదే. అది ఇచ్చి, వారి పంటను కొని, ఆ సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తే ఎంతో సంతోషిస్తారు. 

సుంకర పద్మశ్రీ

ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యురాలు

Updated Date - 2020-11-24T05:36:29+05:30 IST