వివేకా కేసులో..కీలక మలుపు!

ABN , First Publish Date - 2021-07-24T07:26:49+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది

వివేకా కేసులో..కీలక మలుపు!

ముఖ్యమైన వివరాలు చెప్పిన వాచ్‌మన్‌?

జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌ వద్ద వాంగ్మూలం

నిరుడు మార్చి 14 రాత్రి వివేకా ఇంటికి కొత్త వ్యక్తులు?

హత్యలో ఇద్దరు ప్రముఖుల హస్తం!

ఢిల్లీ నుంచి పులివెందుల దాకా ఇదే చర్చ

కీలక సమయంలో డీఐజీ సుధాసింగ్‌ బదిలీపై అనుమానాలు


కడప/న్యూఢిల్లీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. పులివెందులలోని ఆయన ఇంటి వాచ్‌మన్‌ రంగయ్య శుక్రవారం కడప జిల్లా జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఆయన కీలక వివరాలు తెలియజేసినట్లు తెలిసింది. ఈ హత్యలో ఇద్దరు ప్రముఖులు సహా మొత్తం తొమ్మిది మంది ప్రమేయం ఉందని వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది. 2019 మార్చి 14 అర్ధరాత్రి వివేకా తన ఇంట్లోనే అత్యంత దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ రోజు రాత్రి ఇంటికి ఐదుగురు కొత్తవ్యక్తులు వచ్చారని రంగన్న చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దీనిని సీబీఐ అధికారులు, పోలీసులు రధువీకరించడం లేదు.  


3 సిట్‌లు వేసినా..

కాగా.. వివేకా హత్య కేసు నిగ్గు తేల్చేందుకు నాటి చంద్రబాబు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జగన్‌ ప్రభుత్వం వచ్చి మరో రెండు సిట్‌లు వేసింది. నెలలు గడిచినా దర్యాప్తులో పురోగతి లేదని, దీనిపై పలు అనుమానాలు ఉన్నాయని, సీబీఐకి అప్పగించాలని వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించడం, గతేడాది మార్చి 11న ఈ కేసు దర్యాప్తు ను సీబీఐకి ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో 2020 జూలై 18న సీబీఐ రంగంలో దిగింది. అయితే కరోనా విజృంభణతో విచారణకు బ్రేక్‌ పడింది. ఈ ఏడాది జూన్‌ 6 నుంచి డీఐజీ సుధాసింగ్‌ నేతృత్వంలో సీబీఐ బృందం కడప సెంట్రల్‌ జైల్‌ గెస్ట్‌హౌస్‌లో రెండో విడత విచారణ చేపట్టింది. పలు దఫాలు దాదాపు 35-40 మందిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వీరిలో వాచ్‌మన్‌ రంగయ్యతో పాటు వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయతుల్లా, మాజీ డ్రైవర్‌ దస్తగిరి, పులివెందుల కు చెందిన వైసీపీ కార్యకర్త కిరణ్‌కుమార్‌ యాదవ్‌, ఈయన సోదరుడు సునీల్‌కుమార్‌యాదవ్‌, తల్లిదండ్రులు కృష్ణయ్య, సావిత్రి, సోదరి నందిని, మైనింగ్‌ వ్యాపారి గువ్వల గంగాధర్‌, కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి యజమాని లక్ష్మిరెడ్డి తదితరు లు ఉన్నారు.  హత్యకు గురైన వివేకా ఇంటిని, పరిసరాలను దర్యాప్తు బృందాలు పలుమార్లు పరిశీలించి.. కీలక సమాచారం సేకరించాయని సమాచారం.


అబ్బే.. సాధారణ బదిలీయే!

వివేకా హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండగా.. దాని పర్యవేక్షకాధికారిణి, డీఐజీ సుఽధాసింగ్‌ను బదిలీ చేయ డం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆమెను మార్చి ఆ స్థానం లో ఎస్పీ ర్యాంకు సీబీఐ అధికారి రాంకుమార్‌ను నియమించడంపై పలు ఆరోపణలు రావడంతో వాటిని ఢిల్లీలోని సీబీఐ వర్గాలు తోసిపుచ్చాయి. సాధారణ బదిలీల్లో భాగంగానే సుధాసింగ్‌ బదిలీ జరిగిందని తెలిపాయి. ఇప్పటివరకూ ఈ కేసులో అరెస్టులేమీ లేవని, శుక్రవారం వివేకా ఇంటి వాచ్‌మన్‌ రంగయ్యను విచారించడం కూడా విచారణలో భాగమని, ప్రత్యేకత ఏమీ లేదని పేర్కొన్నాయి. కానీ రంగయ్యను విచారిస్తున్నప్పుడు సుధాసింగ్‌ అక్కడ లేరని, ఆమెకు కూడా బదిలీ సమాచారం చివరివరకూ తెలియదని తమకు తెలిసిందని వివేకా బంధువొకరు వెల్లడించారు. రాజకీయ ఒత్తిళ్లతో విచారణ మరింత ఆలస్యం కావచ్చని.. అయితే కొత్త అధికారి వచ్చి దర్యాప్తు జరిపే తీరు చూశాకే ఏ విషయమూ తెలుస్తుందని అన్నారు. మొత్తం విచారణను సుధాసింగ్‌ ఒక కొలిక్కి తెచ్చారని, అసలు నిందితులకు ఉచ్చు బిగించేలోపే ఆమె స్థానంలో కొత్త అధికారి రావడంతో కేసు వేగం తగ్గే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Updated Date - 2021-07-24T07:26:49+05:30 IST