తల్లీకూతుళ్ల హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

ABN , First Publish Date - 2021-12-06T05:35:33+05:30 IST

హత్యకు గురైన తల్లీకూతుళ్లు శ్రీదేవి, వెంకటలేఖన (ఫైల్‌)

తల్లీకూతుళ్ల హత్య కేసులో  దర్యాప్తు ముమ్మరం
హత్యకు గురైన తల్లీకూతుళ్లు శ్రీదేవి, వెంకటలేఖన (ఫైల్‌)

పోలీసుల అదుపులో అనుమానితులు

సాంకేతిక ఆధారాలపై దృష్టి

అనేక కోణాల్లో విచారణ

ఒంగోలు (క్రైం), డిసెంబరు 5 : టంగుటూరులో జరిగిన తల్లీకూతుళ్ల హత్య కేసు  దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటికే మహారాష్ట్రకు చెందిన నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దీన్ని నిర్ధారించుకునేందుకు అవసరమైన ఆధారాలపై దృష్టి సారించారు. సాంకేతకపరమైన అంశాలను సేకరించే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి. అదేసమయంలో ఇతరత్రా కోణాల్లోనూ విచారిస్తున్నారు. హత్య జరిగిన రోజు అక్కడి సెల్‌ఫోన్ల కాల్‌డేటా, టంగుటూరులోని ప్రధాన సెంటర్‌లలో ఉన్న సీపీ ఫుటేజీని సేకరిస్తున్నారు. డాగ్‌స్క్వాడ్‌ వెళ్లినమార్గం, ఇతరత్రా అంశాలపైనా ఆరా తీస్తున్నారు. నేరస్థలంలో దొరికిన బూటు గుర్తులను విశ్లేషిస్తున్నారు. దుండగులు ఎటువైపు నుంచి ఇంట్లోకి వచ్చారు, అక్కడ నుంచి ఎటు వెళ్లారు.. ఎక్కడైనా సీసీ కెమెరాలలో వారి ఆచూకీ దొరుకుతుందా అన్న విషయాలను శోధిస్తున్నారు. 


షోలాపూర్‌ వద్ద అదుపులోకి అనుమానితులు 

మహారాష్ట్రకు చెందిన దోపిడీ ముఠా టంగుటూరులో తల్లీకూతుళ్లను హత్య చేసినట్లు అనుమానించిన పోలీసులు దుండగుల్లోని ఒకరి సెల్‌ఫోన్‌ ట్రాకింగ్‌ ద్వారా వారు మళ్లీ సొంత రాష్ట్రానికి వెళ్తున్నట్లు గుర్తించారు. ఆ రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చారు. పార్శిల్‌ లారీలో వెళ్తున్న నలుగురు అనుమానితులను మహారాష్ట్ర పోలీసులు అక్కడి షోలాపూర్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఇక్కడి నుంచి బయల్దేరి వెళ్లిన రెండు ప్రత్యేక బృందాలు ఆదివారం ఉదయం వారిని విచారించాయి. ఆ నలుగురులో ఒకరు వినియోగించిన ఫోన్‌ నంబరు కాల్‌ డేటా ఆధారంగా వారు హత్యకు ముందు టంగుటూరులో ఉన్నట్లు గుర్తించారు. అదే ఫోన్‌ నంబరు కలిగిన వ్యక్తి శుక్రవారం రాత్రి 8.30 తరువాత టంగుటూరు నుంచి బయటకు వెళ్లాడు. ఈవిధంగా ప్రతి అంశాన్నీ విశ్లేషించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.  


పలుకోణాల్లో విచారణ

నరహంతక దొంగల ముఠా తల్లీకూతుళ్లను హత్య చేసి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆదిశగానే దర్యాప్తు కొనసాగిస్తూనే, ఇతరత్రా కోణాలపైనా దృష్టి సారించారు. హత్యకు గురైన తల్లీకూతుళ్ల కుటుంబ యజమాని అయిన బంగారం వ్యాపారి రవికిషోర్‌కు ఏమైనా వివాదాలు ఉన్నాయా? ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? అన్న విషయాలపై కూడా ఆరా తీస్తున్నారు. ఇంకా ఇతర అంశలేమైనా హత్యకు పురికొల్పాయా అన్నది కూడా పరిశీలన చేస్తున్నారు.

 

సీసీ ఫుటేజీ సేకరణ

టంగుటూరు సచివాలయం సమీపంలో ఉన్న దానితోపాటు, ఇతర ప్రధాన ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల తీసుకున్న దాన్ని పరిశీలిస్తున్నారు. అదేసమయంలో పోలీసు జాగిలం సంఘటనా స్థలం నుంచి కల్యాణ మండపం మీదుగా బుచ్చిరాజుపాలెంలో పాత వసతి గృహం వైపు వెళ్లింది. అక్కడి నుంచి రైల్వే స్టేషన్‌ సమీంలోని నీటి కుంట వద్దకు వెళ్లి ఆగింది. దీంతో ఆవైపు కూడా పోలీసులు దృష్టిసారించారు. సంఘటన జరిగిన రోజు ఆ ప్రాంతంలో కొత్త వ్యక్తుల కదలికలపై కూడా సమాచారం సేకరిస్తున్నారు. 


ప్రత్యక్షంగా ఎవరైనా చూశారా?

రవికిషోర్‌ ఇంట్లోకి దుండగులు వెళ్లడం కానీ, బయిటకు రావడం కానీ ఎవ్వరైనా చూశారా అనే అంశంపై ప్రధానంగా పోలీసులు దృష్టి సారించారు. పలువురిని విచారిస్తున్నారు. అలా ప్రత్యక్షంగా దుండగులను ఎవరైనా చూసి ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ మలికగర్గ్‌ కోరారు. అలాంటి వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు.  

Updated Date - 2021-12-06T05:35:33+05:30 IST