దుకాణాలున్నా.. వినియోగం సున్నా

ABN , First Publish Date - 2022-05-17T06:23:40+05:30 IST

పాడేరు నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్‌ రైతు బజార్‌ నిరుపయోగంగా ఉంది.

దుకాణాలున్నా.. వినియోగం సున్నా
స్టాల్స్‌ వద్ద పేరుకుపోయిన తుప్పలు


నిరుపయోగంగా పాడేరు ఎన్టీఆర్‌ రైతుబజార్‌

40 స్టాల్స్‌ నిర్మించినా 19 ఏళ్లుగా వినియోగంలో లేని వైనం

పశువుల సంచారం.. మందుబాబులకు అడ్డా..

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

పాడేరు నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్‌ రైతు బజార్‌ నిరుపయోగంగా ఉంది. ఇందులో 40 దుకాణాలు ఉన్నా వినియోగంలో లేకుండాపోయాయి. ఫలితంగా పశువులకు నిలయంగా, మందుబాబులకు అడ్డాగా మారింది. ఈ రైతుబజార్‌ను వినియోగంలోకి తీసుకురావాలన్న డిమాండ్‌ సర్వత్రా వినిపిస్తోంది.

పాడేరు పాతబస్టాండ్‌గా ఉన్న సుమారు అర ఎకరం స్థలం ఆక్రమణలకు గురికాకూడదనే ఉద్దేశంతోపాటు సంత రోజుల్లో దుకాణాలు వేసుకునేందుకు అనువుగా 2003లో రూ.5 లక్షల వ్యయంతో ఇక్కడ ఎన్టీఆర్‌ పేరిట రైతు బజార్‌ను నిర్మించారు. అప్పట్లో శుక్రవారం వారపు సంత రోజున  రైతులు, వర్తకులు దానిని వినియోగించారు. అయితే అందులో దుకాణాలు పెట్టడం వల్ల వినియోగదారులు రాక, తమకు బేరాలు ఉండటం లేదని రైతులు, వర్తకులు రైతు బజార్‌ను వినియోగించేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో రైతు బజార్‌ వినియోగానికి దూరమైంది. 2004 తరువాత నుంచి కాంగ్రెస్‌ పాలించిన పదేళ్లు రైతు బజార్‌ వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో పశువులకు నిలయంగా, మందుబాబులకు అడ్డాగా తయారైంది.  

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత మార్కెట్‌ కమిటీలను నియమించింది. 2015లో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన బొర్రా విజయరాణి రైతుబజార్‌ను వినియోగంలోకి తీసుకురావాలని సంకల్పించారు. అప్పటి ఐటీడీఏ పీవో హరినారాయణన్‌, సబ్‌కలెక్టర్‌ ప్రసన్నవెంకటేశ్‌ల సహకారంతో రైతు బజార్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేశారు. అప్పటి ఐటీడీఏ పీవో హరినారాయణన్‌ రూ.5 లక్షలు విడుదల చేశారు. 

ఆ నిధులతో 40 దుకాణాలకు పైకప్పు రేకులు వేశారు. అయినప్పటికీ వాటిని వినియోగంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయలేదు. ఆ తరువాత టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు కూడా రైతు బజార్‌ను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో రైతు నిరుపయోగంగా మారింది. పాడేరు జిల్లా కేంద్రమైన నేపథ్యంలోనైనా అధికారులు రైతుబజార్‌ను  వినియోగంలోకి తీసుకువస్తారని స్థానికులు ఆశిస్తున్నారు. 

వినియోగంలోకి రావాలంటే..

-ఐటీడీఏ పీవో, సబ్‌ కలెక్టర్‌ రైతుబజార్‌ వ్యవహారంపై దృష్టి సారించాలి.

-మార్కెటింగ్‌ శాఖ అధికారులు స్పందించి ఇతర శాఖల అధికారులతో సమన్వయంగా వ్యహరించాలి.

-సబ్‌కలెక్టర్‌ మార్కెటింగ్‌, రెవెన్యూ, వెలుగు, పోలీసు శాఖలతో చర్చించి రైతుబజార్‌ వినియోగానికి పక్కా ప్రణాళిక రూపొందించాలి. 

-వర్తకులు, రైతులు రైతుబజార్‌లోనే దుకాణాలు నిర్వహించుకునేలా చేయాలి. 

-మైదాన ప్రాంతంలో వలే కూరగాయలకు వేర్వేరుగా దుకాణాలను పెట్టాలి. 

-మహిళా సంఘాలతో దుకాణాలు, సూపర్‌బజార్‌ ఏర్పాటు చేయాలి.

-రైతుబజార్‌లో కొనుగోలు చేయడం వల్ల తమకు ప్రయోజనం ఉందని వినియోగదారులు భావించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. 

Updated Date - 2022-05-17T06:23:40+05:30 IST