మహాత్ముడూ మహాకవీ గాంధీ పట్ల శ్రీశ్రీ అభిప్రాయాల్లో

ABN , First Publish Date - 2020-12-21T06:58:54+05:30 IST

తెలుగులో వచన కవిత్వం అభ్యుదయ దృష్టికీ, మార్క్సిస్టు దృక్పథానికీ మారు పేరు కావడం వల్ల, గాంధీ సనాతనుడిగా అహింసావాదిగా...

మహాత్ముడూ మహాకవీ గాంధీ పట్ల శ్రీశ్రీ అభిప్రాయాల్లో

వచ్చిన మార్పుల్ని పునరవలోకిస్తే అభిమానించిన తొలిదశలో వ్యతిరేకించిన సందర్భాలనూ, వ్యతిరేకించిన రెండవ దశలో సానుకూలంగా స్పందించిన సందర్భాలనూ గమనించవచ్చు. శ్రీశ్రీలో గొప్ప నిజాయితీ ఉంది. అభిప్రాయాల మార్పును విస్పష్టంగా ప్రకటించాడు. పూర్వమున్న అభిప్రాయాన్ని మళ్లీ చెబుతూ దాన్ని మార్చుకున్నట్టు చెప్పాడు. ఎప్పుడూ ఎక్కడా నీళ్లు నమలలేదు.


తెలుగులో వచన కవిత్వం అభ్యుదయ దృష్టికీ, మార్క్సిస్టు దృక్పథానికీ మారు పేరు కావడం వల్ల, గాంధీ సనాతనుడిగా అహింసావాదిగా గుర్తింపబడడం వల్ల వచన కవులు గాంధీ గురించి మాట్లా డడం పరస్పర విరుద్ధాలైనట్లు భావించబడింది. 1930ల్లో అభ్యుదయ కవిత్వం ప్రారంభమైనప్పటికీ, గాంధీ భావ కవుల్నీ సంప్రదాయ కవుల్నీ ఆకర్షించినంతగా ఆధునిక కవుల్ని ఆకట్టుకోలేకపోవడం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అయితే ఇందుకు ఆధునిక యుగకర్తగా నీరాజనాలందు కున్న శ్రీశ్రీ మినహాయింపు కావడం ప్రత్యేకం. ఒక వైవిధ్యం. ఈ వైవిధ్యంలో శ్రీశ్రీ సమకాలీనత, విశాల తత్వం, బహిరంతర దృష్టీ, రాజకీయ ప్రాపంచికత ఉన్నాయి. శ్రీశ్రీ గాంధీ పట్ల చూసిన దృష్టిలో రెండు దశలు ఉన్నాయి. ఒకటి అభిమానించిన దశ. రెండవది వ్యతిరేకించిన దశ. రెండిటికీ విభజన రేఖ 1970లో శ్రీశ్రీ విప్లవ మార్గం తీసుకోవడం కావొచ్చు. 


ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే మహాప్రస్థాన గీతాల్లో ఒకటో రెండో మినహాయించి మిగిలినవన్నీ రాసిన తర్వాతే శ్రీశ్రీ గాంధీని తొలిసారి స్పృశించాడు. 1946లో రాసిన ‘గాంధీజీ’ అనే ఆ కవితలో- ‘‘బాంబుల వర్షాలు వెలిసిపోయాక/ బాకుల నాట్యాలు అలసిపోయాక గడ్డి పువ్వులు హేళనగా నవ్వుతాయి/ గాలి జాలిగా నిశ్వసి స్తుంది’’ అని హింసను వ్యతిరేకిస్తూ శ్రీశ్రీ గొప్ప ఆత్మవి శ్వాసం ప్రకటించాడు. గడ్డిపువ్వులు ‘హేళనగా’ నవ్వడం గాంధీయిజం తప్ప మరొకటి కాదు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే, ‘‘మనుష్యుడే నా సంగీతం/ మానవుడే నా సందేశం’’ - అని చెప్పుకున్న ‘మహాసంకల్పం’లో పసిపాప నవ్వు మృగ్యమైన ముఖంతో కించిద్విషాదం, కించిన్నిరాశ, కించిదసంతృప్తితో గగనపథం దిగి నిలిచిన స్వతంత్ర భారత పౌరుడి ప్రతిబింబానికి బింబం గాంధీయే! అతని యోగక్షేమాలకే పూచిపడి, అతని ముఖానికే మళ్లీ నవ్వును అతికించమన్నాడు శ్రీశ్రీ.


గాంధీ హత్య 1948 జనవరిలో జరిగితే అదే యేడు ఫిబ్రవరి ‘అభ్యుదయ’లో వచ్చిన సుప్తాస్థికలు అనే రేడియో గేయ నాటికలో ఈ సందర్భాన్ని శ్మశానవాటిలో ధరా గర్భంలో నిదురిస్తున్న అస్థికల స్థాయి నుంచి అంతర్జా తీయ స్థాయి మీదుగా అంతరిక్ష స్థాయి ఘటనగా ఉన్నతీ కరించాడు శ్రీశ్రీ. భౌతిక శరీరం అగ్నికాహుతైనా నశ్వరం కాని అతని ఆత్మ ఆకాశాలను ఆక్రమించడాన్ని చూపిస్తూ: 


‘‘అతడు సామాన్య వ్యక్తి

అత డసామాన్య వ్యక్తి

తృణం కన్న తేలిక

మేరువు కన్నా ధీరుడు


అతడిప్పుడు లేడు

అత డెప్పుడూ ఉన్నాడు’’ అంటాడు. అది మహాత్ముడి గురించి ఒక్క మహాకవి మాత్రమే రాయగలిగిన profile. ఒక మహా అక్షర చిత్రకారుడు మాత్రమే గీయ గలిగిన portrait. ఈ నాటికలో గాంధీ మీద పేలిన తూటాల శబ్దంతో నక్షత్ర మండలంలో రెండు తారలు మేల్కొంటాయి. ఒకటి అక్కా, రెండోది తమ్ముడూ. హింసకూ అహింసకూ అనాదిగా యుద్ధం జరుగుతోందనీ అదిప్పుడు నాలుగు తూటాలకూ ‘హే రాం హే రాం’ అనే నాలుగు అక్షరాలకూ మధ్య యుద్ధంగా పరిణమించిందని అక్క అన్నప్పుడు ‘అక్కా నిద్దరొస్తుందే’ అంటాడు తమ్ముడు. ‘నీకెలా నిద్దరపడుతోందిరా తమ్ముడూ’ అని అక్క అనడంతో నాటిక ముగుస్తుంది. గాంధీ మరణంతో ఏర్పడిన ఒక మహా అశాంతిని, అనిశ్చితిని, అగమ్యాన్ని, అయోమయాన్ని ముగింపు వాక్యంలో ధ్వనింప చేయడం ఆ దశలో శ్రీశ్రీ గాంధీ జీవితం, సిద్ధాంతాల పట్ల గొప్ప గౌరవాన్ని కలిగి ఉండడమే!


1948 ఆగస్టు 20 తెలుగు స్వతంత్రలో ప్రచురితమైన ‘ఓ మహాత్మా’ గేయం గాంధీ మరణించిన తొలి స్వతంత్ర దినం నాటికి తనలో ఏర్పడిన ఒక శూన్యంలోంచి రాశాడా అనిపిస్తుంది. స్వాతంత్య్రం సిద్ధించినపుడు జరిగిన దేశవిభజన, హింస, రక్తపాతం సృష్టించిన ప్రశ్నల్ని సార్వజనీనమైనవిగా సార్వకాలికమైనవిగా మార్చి ఒక గొప్ప దుఃఖంలో నుంచి ఆవేశంలో నుంచి ఒక మహా తాత్విక జిజ్ఞాసలో నుంచి అన్వేషణలో నుంచి మహాత్ముడి మీదకు సంధించాడు. నిస్సందే హంగా ఇది శ్రీశ్రీ ఉపనిషత్తు. ప్రశ్నలే గాని జవాబులు లేని చర్చ: 


‘‘ఏది చీకటి, ఏది వెలుతురు

ఏది జీవిత, మేది మృత్యువు

ఏది సత్యం, ఏద సత్యం

ఏది ఏకం, ఏద నేకం

ఏ దహింస, ఏది హింస

ఏది మంచి, ఏది చెడుగు’’ - అంటూ పరంపరగా కురిపించినవి ప్రశ్నలా, లేక కలవరింతలా? అనీ, శ్రీశ్రీ ఇవి రా స్తున్నప్పుడు స్పృహ లో ఉన్నాడా, లేక అధోచేతనలో నుంచి పలవరించాడా? అనీ సంశయం కలుగుతుంది. అసలు విషయం ఈ ప్రశ్నలు వేయడానికి గాంధీని ఎన్నుకోవడం. సమకాలీన ప్రపం చంలో గాంధీ వినా వేరె వ్వరూ శ్రీశ్రీకి కనిపించక పోవడం లేదా లేకపో వడం. గాంధీ కేవలం ఆలోచనా శీలే కాక ప్రయోగశీలి, ఆచరణశీలి కావడం. 


ఈ కవితలో శ్రీశ్రీ ద్వంద్వాల నడుమ నిలబడిన ఒక ఆదిమ తత్వవేత్తలా దర్శనమిస్తాడు.

1969లో గాంధీ శతజయంతి సందర్భంగా రాసిన ‘సౌమ్యవాది మేనిఫెస్టో’ కవితలో ఆయన పట్ల: 

‘‘నేతృత్వ దరిద్రమైన

నీ జాతిని చూశావా

దేశం ఏమౌతుందో

చూశావా గాంధీజీ’’ - అనీ, 

‘‘వివినిపిస్తా నీవొసగిన

సామరస్య సందేశం

సకల భారతీయ జనత

ఒకటేనని ప్రకటిస్తా’’ - అనీ సాత్విక దృక్పథమే ప్రద ర్శించాడు. 


ఇక రెండవది గాంధీనీ ఆయన అహింసనీ వ్యతిరేకిం చిన దశ. విరసం ఆవిర్భావంతో మొదలైన ఈ దశలో రాసిన మొదటి కవిత 1971లో వచ్చిన ‘ఎవరిది అహింస?’ పోలీసు కాల్పుల్లో మరణించిన వెంపటాపు సత్యం, చాగంటి భాస్కరరావులను స్మరిస్తూ రాసిందిది: 


‘‘అవును సత్యం తలకాయ దొర్లింది

భాస్కరుడి తలకాయ దొర్లింది

ఇదే హింస

నక్సలైట్లు ఛేదిస్తున్నారు గాంధీ

విగ్రహాల శిరస్సులను

ఇదే అహింస

సత్యానికి చావు లేదు

భాస్కరుడు బతికే ఉంటాడు’’. 

పోలీసులు సత్యాన్నీ భాస్కరుణ్ణీ చంపడమే అసలైన హింస అనీ, నక్సలైట్లు అహింసకు ప్రతినిధి అయిన గాంధీ విగ్రహాల శిరస్సులను పడగొట్టడం ద్వారా అహిం సను అంతమొందిస్తున్నారనీ, అహింసని అంతమొందిం చడం అహింసేననీ, అట్లా అహింసని అంతమొందించే విప్లవకారుల్ని కాల్చి చంపడమే హింస అనీ అన్నాడు. ఇక్కడ సత్యాన్ని శ్లేషించడం గాంధీని గుర్తుకు తేవడమే. మరో సందర్భంలో శ్రీశ్రీ ‘గాంధీకి దైవమే సత్యం. కానీ నా దృష్టిలో సత్యమే దైవం. దైవాన్ని అడ్డుపెట్టుకుని అస త్యాన్ని సత్యంగా చూపకూడదు’ అన్న మాటల్ని గుర్తుకు తెచ్చుకోవడం అసందర్భం కాదు. శ్రీశ్రీ ఎట్లా గమనించ లేకపోయాడోగానీ దైవమే సత్యం అనుకుంటూ సత్యంతో ప్రయోగాలు జరిపిన గాంధీ కూడా చివరికి సత్యమే దైవం అన్నాడు. ఏమైనా సత్యానికి చావులేదు అనే శ్రీశ్రీ పంక్తి ఒక సత్యం. బహుశ అది సాపేక్షం.


ఈ రెండు దశలూ కవిత్వంలో ఇట్లా ప్రతిఫలించడం ఒక అంశమైతే ఇవే కోణాలు వచనంలో ముఖ్యంగా వ్యాసాల్లో, ఆత్మకథ ‘అనంతం’లో, లేఖల్లో, ప్రశ్నలూ జవాబుల్లో ఇంతే బలంగా ప్రతిఫలించాయి. అయితే విరసంలో చేరడానికి కొద్దిముందు అంటే 1969లో గాంధీ అనుకూల కవిత రాసిన శ్రీశ్రీ యే ఒక ప్రశ్నకు జవాబుగా ‘‘గాంధీజీ సిద్ధాంతాలు మనల్ని వెన్నె ముక లేని జంతువులుగా తయారు చేశా’’ యని అన్నాడు. అదే సంవ త్సరం దిగబరకవులతో ముఖాముఖిలో ‘‘గాంధీ అనే ఫాక్ట్‌ మిత్‌గా మా రిపోతుం’’దని అంటూ నే ‘‘గాంధీని అతని పరిస్థితుల్నించి చూస్తే విప్లవవాదే’’ననీ అన్నా డు. గాంధీ ప్రజల మని షేననీ దేశాన్ని ఏకం చేశా డని కూడా అన్నాడు.


1970లో ‘Credo’ అనే శీర్షికతో రాసిన: ‘‘కమ్యూనిజం మా అమ్మ

గాంధీయిజం మా నాన్న

ఈ రెండిటికీ పుట్టిన

ఔరస పుత్రుణ్ణి నేను,’’ అన్న మాటల్లో కమ్యూనిజంలో ఉన్న విదేశీయత గాంధీయి జంలో ఉన్న దేశీయత, మొదటి దాన్లో ఉన్న హింస రెండవ దాన్లోని అహింసల మధ్య ఒక తులనాత్మకత గురించి ఆలోచించాడా అనిపిస్తుంది. లేకపోతే ఒక్కసా రిగా గాంధీని వ్యతిరేకించి కమ్యూనిజాన్ని ఆహ్వానించలేక పోయాడా అని పిస్తుంది. పై రెండు అంశాలూ మారు తున్న శ్రీశ్రీని ప్రతిబింబిస్తున్నాయనుకోవాలి.


వచనంలో రెండు కోణాలూ ప్రతిఫలించడం గురించి చూస్తే అభిమానించిన దశలో గురజాడ ఆడంబరాల ఛందస్సును వదిలి ముత్యాలసరాన్ని చేపట్టడం జాతీయ జీవితంలో గాంధీ మహాత్ముడు అన్ని రకాల దుస్తులూ వదిలేసి అంగవస్త్రం ధరించడం లాంటిది అని అనడంలో ఇద్దర్నీ ప్రజాస్వామ్య ప్రతినిధులుగా చూశాడని స్పష్ట మైంది. గాంధీ పట్ల అనుకూల వైఖరి కల్గిన ఈ దశ లోనే తీవ్రంగా వ్యతిరేకించిన సందర్భం ఒకటి ఉంది. 1956లో విశాలాంధ్రకు ఇచ్చిన 50 ప్రశ్నలూ 50 జవా బులూలో కమ్యూనిస్టులెవరూ అనే ప్రశ్నకి గాంధీజీ వారసులనీ, ఎంచేత అనే ఉప ప్రశ్నకి గాంధీజీ బోధిం చిన బలవంతుల అహింసను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తు న్నారు అనీ, యూ బ్లడీ కమ్యూనిస్ట్‌ అని ‘తిడితే’ థాంక్యూ అనీ అన్నాడు.


ఇక రెండవ దశకు వస్తే అనేక సందర్భాల్లో గాంధీ పట్ల తన అభిప్రాయం మారిందని కుండ బద్దలు కొట్టాడు. 1975లో ‘‘ఒకప్పుడు నేను గాంధీని మహాత్ము డిగా విశ్వసించాను. ఆయన చచ్చిపొతే ఒక రేడియో నాటిక రాశాను. ఇప్పుడు నా అభిప్రాయం మారింది. మార్పులు తప్పవు’’ అన్నాడు. మిరియాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ‘‘గాంధీ గారిని జ్ఞాపకం చేసి నా మనసుని కలత పెట్టకండి. I want to forget him.’’ అని అన్నాడు. ‘అనంతం’లో తన నాస్తి కత్వం గురించి రాస్తూ ఆయుధాలు లేకుండా పోరాటం చెయ్యవచ్చునని రుజువు చేసిన గాంధీజీని గౌరవిస్తాను కానీ తన ఉద్యమానికి దేవుడి ఆశీర్వాదం ఉందనే ఆయన నమ్మకాన్ని నమ్మను. ఆయన నిరీశ్వరవాది అయి ఉంటే ఇన్ని కోట్లమందికి నాయకత్వం వహించగలగడం అసా ధ్యమై ఉండేది. అని అన్నాడు. ఇది 1976 నాటి మాట. అట్లాగే 1988లో చికాగో మిత్రుల గోష్టిలో చరిత్రలో నాన్‌ వయొలెంట్‌ రెవల్యూషన్‌ ఎప్పుడూ ఎక్కడా వచ్చినట్లు నాకు కనపడలేదు అంటూ గాంధీ ఒక్క రక్తపు బొట్టు చిందించకుండా స్వాతంత్య్రం తెచ్చాడనడం సరికాదంటూ విభజన సమయంలో ఎంతో రక్తపాతం, జనక్షయం జరిగిందన్నాడు. 1982లో గాంధీ, జయప్రకాశ్‌ల గురించి అడిగిన ప్రశ్నకి ‘‘నాకు ఇద్దరి మీదా సదభిప్రాయం లేదు. ఇద్దరూ కమ్యూనిజానికి వ్యతిరేకులే. ఇద్దరి పేర్లూ నేను గొప్పవాళ్లనుకునే వారి జాబితా నుంచి తొలగిస్తున్నాను.’’ అని జవాబిచ్చాడు. ఇది మరణించడానికి ముందు సంవత్సరం అన్న మాట. అయితే 1971లో విరసం అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే గాంధీ పట్ల అపార గౌరవంతో ప్రసిద్ధ జర్నలిస్టు యం. చలపతిరావు రాసిన గ్రంథం నుంచి చిన్న భాగాన్ని అనువదించాడు.


గాంధీ పట్ల శ్రీశ్రీ అభిప్రాయాల్లో వచ్చిన మార్పుల్ని పునరవలోకిస్తే అభిమానించిన తొలిదశలో వ్యతిరేకించిన సందర్భాలనూ, వ్యతిరేకించిన రెండవ దశలో సానుకూ లంగా స్పందించిన సందర్భాలనూ గమనించవచ్చు. శ్రీశ్రీలో గొప్ప నిజాయితీ ఉంది. అభిప్రాయాల మార్పును విస్ప ష్టంగా ప్రకటించాడు. పూర్వమున్న అభిప్రాయాన్ని మళ్లీ చెబుతూ దాన్ని మార్చుకున్నట్టు చెప్పాడు. ఎప్పుడూ ఎక్కడా నీళ్లు నమలలేదు. ఈ వైనాన్ని విశ్వనాథ విష యంలో కూడా చూడవచ్చు. తొలిదశలో ఆయన ప్రభావం తనమీద ఉండేదని ఆయన్ని వ్యతిరేకించి దూషణ భూషణ లకు దిగింతర్వాత కూడా చెప్పాడు. అయితే గాంధీ విష యంలో అంతకు మించి ఏదో వినమ్రతని ప్రదర్శించి నట్లనిపిస్తుంది. నచ్చనివారిపట్లా సాధారణంగా వ్యంగ్యంతో విరుచుకు పడే శ్రీశ్రీ, గాంధీనెప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదు. ఆయన్ని ప్రస్తావించిన ప్రతీసారి గాంధీజీ అనో, గాంధీ గారు అనో, మహాత్ముడనో సంభావించాడు. విప్లవమార్గం పట్టిన తర్వాత మారిన మనసును చెప్పిన ‘ఓ మహాత్మా ఓ మహర్షీ’ కవిత చెప్పిన టోన్‌ను గమ నిస్తే కనీసం ఎదురుగా కూడా కాదు, ప్రక్కనే కూచుని నచ్చచెప్పినట్టనిపిస్తుంది. కమ్యూనిజానికీ గాంధీయిజానికి పుట్టిన బిడ్డనని చెప్పడం ఏ దశలో చెప్పినా అది ఆపు కోలేని హృదయావిష్కరణే! ఇంత గమనించిన తర్వాత ఒక సదసత్సంశయం మిగులుతుంది. గాంధీని శ్రీశ్రీ అభిమా నించినప్పటి వ్యతిరేకత, వ్యతిరేకించినప్పటి సానుకూలతల అభిమాన దురభిమానాల్లో- 


ఏది సత్యం, ఏ దసత్యం, ఏది చీకటి, ఏది వెలుతురు...

కొప్పర్తి వెంకటరమణమూర్తి

98495 25765

Updated Date - 2020-12-21T06:58:54+05:30 IST