ఆరు నెలల్లోనే...!

ABN , First Publish Date - 2022-01-24T04:48:34+05:30 IST

వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువను ప్రభుత్వం మరోమారు పెంచనుందన్న విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ఆరు నెలల్లోనే...!

- రెండోసారి పెరగనున్న భూముల విలువ

- రిజిస్ట్రేషన్‌ల విలువ భారీగా పెరిగే అవకాశం

- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి..

- జిల్లాలో సర్వత్రా చర్చ

కామారెడ్డి, జనవరి 23: వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువను ప్రభుత్వం మరోమారు పెంచనుందన్న విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 2021 జూలై 22 నుంచి పెంచిన విలువలు అమల్లోకి వచ్చాయి. ఆరు నెలలు గడవకముందే ప్రభుత్వం మరోసారి పెంపుదలపై నిర్ణయం తీసుకోవడంపై భూముల కొనుగోలు, అమ్మకాలు జరిపే వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల తర్వాత పెంచాల్సిన విలువను ఆరు నెలల్లోనే ప్రభుత్వం ఎలా పెంచుతుందని వాపోతున్నారు. అయితే భూముల, ఆస్తుల విలువలు పెరిగితే ప్రభుత్వానికి చెల్లించే రిజిస్ట్రేషన్‌ చార్జీలు కూడా పెరుగనున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌లకు ప్రజలు సిద్ధం అవుతున్నారు.

ఇప్పటికే ఆకాశన్నింటిన ధరలు

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి చాలా వరకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై ప్రత్యేక దృష్టి సారించారు. పెద్ద మొత్తంలో భూముల కొనుగోలు, అమ్మకాలు జరుపుతూ వస్తున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడతో పాటు రాష్ట్ర, జాతీయ రహదారులు ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వెంచర్లు ఏర్పాటు చేసి రియల్‌ వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే ధరలు ఆకాశాన్నంటాయి. కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి మండలంతో పాటు భిక్కనూర్‌, మాచారెడ్డిలతో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గంలో భూముల ధర సామాన్యుడు అందుకోలేని స్థాయికి పెరగనుంది. కామారెడ్డిలో ఎకరం భూమి ప్రస్తుతం రూ.1.50కోట్ల వరకు పలుకుతుండగా, భిక్కనూర్‌లో దాదాపు రూ.80లక్షల వరకు పలుకుతోంది. ఎల్లారెడ్డి, బాన్సువాడలో రూ.1 కోటి వరకు ధర పలుకుతుంది.

భూముల రిజిస్ట్రేషన్‌ చార్జీలు 50 శాతం పెరుగుదల

ప్రస్తుతం ప్రభుత్వం పెంచనున్న భూముల రిజిస్ట్రేషన్‌ చార్జీలలో వ్యవసాయేతర భూములకు 25 శాతం, వ్యవసాయ భూములకు 50శాతం పెంచనుంది. ఈ లెక్కన మారుమూల ప్రాంతాల్లో ప్రస్తుతం 100 గజాలకు రూ.15 వేలు ఖర్చు అవుతుండగా పెరిగిన ధరలతో రూ.30వేల వరకు కానుంది. అదేవిధంగా సామాన్యుడు సొంత ఇంటి కళను నెరవేర్చుకునేందుకు రూపాయి రూపాయి కష్టపడి దాచుకుని ఎక్కడైన ఇంటిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకుందామంటే 25 శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజు పెరగడంతో అదనపు భారం భరించాల్సి వస్తోంది. రెండు సంవత్సరాలకోసారి రిజిస్ట్రేషన్‌ ఫీజులు పెంచాల్సి ఉండగా ప్రభుత్వం ఈ తరహాలో 6 నెలలకే మళ్లీ పెంచడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు.

ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి..

గత సంవత్సరం జూలైలో భూముల ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఆరు నెలలు గడవకముందే మరోసారి భూముల రిజిస్ట్రేషన్‌ ధరలు పెంచడంతో రియల్‌ వ్యాపారుల్లో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే కరోనా ఇబ్బందులతో భూముల కొనుగోలు, అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయని వాపోతున్నారు. అప్పులు తీసుకువచ్చి రియల్‌ వ్యాపారం చేస్తుండగా రిజిస్ట్రేషన్‌ ధరలు మరోసారి పెంచితే ప్రస్తుతం జరుగుతున్న రియల్‌ వ్యాపారం కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదని వాదన వినిపిస్తున్నారు. ఏది ఎమైనా ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చే పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


ఉత్తర్వులు రాలేదు

- శ్రీలత, సబ్‌ రిజిష్ర్టార్‌ కామారెడ్డి

ప్రభుత్వం భూముల విలువ పెంచుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఉత్తర్వులు మాత్రం రాలేదు. విలువ పెరిగితే ముందస్తు రిజిస్ట్రేషన్‌ల కోసం రావచ్చు. జూలైలో విలువ పెంచిన ముందురోజునే రిజిస్ట్రేషన్‌లు నిలిపివేశారు.

Updated Date - 2022-01-24T04:48:34+05:30 IST