సింగరేణి సూపర్‌ బజార్లలో రూ. 40 లక్షల స్వాహా

ABN , First Publish Date - 2022-05-29T04:11:23+05:30 IST

సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే సూపర్‌ బజార్లలో పని చేసే ఉద్యోగుల చేతివాటం బయటపడింది. డిసెంబర్‌ నుంచి సూపర్‌ బజార్ల లెక్కల్లో తేడాలు వస్తున్నాయి. సూపర్‌ బజార్ల ద్వారా సింగరేణి కార్మికులకు, కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరకులను, వంట గ్యాస్‌ సరఫరా జరుగుతుంది. సరకులు ఖాళీ అవుతుండడం, రాబడి కనిపిం చకపోవడం, బ్యాంక్‌లో సొమ్ము జమ కాకపోవడంతో అధికారులకు అను మానం వచ్చి వారం కిందట ఆడిట్‌కు ఆదేశించారు.

సింగరేణి సూపర్‌ బజార్లలో రూ. 40 లక్షల స్వాహా
క్రిష్ణా కాలనీలోని సూపర్‌ బజార్‌లో రికార్డులను పరిశీలిస్తున్న ఎండీ చిత్తరంజన్‌ కుమార్‌

ఉద్యోగుల బ్యాంక్‌ అకౌంట్ల సీజ్‌, పోలీసులకు ఫిర్యాదు

వివరాలను వెల్లడించిన సూపర్‌బజార్‌ ఎండీ చిత్తరంజన్‌కుమార్‌

నస్పూర్‌, మే  28: సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే సూపర్‌ బజార్లలో పని చేసే ఉద్యోగుల చేతివాటం బయటపడింది. డిసెంబర్‌ నుంచి సూపర్‌ బజార్ల లెక్కల్లో తేడాలు వస్తున్నాయి. సూపర్‌ బజార్ల ద్వారా సింగరేణి కార్మికులకు, కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరకులను, వంట గ్యాస్‌ సరఫరా జరుగుతుంది. సరకులు ఖాళీ అవుతుండడం, రాబడి కనిపిం చకపోవడం, బ్యాంక్‌లో సొమ్ము జమ కాకపోవడంతో అధికారులకు అను మానం వచ్చి వారం కిందట ఆడిట్‌కు ఆదేశించారు. ఆడిట్‌ అధికారి కాంతా రావు ఆధ్వర్యంలో మాంగ్యా, రవిలు రంగంలోకి దిగారు. శ్రీరాంపూర్‌ డీఎం పరిధిలో గల రామకృష్ణాపూర్‌, కృష్ణాకాలనీ, ఆర్‌కే-5 కాలనీలోని సూపర్‌బ జార్ల ఆడిట్‌ చేసి నివేదికను ఉన్నతాధికారులకు నివేదించారు. విచారణలో దాదాపు రూ. 40లక్షలకు పైగా స్వాహా అయినట్లు నిర్ధారణకు వచ్చారు. రామకృష్ణాపూర్‌ సూపర్‌ బజార్‌లో రూ. 35 లక్షలు, శ్రీరాంపూర్‌ ఏరియాలో రూ. 6 లక్షల వరకు అవకతవకలు జరిగినట్లు తేలింది. 

 జరిగింది ఇలా

శ్రీరాంపూర్‌, మందమర్రి ఏరియాల్లో కార్మికులకు సూపర్‌ బజార్ల ద్వారా నిత్యావసర సరకులు, వంట గ్యాస్‌ను సరఫరా చేస్తారు. దీని ద్వారా వచ్చిన సొమ్మును బ్యాంకులో జమ చేయాల్సి ఉంటుంది. బ్యాంకులో జమ చేసే సమయంలో ఓచర్‌లో అమౌంట్‌ రాసే చోట ఖాళీగా వదిలి పెట్టి తక్కువ మొత్తం బ్యాంక్‌లో జమ చేస్తారు. బ్యాంకు నుంచి వచ్చిన రశీదు తీసుకుని ఖాళీగా వదిలిన స్థలంలో అనుకూలమైన అంకెను రాసి సూపర్‌ బజార్‌ రికార్డులో చూపిస్తారు. ఈ తతంగం డిసెంబర్‌ నుంచి జరుగుతుండగా ఆడిట్‌తో బయటపడింది. డిసెంబరు నుంచి రికార్డులను పరిశీలించి రూ.40 లక్షలకు పైగా సొమ్ము స్వాహా అయినట్లు నిర్ధారించారు. రామకృష్ణాపూర్‌ ఇద్దరు ఉద్యోగులు తప్పుడు లెక్కలు చూపి దాదాపు రూ.35 లక్షలను స్వాహా చేయగా శ్రీరాంపూర్‌ ఏరియాలోని రెండు సూపర్‌ బజార్లలో ఇద్దరు ఉద్యోగులు ఏకంగా స్వంతానికి వాడుకున్నారు. 

బాధ్యులపై చర్యలు

సూపర్‌ బజార్‌ ఎండీ చిత్తరంజన్‌ కుమార్‌

సూపర్‌ బజార్లలో సొమ్మును కాజేసిన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటా మని సూపర్‌ బజార్ల మేనేజింగ్‌ డైరెక్టర్‌ చిత్తరంజన్‌ కుమార్‌ పేర్కొన్నారు. కృష్ణా కాలనీ సూపర్‌ బజార్‌ను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రామకృష్ణాపూర్‌ సూపర్‌బ జార్‌లో ఉద్యోగులు భాస్కర్‌, నాగరాజులు స్వాహా చేసినట్లు తేలిందన్నారు. వీరిద్దరిపై శ్రీరాంపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కృష్ణా కాలనీ సూపర్‌ బజార్‌లో పని చేసే ఉద్యోగుల్లో ఒకరు రూ.2.29 లక్షలు,  మరొకరు రూ.3.63 లక్షలను స్వంతానికి వాడుకున్నారని పేర్కొన్నారు. సొమ్మును రికవరీ చేసిన తరువాత విధులకు తీసుకొంటామన్నారు.  డీఎం రాజేశ్వర్‌ రావు, అధికారులు పాల్గొన్నారు. 

ఉద్యోగులపై కేసు నమోదు

రామకృష్ణాపూర్‌ సూపర్‌ బజార్‌లో దాదాపు రూ. 40 లక్షల అవకతవ కలకు పాల్పడిన ఇద్దరు ఉద్యోగులు భాస్కర్‌, నాగరాజులపై శనివారం కేసు నమోదు చేసినట్లు శ్రీరాంపూర్‌ ఎస్సై మానస తెలిపారు. సూపర్‌ బజార్‌ రీజియన్‌ డీఎం రాజేశ్వర్‌రావు ఇచ్చిన పిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. 


Updated Date - 2022-05-29T04:11:23+05:30 IST