ఆర్టీసీ బస్సుల్లో..చిల్లర కష్టాలు!

ABN , First Publish Date - 2022-08-13T06:08:23+05:30 IST

ఆర్టీసీ బస్సుల్లో..చిల్లర కష్టాలు!

ఆర్టీసీ బస్సుల్లో..చిల్లర కష్టాలు!

కనీస చార్జీ రూ.10కి పెంపు.. బాగా తగ్గిన రూ. 5 నాణేల రాక   

తగినంత చిల్లర రాక.. ప్రయాణికులకు సర్దలేక కండక్టర్ల అవస్థలు 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఆర్టీసీ బస్సుల్లో మళ్లీ చిల్లర సమస్య మొదలైంది. కనీస చార్జీని రూ.5 నుంచి రూ.10కి పెంచడంతో కండక్టర్లు రూ.5 నాణేలు రాక ఇబ్బంది పడుతున్నారు. గతంలో కనీస ధర రూ.5 ఉం డేది. దీంతో ఎక్కువగా రూ.5 నాణేలు వచ్చేవి. దీంతో కండక్టర్ల దగ్గర చిల్లర పుష్కలంగా ఉండేది. ఈ చిల్లరను నగదు జమచేసే డీసీ రూమ్‌లకు అప్పగించేవారు. డీసీ రూమ్‌ల నుంచి పెద్ద సంఖ్యలో ఐదు రూపాయల నాణాలు బయటకు ఇచ్చి వాటి స్థానంలో నోట్లు తీసుకునేవారు! బయటకు ఇవ్వడం దేవుడెరుగు.. కండక్టర్లకు ఇవ్వడానికీ చిల్లర అందుబాటులో ఉండడం లేదు. కనీస చార్జీని రూ.10కి పెంచడంతో అందరూ నోట్లనే ఇస్తు న్నారు. రూ.10, రూ.20, రూ.30 చార్జీలకు సమస్య లేదు. రూ.15, రూ.25, రూ.35, రూ.45లకే సమస్య వస్తోంది. చిల్లర రాకపోవటంతో ప్రయాణికుడికి రూ.5 ఇవ్వడానికి కండక్టర్లు వెతుక్కోవాల్సి వస్తోంది. చాలా సందర్భాల్లో చిల్లర లేక ఇద్దరికి కలిపి రూ.10 ఇచ్చి పంచుకోమంటున్నారు. ప్రయా ణికులు దిగాల్సిన ప్రాంతాలు వేర్వేరు కావడంతో కొందరు కండక్టర్లతో వాగ్వాదాలకు దిగుతున్నారు. ఒకే స్టేజిలో దిగాల్సి వచ్చినా.. రూ.5 కోసం షాపుల వెంట తిరగాలని, ఏదైనా కొంటే కానీ దుకాణాల వారు చిల్లర ఇవ్వడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. కండక్టర్లు తమ దగ్గర రూ.5 లేక ఇవ్వలేకపోతే చార్జీలు పెంచిది కాక, ఇదొక అదనపు దోపిడీనా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. చిల్లర యుద్ధం ఆర్టీసీలో కొద్ది రోజులుగా తారస్థాయికి చేరింది.   

యూపీఐ ఆధారిత క్యూఆర్‌ కోడ్‌లు పెట్టాలి 

యూపీఐ ఆప్షన్‌ పెట్టాలని కొంత మంది ప్రయాణికులు కోరుతున్నారు.  రిక్షాపై కూరగాయలు అమ్మేవారు కూడా క్యూఆర్‌ కోడ్‌ పెట్టి, మొబైల్‌ ద్వారా స్కాన్‌ చేసి, డబ్బులు పంపుతున్నారని, చిల్లర సమస్యను అధిగమిస్తున్నారని అంటున్నారు. ఆర్టీసీ అధికారులు కండక్టర్లకు యూపీఐ ఆధారిత క్యూఆర్‌ కోడ్‌లను ఇచ్చి.. ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎంల ద్వారా పేమెంట్‌ చేయిస్తే చిల్లర సమస్య తప్పుతుందని అంటున్నారు.

Updated Date - 2022-08-13T06:08:23+05:30 IST