దూసుకొచ్చిన రాకాసి లారీలు

ABN , First Publish Date - 2021-10-24T08:39:10+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన అంబోజు కృష్ణ (32) మణుగూరు మునిసిపాలిటీ పరిధిలోని..

దూసుకొచ్చిన రాకాసి లారీలు

  • బైక్‌ను బొగ్గు లారీ ఢీకొని తండ్రి, ఇద్దరు పిల్లల మృతి.. మణుగూరులో ఘోరం
  • మరో ఘటనలో ట్రాలీ ఆటోను ఢీకొట్టిన లారీ
  • ట్రాలీ ఆటోడ్రైవర్‌ మృత్యువాత 


మణుగూరు/పెనుబల్లి, అక్టోబర్‌ 23: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన అంబోజు కృష్ణ (32) మణుగూరు మునిసిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కంపౌండర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు ఇద్దరు పిల్లలు. కుమార్తె జాహ్నవి (10) పుట్టినరోజును పురస్కరించుకుని ములుగు జిల్లా మంగపేట మండలం దోమెడలో నివాసముండే తన అత్తగారింటికి గురువారం కుటుంబసమేతంగా వెళ్లాడు. శుక్రవారం జాహ్నవి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అనంతరం కృష్ణ.. జాహ్నవి, ప్రీతమ్‌ (7)లను తీసుకుని బైక్‌పై శనివారం మణుగూరుకు బయలుదేరాడు. ఈ క్రమంలో మణుగూరు-ఏటూరునాగారం ప్రధాన రహదారిపై వారి బైక్‌ను వెనుక నుంచి బొగ్గు లారీ అతివేగంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌ అదుపు తప్పి కృష్ణ, ఆయన పిల్లలు లారీ కింద పడిపోయారు. కృష్ణ, ప్రీతమ్‌ అక్కడిక్కడే మృతి చెందారు. జాహ్నవిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. మణుగూరు సీఐ భానుప్రకాశ్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.


మరో ఘటనలో ట్రాలీ ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఆటోడ్రైవర్‌ చనిపోయాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన అనంత చిన్న వెంకటేశ్వరరావు (52) శుక్రవారం రాత్రి తన ట్రాలీ ఆటోలో టెంట్‌ సామగ్రి వేసుకొని జాతీయ రహదారిపై కుప్పెనకుంట్లకు వెళుతున్నాడు. ఈ క్రమంలో తుమ్మలపల్లి, కుప్పెనకుంట్ల మార్గంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఆయన ఆటోను ఢీకొంది. దీంతో తీవ్రగాయాలైన వెంకటేశ్వరరావును స్థానికులు పెనుబల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఆయన మృతి చెందాడు. ఈ ఘటనపై వీఎం బంజర్‌ ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాస్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-24T08:39:10+05:30 IST