ప్రైవేటులో.. డోసు రూ.150

ABN , First Publish Date - 2021-02-28T08:05:17+05:30 IST

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్‌ ధర ఖరారైంది. ఒక్కో డోసును రూ.250కి అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శులతో నిర్వహించిన

ప్రైవేటులో.. డోసు రూ.150

సర్వీసు చార్జీ  రూ.100  అదనం

కరోనా టీకా ధర ఖరారు.. రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్రం స్పష్టత 

రేపటి నుంచి రాష్ట్రంలో మూడో విడత వ్యాక్సినేషన్‌.. సుమారు 90 లక్షల మందికి టీకా 

60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక సమస్యలున్న వారికీ వ్యాక్సిన్‌  

కేంద్రం ప్రత్యేక మార్గదర్శకాలు.. పీహెచ్‌సీ నుంచి బోధనాస్పత్రి వరకూ అందుబాటులో వ్యాక్సిన్‌ 

564 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లోనూ టీకా కేంద్రాలు.. ప్రభుత్వాస్పత్రుల్లో టీకా ఉచితం 


అమరావతి/హైదరాబాద్‌, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి) : ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్‌ ధర ఖరారైంది. ఒక్కో డోసును రూ.250కి అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ దీనిపై స్పష్టతనిచ్చారు. టీకా ధర రూ.150 కాగా, ప్రైవేటు ఆస్పత్రులు సర్వీసు చార్జీగా మరో రూ.100 వసూలు చేయనున్నాయి. దీంతో డోసు ధర రూ.250 అవుతుంది. అయితే రెండో డోసుకు సేవా రుసుము ఉంటుందా? ఉండదా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. రెండో విడత వ్యాక్సినేషన్‌ కోసం టీకా కంపెనీల నుంచి ఒక్కో డోసును రూ.167కి కేంద్రం కొనుగోలు చేయనుంది. ఈ ధరలో కొంత రాయితీ ఇచ్చి రూ.150కే ప్రైవేటు ఆస్పత్రులకు డోసులు సమకూర్చనుంది. 60 ఏళ్లు పైబడినవారు, 45-59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి మార్చి 1నుంచి వ్యాక్సినేషన్‌ చేయనున్న నేపథ్యంలో రాష్ట్రాల కార్యాచరణ, టీకా ధరపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కొవిడ్‌ కేసులు వేగంగా పెరగకుండా నియంత్రణ కోసం కట్టడి ప్రాంతాలు, సర్వైలెన్స్‌ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాజీవ్‌ గౌబ సూచించారు.


కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా మార్చి 1న ఉదయం 10 నుంచి 11.30 గంటల మధ్య వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఏపీలోనూ అదే సమయంలో మూడో విడత ప్రక్రియను ప్రారంభించడానికి ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ దశలో దాదాపు 90 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 60ఏళ్లు దాటినవారికి, 45-59 మధ్య వయసు వారిలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారికి టీకా అందిస్తారు. మూడోవిడతలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ పరిధిలో ఉన్న 564 ఆస్పత్రులతో కలిపి మొత్తం 2,222 ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్‌ వేస్తారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ కేంద్రాల ఏర్పాటుకు ఆరోగ్యశాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు అన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు సమాచారం ఇచ్చారు. 


అప్పటికప్పుడే టీకా 

ఈసారి వ్యాక్సిన్‌ కేంద్రాల వద్దే రిజిస్ట్రేసన్‌ ప్రక్రియను పూర్తి చేస్తారు. 60 ఏళ్లు దాటినవారు తమ ఆధార్‌ కార్డును చూపిస్తే వ్యాక్సిన్‌ కేంద్రం వద్దనే రిజిస్ట్రేషన్‌ చేసి, ఆ వెంటనే వ్యాక్సిన్‌ అందిస్తారు. 


నేడో, రేపో కేంద్ర ప్రకటన

కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ జాతీయ నిపుణుల బృందం సారథి, నీతి ఆయోగ్‌ సభ్యుడు వి.కె.పాల్‌ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం.. కొవిషీల్డ్‌ (ఆక్స్‌ఫర్డ్‌), కొవాగ్జిన్‌ (భారత్‌ బయోటెక్‌) కంపెనీల ప్రతినిధుల మధ్య పలు దఫాలుగా జరిగిన చర్చల్లో ప్రైవేటులో టీకా ధరపై నిర్ణయం తీసుకుంది. దీనిపై నేడో, రేపో కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది.

Updated Date - 2021-02-28T08:05:17+05:30 IST