కవిత్వంలేని కవితలో...

ABN , First Publish Date - 2020-06-08T08:15:57+05:30 IST

కవిత్వంలేని కవితలో చిరుగాలికే కరిగి కొన్ని చినుకులై కురిసిన తడి మేఘం కదలాడింది లోలోపలి మాటేదో గబగబా చెప్పేయాలన్న...

కవిత్వంలేని కవితలో...

కవిత్వంలేని కవితలో

చిరుగాలికే కరిగి

కొన్ని చినుకులై కురిసిన

తడి మేఘం కదలాడింది

లోలోపలి మాటేదో

గబగబా చెప్పేయాలన్న

కవి ఆత్రం కనబడింది!


కవిత్వంలేని కవితలో

ప్రాకుతున్న పసిపాప

గోడలు పట్టుకుని లేస్తున్నప్పటి

ఒక వెలకట్టలేని ప్రయత్నం 

కోయిల కమ్మగా పిలిచిందని

ఆదరాబాదర విచ్చేసిన

వసంతం ఆరాటం 

అన్యాపదేశంగానే కనబడ్డాయి!


నోటికి బాగా వచ్చేసిన పద్యం

అడిగీ అడగ్గానే అప్పజెప్పేసిన

చిన్నప్పటి జ్ఞాపకం ఒకటి

కవిత్వంలేని కవితతో

మళ్లీ కళ్లముందుకొచ్చింది


కవిత్వంలేని కవితలో

నేర్చుకున్న బతుకు పాటొకటి

పచ్చిపచ్చిగానే వినబడింది

రేపటి పైరు కావాల్సిన నారుమడి

పచ్చపచ్చగా నవ్వింది!


తీరంలో నిలబడీ నిలబడగానే

కాళ్ళను అల్లుకుపోయే

కెరటాల అల్లరితనం 

మరోసారి స్ఫురణకొచ్చింది


కవిత్వంలేని కవితలో

ఒక వాక్యంకాలేని

జీవితం 

అలంకారాల్లేని వ్యక్తిత్వం

సహజాతి సహజంగా పూసింది!

సాంబమూర్తి లండ

96427 32008


Updated Date - 2020-06-08T08:15:57+05:30 IST