పెన్‌గంగాలో.. ఇసుక దొంగలు!

ABN , First Publish Date - 2022-05-13T05:28:03+05:30 IST

జిల్లా సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెన్‌గంగా నదిలో ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. అడుగడుగునా పెన్‌గంగా నదిని జల్లెడ పడుతూ అక్రమంగా ఇసుక దందాకు ఎగబడుతున్నారు.

పెన్‌గంగాలో.. ఇసుక దొంగలు!

పెన్‌గంగా నదిలో చేపడుతున్న ఇసుక తవ్వకాలు

అడ్డగోలుగా తవ్వేస్తూ అమ్మేసుకుంటున్న మాఫియా

అక్రమార్కులకు మంచి ఆదాయమార్గంగా పెన్‌గంగా

నది నీటిని మళ్లిస్తూ యథేచ్ఛగా తవ్వకాలు

సరిహద్దు మండలాల్లో అధికార పార్టీ నేతలదే పెత్తనం

ఫిర్యాదు చేస్తేనే పోలీసు, రెవెన్యూ అధికారుల హడావుడి

ఆదిలాబాద్‌, మే12(ఆంధ్రజ్యోతి) : జిల్లా సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెన్‌గంగా నదిలో ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. అడుగడుగునా పెన్‌గంగా నదిని జల్లెడ పడుతూ అక్రమంగా ఇసుక దందాకు ఎగబడుతున్నారు. దీంతో పెన్‌గంగా నది అక్రమార్కులకు మంచి ఆదాయ మార్గంగా మారింది. పెన్‌గంగా నదిలో పుష్కలంగా ఇసుక మేటలు అందుబాటులో ఉన్నాయి. అసలే వేసవి కాలం కావడంతో నదిలో నీటి ఉదృతి తగ్గిపోయింది. ఇదే అదునుగా నది పరివాహాక ప్రాంతంలో ఉన్న సరిహద్దు గ్రామాల వీడీసీలు టెండర్లు పెట్టి మరి యథేచ్ఛగా ఇసుకను అమ్మేసుకుంటున్నా అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ముఖ్యంగా బేల, జైనథ్‌, తాంసి, తలమడుగు, భీంపూర్‌ మండలాల్లో జోరుగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. జిల్లాలో ఎక్కడ అధికారిక ఇసుక రీచ్‌లకు అనుమతులు లేక పోయినా నిత్యం వందల వాహనాలలో ఇసుకను తరలిస్తున్నారు. ఇదేదో రాత్రిపూట జరుగుతుందంటే పొరపాటే. పట్టపగలే యథేచ్ఛగా అక్రమదందా జరుగుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అధికారులకు కనిపించినా కళ్లు మూసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదు చేస్తేనే అధికారులు అడప దడపగా దాడులు చేసి హడావుడి చేస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్‌ అధికారుల మధ్య సమన్వయం లేక పోవడంతో అక్రమ ఇసుక దందాకు అడ్డుకట్ట పడడం లేదు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఇసుక మాఫియా ఆశచూపే మాముళ్లకు ఆశపడి అడ్డుచెప్పడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సరిహద్దుల్లో కొరవడిన నిఘా..

పొరుగున ఉన్న మహారాష్ట్రకు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్న సరిహద్దుల్లో నిఘా కరువవుతోంది. నెలనెలా అందుతున్న మామూళ్లతో సరిహద్దు చెక్‌పోస్టు అధికారులు కూడా అడ్డుచెప్పడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్రలో పెద్దపెద్ద కాంట్రాక్టర్లతో సంబంధాలు పెట్టుకుంటున్న ఇసుక మాఫియా రాత్రి పగలు అనే తేడా లేకుండా పెన్‌గంగా నది నుంచి తరలిస్తున్నారు. మహారాష్ట్ర అధికారులు ఇసుక తవ్వకాలపై కఠినంగా వ్యవహరించడంతో జిల్లా నుంచి ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న చెక్‌డ్యాంలు, ఇతర పనులకు ఇసుకను సరఫరా చేస్తున్న మాఫియా ఇది చాలదంటూ మహారాష్ట్రలోని మాండ్వి, కిన్వట్‌, ఇతర ప్రాంతాలకు రాత్రికి రాత్రే ఇసుకను సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద మామూళ్లు ముట్టచెప్పి తమదందాకు అడ్డూ అదుపు లేకుండా చేసుకుంటున్నారు. మహారాష్ట్రలో ఇసుకకు భారీ డిమాండ్‌ ఉండడంతో కొందరు అధిక ధరలకైనా టెండర్లను దక్కించుకుంటున్నారు. సరిహద్దు దాటే వరకు మాది బాధ్యత అంటూ భరోసా కల్పించడంతో మహారాష్ట్ర నుంచి నిత్యం వందలాది వాహనాలు క్యూ కడుతున్నాయి. దొరికితే దొంగ లేదంటే దొర అన్న చందంగా ఇసుక దందా కొనసాగుతుంది.

బొందల గడ్డగా పెన్‌గంగా..

ఇసుక టెండర్లను దక్కించుకుంటున్న మాఫియా భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలను చేపట్టడంతో పెన్‌గంగా నది బొందలగడ్డగా మారిపోతుంది. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్న అధికారులు నిఘా సారించక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం వందలాది టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించుకు పోతున్న అడ్డుకునే నాథుడే కరువవుతున్నాడు. వేసవిలోనూ పెన్‌గంగా నది ప్రవహించడంతో ఇసుక తవ్వకాలకు నీటి ప్రవాహం ఆటకంగా మారుతుందన్న ఉద్దేశంతో జైనథ్‌ మండలం సాంగ్వి, డోలార, పెండల్‌వాడ గ్రామ సమీపంలో నదినీటిని మళ్లీంచి ఇసుక తవ్వకాలను చేపడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆందోళనకు దిగడంతో స్పందించిన అధికారులు నీటి ప్రవాహానికి వేసిన అడ్డుకట్టలను తొలగించారు.  అలాగే నది నుంచి ఇసుకను తరలించేందుకు యథేచ్ఛగా దారులు వేసుకుంటూ ఇసుకను తరలిస్తున్నారు. నది ఒడ్లను ధ్వంసం చేయడంతో భారీ వరదలు వచ్చిన సమయంలో పంట చేనులోకి వరద నీరు చేరుకుంటుందని రైతులు వాపోతున్నారు. ఇంత బహిరంగంగా జరుగుతున్న అఽధికారులు మాత్రం అడ్డుచెప్పినట్లు కనిపించడం లేదు. యేటా ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆదాయానికి గండిపడుతున్నా అధికార యతాంగం మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తుందనే చెప్పవచ్చు.

అంతా వారిదే పెత్తనం..

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలదే పెన్‌గంగా నదిపై పెత్తనం అన్నట్లుగా కనిపిస్తుంది. వారు చెప్పిన వారికే టెండర్లు దక్కడం ఆనవాయితీగా వస్తోంది. నది సరిహద్దు మండలాలైన భీంపూర్‌, తాంసి, జైనథ్‌, బేల మండలాల్లోని అధికార పార్టీ నేతలు చెప్పిందే మండల స్థాయి అధికారులు పాటించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాదు కూడదంటే మండల స్థాయి అధికారులైన తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎస్సైలపై బదిలీ వేటు వేయడం పరిపాటిగానే మారుతోంది. కొందరు నేతలైతే అక్రమదందాల కోసమే అధికార పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీలో చేరిపోవడం అలవాటుగా మారింది. ప్రధానంగా సరిహద్దు మండలాల్లో కొందరు నేతలు ఇసుక వ్యాపారం కోసమే అధికార పార్టీలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లోనైతే అధికార పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్‌ నేతలంతా కలిసి కమిషన్లను పంచుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికార ప్రతిపక్ష నేతలంతా ఒక్కటి కావడంతో జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసే వారే కరువవుతున్నారు. సరిహద్దు మండలాల్లో పార్టీలు వేరైనా నేతలంతా ఒక్కటే అన్నట్లుగా కనిపిస్తోంది. 

నిరంతరంగా పర్యవేక్షిస్తున్నాం..

- రవిశంకర్‌ (జిల్లా మైనింగ్‌ ఏడీ,ఆదిలాబాద్‌)

పెన్‌గంగా నది నుంచి అక్రమంగా ఇసు కను తరలిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. దీంతో ని రంతరంగా పర్యవేక్షణ చేస్తున్నాం. క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారులు నిఘా సారించాలని ఆదేశాలు ఇచ్చాం. మహారాష్ట్ర ప్రాం తాలకు ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘాను సారిస్తున్నాం. జిల్లాలో ఎక్కడ అధికారిక ఇసుక రీచ్‌లు లేవు. ఎవరైనా ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుకను తరలిస్తే తప్పని సరిగా అనుమతులు తీసుకోవాలి. పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారంతో అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేస్తాం. 


అక్రమంగా ఇసుక టెండర్లను దక్కించుకున్నది వీరే..

గ్రామం రూ. దక్కించుకున్న వారు

డొల్లార     రూ.40లక్షలు వెంకటేశ్‌

పెండల్‌వాడ రూ.12లక్షలు         విలాస్‌

ఆనంద్‌పూర్‌   రూ.25లక్షలు     రాంరెడ్డి

సాంగ్వి     రూ.18లక్షలు     రమేష్‌రెడ్డి

సాంగిడి రూ.60లక్షలు     అనిల్‌కుమార్‌

Read more