పీలేరు సంతలో పొట్టేళ్లే...పొట్టేళ్లు

ABN , First Publish Date - 2022-07-04T05:14:42+05:30 IST

ముస్లింల పవిత్ర బక్రీద్‌ పండుగ సమీపిస్తుండడంతో ఆదివారం పీలేరులో జరిగిన పశువుల వారపు సంతకు పొట్టేళ్లు పోటెత్తాయి.

పీలేరు సంతలో పొట్టేళ్లే...పొట్టేళ్లు
వ్యాపారులు, జీవాలతో కిటకిటలాడుతున్న పీలేరు సంత

రైతులు, వ్యాపారులతో కిటకిటలాడిన సంత 

పీలేరు, జూలై 3: ముస్లింల పవిత్ర బక్రీద్‌ పండుగ సమీపిస్తుండడంతో ఆదివారం పీలేరులో జరిగిన పశువుల వారపు సంతకు పొట్టేళ్లు పోటెత్తాయి. ఏడాది వయస్సు నుంచి మూడేళ్ల వయస్సున్న పొట్టేళ్లను రైతులు అమ్మకాల కోసం సంతకు తీసుకురావడంతో సంతలో ఎటుచూసినా పొట్టేళ్లే కనిపించాయి. బక్రీద్‌ పండుగ సందర్భంగా తమ త్యాగనిరతిని చాటుకోవడానికి ముస్లింలు పొట్టేళ్లు, మేకపోతులను ఖుర్బానీ ఇస్తుంటారు. పట్టణీకరణ పెరిగిపోయిన నేపథ్యంలో పశువులను మేపుకునే సౌకర్యం లేని వారు పండుగకు వారం, పది రోజుల ముందు వాటిని కొనుగోలు చేసి పండుగ రోజున ఖుర్బానీ ఇస్తుంటారు. దీంతో ప్రతి ఏటా బక్రీద్‌ పండుగకు ముందు జరిగే సంతల్లో పొట్టేళ్లు పెద్దసంఖ్యలో దర్శనమిస్తుంటాయి. కొంతమంది ఔత్సాహిక రైతులు కేవలం బక్రీద్‌ పండుగను దృష్టిలో పెట్టుకుని పదుల సంఖ్యలో పొట్టేళ్లను మేపుతుంటారు. వీటన్నింటి నేపథ్యంలో పీలేరు సంతకు ఆదివారం కేవలం పీలేరు మాత్రమే కాకుండా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె, పెద్దమండ్యం, రామాపురం, సుండుపల్లె మండలాల నుంచి రైతులు తమ పొట్టేళ్లను తీసుకువచ్చారు. వాటిని కొనుగోలు చేయడానికి స్థానికులు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో వ్యాపారులు విచ్చేశారు. కొనుగోలుదారులు ఎక్కువగా ఉండడం, పొట్టేళ్లు పరిమిత సంఖ్యలో ఉండడంతో వాటి ధరలు సాధారణ సమయాల కంటే రెండు, మూడు రెట్లు అధికంగా పలికాయి. అమ్మకానికి వచ్చిన భారీ సైజ్‌ పొట్టేళ్లు తమ కొమ్ములతో రాజసాన్ని ప్రదర్శించగా వాటిని పెంచిన రైతులు తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందన్న సంతోషంతో వెనుదిరిగారు. సాధారణ సమయాల్లో రూ.10 వేలు ఖరీదు చేసే పొట్టేలు ఆదివారం రూ.15 వేల నుంచి రూ.20 వేలు పలికాయి. పొట్టేళ్లతోపాటు మేకపోతులకు కూడా మంచి ధరలు లభించాయి. పెద్దపెద్ద చెవులతో ఉండే కశ్మీరీ మేకపోతులు ఆదివారం సంతలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 



Updated Date - 2022-07-04T05:14:42+05:30 IST