అప్పుడు జిన్నా.. ఇప్పుడు బీజేపీ: మెహబూబా ముఫ్తీ

ABN , First Publish Date - 2022-03-22T22:28:11+05:30 IST

చరిత్ర గురించి ఏమాత్రం అవగాహన లేకుండా, చరిత్రను వక్రీకరించే ధోరణితో పెద్ద సినిమాలే రూపొందుతున్నాయి. కశ్మీర్‌లో ఏం జరిగిందో నా కళ్లతో ఎంతో చూశాను. పాకిస్తాన్‌లో ఏడుగురు హిందూ బాలురు చనిపోతే అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పెయ్ అక్కడికి వెళ్లి..

అప్పుడు జిన్నా.. ఇప్పుడు బీజేపీ: మెహబూబా ముఫ్తీ

శ్రీనగర్: ‘‘గతంలో మహ్మద్ అలీ జిన్నా ఈ దేశాన్ని రెండుగా విడదీశారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అదే ప్రయత్నం చేస్తోంది’’ అని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత మెహబూబా ముఫ్తీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాపై తీవ్ర వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఇదే విషయమై ముఫ్తీ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయులను మతాలుగా విడగొట్టి దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారంటూ ఆమె నిప్పులు చెరిగారు.


మంగళవారం జమ్మూ కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో నిర్వహించిన సమావేశంలో ముఫ్తీ మాట్లాడుతూ ‘‘చరిత్ర గురించి ఏమాత్రం అవగాహన లేకుండా, చరిత్రను వక్రీకరించే ధోరణితో పెద్ద సినిమాలే రూపొందుతున్నాయి. కశ్మీర్‌లో ఏం జరిగిందో నా కళ్లతో ఎంతో చూశాను. పాకిస్తాన్‌లో ఏడుగురు హిందూ బాలురు చనిపోతే అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పెయ్ అక్కడికి వెళ్లి చూసి వచ్చారు. కశ్మీర్‌లో సర్దార్లు, పండిట్లు కూడా చంపేశారు. నా తండ్రి, చిన్నాన్న, సోదరుడు హత్యకు గురయ్యారు. ఆర్టికల్ 370 తర్వాత కశ్మీర్‌లో చాలా బాధాకర పరిస్థితులు ఇంకా బలహీనపడ్డాయి. ఇది కాదు కదా మనకు కావాల్సింది. రక్తపాతం కాదు, కశ్మీర్‌లో శాంతి కావాలి’’ అని ప్రశ్నించారు.


ఇంకా ఆమె మాట్లాడుతూ ‘‘కానీ, బీజేపీ అలా చూడడం లేదు. మనం పాకిస్తాన్‌తో నిత్యం ఏదో కయ్యం పెట్టుకుంటూ ఉండాలనే కోరుకుంటోంది. దేశ ప్రజల సమస్యల కంటే వారికి రాజకీయాలే ముఖ్యమయ్యాయి. అందుకే ఈ దేశ ప్రజల్ని మతం పేరు మీద రెండుగా విభజిస్తున్నారు. ఇది ఎంతకు పోతుందో? గతంలో జిన్నా ఈ దేశాన్ని రెండు ముక్కలు చేశారు. ఇప్పుడు బీజేపీ అదే ప్రయత్నంలో ఉంది’’ అని అన్నారు.

Updated Date - 2022-03-22T22:28:11+05:30 IST