పంచాయతీ స్థాయిలో కర్ఫ్యూ సమర్థవంతంగా అమలు

ABN , First Publish Date - 2021-05-08T04:47:02+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ నియంత్రణ కోసం పంచాయతీల స్థాయిలో కర్ఫ్యూను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు సర్పంచ్‌లను కోరారు.

పంచాయతీ స్థాయిలో కర్ఫ్యూ సమర్థవంతంగా అమలు

 టెలీకాన్ఫరెన్స్‌లో సర్పంచ్‌లను కోరిన కలెక్టర్‌

నెల్లూరు(హరనాథపురం), మే 7 : జిల్లాలో కొవిడ్‌ నియంత్రణ కోసం  పంచాయతీల స్థాయిలో కర్ఫ్యూను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు సర్పంచ్‌లను కోరారు. కలెక్టర్‌ శుక్రవారం టెలీకాన్ఫ రెన్స్‌లో నూతనంగా ఎన్నికైన సర్పంచులతో మాట్లాడారు. మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పూర్తి స్థాయిలో కర్ఫ్యూను అమలు చేసి కొవిడ్‌ వ్యాప్తిని కట్టడి చేయాలన్నారు. ప్రజలు ఉదయం దుకాణాలకు వెళ్లినప్పుడు భౌతిక దూరం పాటిస్తూ మాస్క్‌ ధరించి శానిటైజర్‌ వాడేలా చూడాలన్నారు. పండుగలు, జాతరలను తక్కువ స్థాయిలో జరిగేలా చూడాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు మెరుగుపరచాలన్నారు. ఉపాధిహామీ కూలీలు మాస్కులు తప్పని సరిగా ధరించాలన్నారు. గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. భవన నిర్మాణ , హైవే, నిర్మాణ పనులు కర్ఫ్యూ నుంచి సడలించామన్నారు. బ్యాంకులు, గ్యాస్‌ కంపెనీలు, పెట్రోలు బంకులు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వీధిదీపాలు, టెలిఫోన్‌, ఇంటర్నెట్‌ తదితర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చామన్నారు. వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేసి ప్రజల ఆరోగ్య పరిస్థితిని చూడాలన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి మందుల కిట్లు అందిచాలన్నారు.  సర్పంచులకు  త్వరలో చెక్‌పవర్‌ వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా నలుగురు సర్పంచ్‌లు వ్యక్తం చేసిన సందేహాలకు, ప్రశ్నలకు కలెక్టర్‌ సమాధానమిచ్చారు. తొలుత కలెక్టర్‌ సర్పంచ్‌లకు అభినందనలు తెలిపారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2021-05-08T04:47:02+05:30 IST