15 ఉద్యోగాలకు 11,000 దరఖాస్తులు

ABN , First Publish Date - 2021-12-29T17:40:04+05:30 IST

మధ్య ప్రదేశ్‌లో నిరుద్యోగం విలయతాండవం చేస్తోంది. 15 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ కాగా దాదాపు 11,000 మంది దరఖాస్తు చేశారు.

15 ఉద్యోగాలకు 11,000 దరఖాస్తులు

భోపాల్ : మధ్య ప్రదేశ్‌లో నిరుద్యోగం విలయతాండవం చేస్తోంది. 15 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ కాగా దాదాపు 11,000 మంది దరఖాస్తు చేశారు. ఈ ఉద్యోగాలకు విద్యార్హత పదో తరగతి ఉత్తీర్ణత కాగా, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంజినీర్లు, ఎంబీఏ చదివినవారు, సివిల్ జడ్జి ఉద్యోగం కోసం పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నవారు కూడా దరఖాస్తు చేశారు. దరఖాస్తుదారుల్లో పొరుగు రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌వారు కూడా ఉండటం విశేషం. 


మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్‌‌లో ఓ ప్రభుత్వ శాఖ ఉద్యోగ నియామకాల ప్రకటనను జారీ చేసింది. బంట్రోతులు, డ్రైవర్లు, వాచ్‌మెన్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 15 ఖాళీలు ఉన్నాయని తెలిపింది. దీంతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున స్పందించారు. మధ్య ప్రదేశ్‌కు చెందినవారు మాత్రమే కాకుండా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రవాసులు కూడా దరఖాస్తు చేశారు. 


మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్తున్న మాటలకు, వాస్తవాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఖాళీలను భర్తీ చేయడానికి వెనుకాడబోమని, సంవత్సరానికి 1 లక్ష చొప్పున ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేస్తామని ఇటీవల చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వోద్యోగాన్ని కోరుకుంటారని, అయితే ప్రతి విద్యార్థికి ప్రభుత్వోద్యోగం దొరకదనేది సత్యమని తాను చెప్పాలనుకుంటున్నానని తెలిపారు. 


Updated Date - 2021-12-29T17:40:04+05:30 IST