కోనసీమలో విజృంభణ

ABN , First Publish Date - 2022-01-25T07:02:04+05:30 IST

కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రభావం కోనసీమలో రోజురోజుకూ పెరుగుతోంది. అమలాపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పదహారు మండలాల్లో సోమవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 641 కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కోనసీమలో విజృంభణ
రాయవరం ఉన్నత పాఠశాలను శానిటైజ్‌ చేస్తున్న దృశ్యం

సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 641 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ

బ్యాంకులు, విద్యా సంస్థల్లో పెరుగుతున్న కేసులు 8 ఆందోళనలో ప్రజలు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రభావం కోనసీమలో రోజురోజుకూ పెరుగుతోంది. అమలాపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పదహారు మండలాల్లో సోమవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 641 కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పాజిటివ్‌ కేసులు ఇంటింటా ఉన్నప్పటికీ పరీక్షలు నామమాత్రంగానే చేయడంతో కేసుల సంఖ్య అధికారికంగా స్వల్పంగా నమోదవుతోంది. గత కొన్ని రోజులుగా వైరస్‌ వ్యాప్తి తీవ్రమైంది. సంక్రాంతి పర్వదినాల తర్వాత వైరస్‌ ప్రభావం తీవ్రంగా వ్యాపిస్తుండడంతో ప్రజలు స్వల్ప లక్షణాలతో కొవిడ్‌ బారిన పడి ఇళ్లల్లోనే మందులు వాడుతూ కోలుకుంటున్నారు. జిల్లాస్థాయిలో కోనసీమలో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు. ముఖ్యంగా కొవిడ్‌ బాధితులను ఆదుకునే లక్ష్యంతో అల్లవరం మండలం బోడసకుర్రులో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను పునరుద్ధరించి బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. సోమవారం అమలాపురం డివిజన్‌లోని పదహారు మండలాల్లో 641 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు కోనసీమలో 53,878 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  235 మరణాలు రికార్డు అయ్యాయి. అత్యధికంగా అమలాపురంలో 108, అత్యల్పంగా అయినవిల్లిలో 12 కేసులు నమోదయ్యాయి. మండలాల వారీగా... అల్లవరం 67, అంబాజీపేట 61, ఆత్రేయపురం 56, కొత్తపేట 19, మామిడికుదురు 92, మలికిపురం 54, పి.గన్నవరం 32, రాజోలు 43, సఖినేటిపల్లి 66, ఉప్పలగుప్తం 31 కేసులు ఉన్నాయి.  

కాగా జిల్లావ్యాప్తంగా సోమవారం 941 కేసులు  వెలుగు చూశాయి. మొత్తం 3,02,696 పాజిటివ్‌ కేసులు కాగా 7,094 యాక్టివ్‌ కేసులుగా నమోదయ్యాయి. కోనసీమవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు హాజరవుతున్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సైతం పాజిటివ్‌ నిర్ధారణ అవుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పలు బ్యాంకుల్లోని సిబ్బందికి పాజిటివ్‌ తేలడంతో అవి మూతపడే పరిస్థితి కనిపిస్తోంది. కాట్రేనికోన మండలం కందికుప్ప హైస్కూలులో పని చేస్తున్న ఒక ఉపాధ్యాయునికి కరోనా సోకింది. దాంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సెలవు ప్రకటించారు. ఇలా అనేకచోట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. 

రాయవరం:  స్థానిక శ్రీరామయ్య జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఈ నెల 21న పాఠశాలకు చెందిన 18 మందికి ఉపాధ్యాయులకు, సిబ్బందికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఏడుగురు టీచర్లకు, ఒక వలంటీర్‌ టీచర్‌కు, ఒక నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి పాజిటివ్‌ నిర్థారణ అయ్యింది. దీంతో గ్రామస్తులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హెచ్‌ఎం పప్పు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తరగతి గదులు, పాఠశాల ప్రాంగణం, టాయిలెట్లను శానిటైజ్‌ చేయించారు. 



Updated Date - 2022-01-25T07:02:04+05:30 IST