గ్రూప్‌-1లో తమకు నచ్చినవారిని ఎంపిక చేశారు!

ABN , First Publish Date - 2022-08-10T16:05:47+05:30 IST

హైకోర్టు సింగిల్‌ జడ్జి(High Court Single Judge) ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా గ్రూప్‌-1(Group-1) ప్రధాన పరీక్ష జవాబుపత్రాలను మాన్యువల్‌ విధానంలో

గ్రూప్‌-1లో తమకు నచ్చినవారిని ఎంపిక చేశారు!

మూల్యాంకన ఫలితాలు తొక్కిపెట్టారు

మళ్లీ జరిపి నచ్చినవారిని ఎంపిక చేసుకున్నారు

ఇది హైకోర్టు సింగిల్‌ జడ్జి ఉత్తర్వులకు విరుద్ధం

ఏపీపీఎస్సీ అభ్యర్థుల అదనపు అఫిడవిట్‌


అమరావతి ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు సింగిల్‌ జడ్జి(High Court Single Judge) ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా గ్రూప్‌-1(Group-1) ప్రధాన పరీక్ష జవాబుపత్రాలను మాన్యువల్‌ విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలుచేశారు. మొదటిసారి చేసిన మూల్యాంకనం ఫలితాలు(Evaluation results) వెల్లడించకుండా తొక్కిపెట్టి, రెండోసారి మూల్యాంకనంలో తమకు నచ్చినవారిని ఎంపిక చేసుకున్నారని పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబరు 1న సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల మేరకు మాన్యువల్‌ మూల్యాంకనం 3 నెలల్లో పూర్తి చేయాల్సి ఉందన్నారు. అయితే ఏపీపీఎస్సీ దాఖలు చేసిన కౌంటర్‌లో మూల్యాంకనం ప్రక్రియ 2022న మార్చి 25న ప్రారంభమైనట్లు పేర్కొందన్నారు. మాన్యువల్‌ విధానంలో మూల్యాంకనం చేసే ప్రక్రియ ప్రారంభమైందని, ఫిబ్రవరి 2022లో ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొంటూ ఈ ఏడాది జనవరి 1న అప్పటి ఏపీపీఎస్సీ(APPSC) సెక్రటరీ పత్రికాప్రకటన విడుదల చేశారన్నారు. దీన్నిబట్టి చూస్తే 2021 డిసెంబరు 5 నుంచి 2022 ఫిబ్రవరి 26 మధ్య జరిగిన మాన్యువల్‌ మూల్యాంకనం ఫలితాలు ప్రకటించకుండా ఉద్దేశపూర్వకంగా తొక్కి పెట్టినట్లు స్పష్టమవుతోందన్నారు.


‘‘జవాబుపత్రాలను డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేసిన సమయంలో ప్రత్యేక షీట్‌లో మార్కులు వేసినట్లు ఏపీపీఎస్సీ హైకోర్టుకు తెలిపింది. దీనిని బట్టి డిజిటల్‌ విధానంలో జవాబుపత్రాలతో ఉన్న ఓఎంఆర్‌ షీట్లు వినియోగించలేదని అర్థమవుతోంది. ఈ ఓఎంఆర్‌ షీట్లను 2021 డిసెంబరు - 2022 ఫిబ్రవరి మధ్య జరిగిన మాన్యువల్‌ మూల్యాంకన ప్రక్రియలో వినియోగించారు. ఫిబ్రవరి మొదటి వారానికి పేపర్లు దిద్దే ప్రక్రియ పూర్తి అవుతుందని, ఫిబ్రవరి 14 నుంచి మూల్యాంకనం అనంతర ప్రక్రియ చేపట్టాలని కోరుతూ  డేటా టెక్‌ మెథడిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అప్పటి ఏపీపీఎస్సీ సెక్రటరీ పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు వర్క్‌ఆర్డర్‌ ఇచ్చారు. దీన్ని బట్టి మొదటిసారి జరిపిన మాన్యువల్‌ మూల్యాంకనం ఫిబ్రవరి రెండోవారానికే పూర్తి అయ్యిందని అర్థమవుతోంది. రెండోసారి మాన్యువల్‌ విధానంలో జబాబు పత్రాలు దిద్దేందుకు పూర్వం ఉన్న బార్‌కోడ్‌తో కొత్త ఓఎంఆర్‌ షీట్లు, కంట్రోల్‌ బండిల్‌ స్లిప్పులు ముద్రణ కోసం డేటా టెక్‌ మెథడిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఏపీపీఎస్సీ ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, మే నెలల్లో కొనుగోలు ఆర్డర్లు ఇచ్చింది. మొత్తం 49,000 ఓఎంఆర్‌ బార్‌కోడ్‌ షీట్లు, 6300 కంట్రోల్‌ బండిల్‌ స్లిప్పులు ఆర్డర్‌ చేసింది. 


ఒక్కసారే మాన్యువల్‌ విధానంలో మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించింది. రెండుసార్లు మాన్యువల్‌గా పేపర్లు దిద్దించడం ద్వారా ఏపీపీఎస్సీ హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించింది. ఏపీపీఎస్సీ సింగిల్‌ జడ్జి వద్ద దాఖలు చేసిన అఫిడవిట్‌ మేరకు గ్రూప్‌-1 ప్రధాన పరీక్షకు మొత్తం 9678 మంది అర్హత సాధించగా 6807 మంది పరీక్షకు హాజరయ్యారు. వారందరూ ఏడు పరీక్షలు రాస్తే 47,649 జబాబు పత్రాలు ఉండాలి. వాటికి అంతే సంఖ్యలో ఓఎంఆర్‌ షీట్లు అవసరమవుతాయి. కానీ ఏపీపీఎస్సీ 49,000 ఓఎంఆర్‌ షీట్లు ఎందుకు ఆర్డర్‌ చేసింది? మొత్తం 48,442 ఓఎంఆర్‌ షీట్లు వినియోగించినట్లు బిల్లులు చెల్లింపులను చూస్తే అర్థమౌతుంది. అదనంగా ముద్రించిన షీట్లను కావాల్సిన వారిని ఎంపిక చేసుకొనేందుకు వినియోగించుకున్నారు’’ అని అఫిడవిట్‌లో పిటిషనర్లు పేర్కొన్నారు.

Updated Date - 2022-08-10T16:05:47+05:30 IST