ప్రభుత్వ కార్యాలయాల్లో... భయం భయం

ABN , First Publish Date - 2021-05-11T05:42:33+05:30 IST

కరోనా రెండో దశ ఉఽధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

ప్రభుత్వ కార్యాలయాల్లో...  భయం భయం
కార్పొరేషన్‌ కార్యాలయంలో విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులు

ఉద్యోగుల్లో ఆందోళన

వర్క్‌ ఫ్రం హోమ్‌కు డిమాండ్‌


కడప(ఎడ్యుకేషన్‌), మే 10:  కరోనా రెండో  దశ ఉఽధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ఉపాధ్యాయులు, రెవెన్యూ, ఇతర శాఖల ఉద్యోగులు కరోనా కాటుకు గురై మృతి చెందారు. ఇప్పటికైనా వీలయినంత ఎక్కువ మందికి వర్క్‌ ఫ్రం హోం ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు.


ప్రతి కార్యాలయంలో కేసులు

జిల్లాలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కేసులు నమోదవుతున్నాయి. చాలా మంది మృత్యువాత పడుతున్నారు. తాజాగా కడప ప్రాథమిక విద్య ఆర్‌జేడీ కార్యాలయంలో ఆరు గురు ఉద్యోగులకు కరోనా సోకి ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే ఆ కార్యాలయంలో శానిటేషన్‌ జరగలేదు. దీంతో ఉద్యోగులు భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే కడప ఆర్డీవో కార్యాలయంలో ఇద్దరు, డీఈవో కార్యాలయంలో ముగ్గురు, కడప కార్పొరేషన్‌లో పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అగ్రికల్చర్‌ జేడీ కార్యాలయంలో కూడా ఏడుగురు కరోనా బారిన పడినట్లు సమాచారం. జిల్లా ఖజానా, ఉప ఖజానా కార్యాలయాల్లో ఇప్పటికే కొంత మంది ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు కరోనాతో పోరాటం చేస్తున్నట్లు సమాచారం. ఇలా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

అమల్లోకి రాని వర్క్‌ ఫ్రం హోం

కరోనా రెండో దశ విజృంభిస్తున్నా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటివరకు వర్క్‌ఫ్రం హోం అనే అంశం అమల్లోకి రావడంలేదు. ఉద్యోగులు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం ఉంది. ఈ నేపధ్యంలో వర్క్‌ ఫ్రం హోం సరైన మార్గమని ఉద్యోగులంటున్నారు. కార్యాలయాల్లో క్షేత్ర స్థాయి పర్యటనలు, పనులు ఉండే ఉద్యోగులు తప్ప మిగిలిన వారందరికీ ఇంటి వద్దనే పని చేసుకునే వెసులుబాటు కల్పించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 


పొద్దున, మధ్యాహ్నం విధులు కల్పించాలి

- శివారెడ్డి, ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు

కరోనా రెండో దశ శరవేగంగా విస్తరిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికే చాలా మంది ఉద్యోగ ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు. చాలామంది మృతి చెందారు కూడా. ప్రతి కార్యాలయంలో రెండు విభాగాలుగా విభజించి పొద్దున ఒక విభాగం, మధ్యాహ్నం ఒక విభాగం విధులు నిర్వహించినట్లయితే భౌతిక దూరం ఉంటుంది ఇబ్బంది ఉండదు. లేదంటే రోజుమార్చి రోజు విధులకు హాజరయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.


వర్క్‌ ఫ్రం హోం కల్పించాలి

- లెక్కల జమాల్‌రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం వెసులుబాటు కల్పించాలి. ఇప్పటికే కొంత మంది ఉద్యోగులు కరోనాతో మృతి చెందారు. మిగతా వారు తమ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారు. ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపాలంటే ప్రభుత్వం వర్క్‌ ఫ్రం హోం అమలు చేయాలి. ఫీల్డ్‌ వర్క్‌ చేసే ఉద్యోగులు తప్ప మిగతా వారికి ఈ వెసులుబాటు కల్పించాలి.

 

Updated Date - 2021-05-11T05:42:33+05:30 IST